logo

సాంకేతికత తోడుగా నీటి వృథాకు అడ్డుకట్ట

నీటి వృథా నివారణకు ఆధునిక సాంకేతికత తోడుగా కొత్త పద్ధతుల్లో అడ్డుకట్ట వేసే సరికొత్త ఆలోచనలు అంకురించాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీలో స్మార్ట్‌ సిటీ లివింగ్‌ ల్యాబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నీటి సవాల్‌ (వాటర్‌ ఛాలెంజ్‌)లో

Published : 20 Jan 2022 03:11 IST

‘వాటర్‌ ఛాలెంజ్‌’లో ముగ్గురు విజేతల వినూత్న ఆలోచనలు

ఈనాడు, హైదరాబాద్‌: నీటి వృథా నివారణకు ఆధునిక సాంకేతికత తోడుగా కొత్త పద్ధతుల్లో అడ్డుకట్ట వేసే సరికొత్త ఆలోచనలు అంకురించాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీలో స్మార్ట్‌ సిటీ లివింగ్‌ ల్యాబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నీటి సవాల్‌ (వాటర్‌ ఛాలెంజ్‌)లో ముగ్గురు విజేతలుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ పట్టణ యాజమాన్య సంస్థ(ఎన్‌ఐయూఎం) భాగస్వామ్యంతో ఆరు నెలల కిందట ఈ పోటీలు ప్రారంభించారు. దేశంలోని వివిధ నగరాలకు చెందిన అంకురసంస్థలు దరఖాస్తు చేశాయి. వివిధ దశల్లో వడపోత తర్వాత నీటి ఆదా/వృథా అడ్డుకట్టకు వినూత్న పరిష్కార మార్గాలు సూచించిన మూడు సంస్థలను ఎంపిక చేశారు. ఓషియో వాటర్‌ కంపెనీ, ట్రిపుల్‌ఐటీహెచ్‌-స్మార్ట్‌ వాటర్‌ మీటర్‌ సొల్యూషన్స్‌, క్రిస్నం టెక్నాలజీ కంపెనీలు విజేతలుగా నిలిచాయి. ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(మైటీ), జలమండలి, ఎన్‌ఐయూఎం, ప్రపంచ వనరుల సంస్థ(డబ్ల్యూఆర్‌ఐ), ఈరోపియన్‌ బిజినెస్‌ టెక్నాలజీ సెంటర్‌(ఈబీటీసీ)కి చెందిన నిపుణులు విజేతలను ఎంపిక చేశారు. విజేతలకు ట్రిపుల్‌ఐటీ తరఫున మెంటారింగ్‌ ఇవ్వనున్నారు. ఎన్‌ఐయూఎం, హెచ్‌ఎండీఏ సహకారంతో తెలంగాణలోని ఏదైనా ఒక జిల్లాలో మీటర్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ‘‘స్మార్ట్‌సిటీ లివింగ్‌ ల్యాబ్‌ సాయంతో ఆధునిక సాంకేతికతను వినియోగించి చేసే ఆవిష్కరణలకు చేయూతనిస్తున్నాం. దీనివల్ల ప్రజలకు మేలు జరగడంతోపాటు సరికొత్త ఆలోచనలకు ఊతం లభిస్తుంది’’ అని వర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఇన్నొవేషన్‌ అడ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌(సీఐఈ) సీవోవో, కో ఇన్నొవేషన్‌ ప్రొ.రమేశ్‌ లోగనాథన్‌ వివరించారు.

ఇవీ ఆలోచనలు

ఓషియో వాటర్‌ కంపెనీ: అంతరిక్షం నుంచి పైపులైను లీకేజీలు గుర్తించడం. శాటిలైట్‌ నుంచి సేకరించిన ఫొటోల ఆధారంగా కృత్రిమ మేధ సాయంతో గణించి లీకేజీలను తెలుసుకోవడం.

ట్రిపుల్‌ఐటీహెచ్‌-స్మార్ట్‌ వాటర్‌ మీటర్‌ సొల్యూషన్స్‌: డిజిటల్‌ వాటర్‌ మీటర్ల స్థానంలో అనలాగ్‌ మీటర్లను రెట్రో ఫిట్టింగ్‌తో డిజిటలైజేషన్‌ చేయడం.

క్రిస్నమ్‌ టెక్నాలజీస్‌: పైపుల్లో అల్ట్రాసోనిక్‌ మీటర్లను ఏర్పాటు చేసి రియల్‌ టైమ్‌లో నీటి సరఫరా లెక్కింపు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని