logo

బాగుబడిపోతున్నాయ్‌!

సర్కారీ బడి అంటే మౌలిక వసతుల లేమి గుర్తుకొస్తుంది. ఇకపై ఆ ఇబ్బందులు దూరం కానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘మన ఊరు-మన బడి’ పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. ఇందుకు రూ.3.56 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

Published : 20 Jan 2022 04:15 IST
రూ.3.56 కోట్లతో ‘మన ఊరు-మన బడి’ పథకం
ప్రయోగాత్మకంగా 4 పాఠశాలల్లో చురుగ్గా పనులు

ఈనాడు, హైదరాబాద్‌: సర్కారీ బడి అంటే మౌలిక వసతుల లేమి గుర్తుకొస్తుంది. ఇకపై ఆ ఇబ్బందులు దూరం కానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘మన ఊరు-మన బడి’ పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. ఇందుకు రూ.3.56 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు నగరం నుంచే అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని రెండేసి పాఠశాలలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి అభివృద్ధి చేయనున్నారు. గన్‌ఫౌండ్రిలోని ఆలియా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, మహబూబియా ప్రాథమిక, బాలికల ఉన్నత పాఠశాల, రంగారెడ్డి జిల్లా పరిధిలోని జిల్లెలగూడ, శివరాంపల్లిలోని మండల పరిషత్‌ ప్రాథమిక, జడ్పీ ఉన్నత పాఠశాలలల్లో ఫిబ్రవరి నెలాఖరుకు పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.

చేపట్టనున్న పనులు.. మరుగుదొడ్లు, తాగునీటి వసతి, గదులకు మరమ్మతులు,  విద్యుద్దీకరణ, రంగులేయడం, హరిత బోర్డులు, ప్రహరీ, ప్రవేశ ద్వారం, వంట గదుల నిర్మాణం.

జిల్లెలగూడ పాఠశాల.. రంగులు వేస్తున్నారు. విద్యుదీకరణ పనులు నడుస్తున్నాయి. సీలింగ్‌, ఫ్లోరింగ్‌ మరమ్మతులు, సంపు నిర్మాణం జరుగుతోంది. రెండు అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. ఆవరణలో టైల్స్‌ వేస్తున్నారు.

శివరాంపల్లి పాఠశాల.. ప్రహరీ నిర్మాణం, ప్రవేశద్వారం, ఆర్చ్‌ నిర్మాణంలో ఉన్నాయి. వేదికకు మరమ్మతులు చేశారు. గతంలో నిర్మించిన షెడ్డును డైనింగ్‌ హాలుగా మారుస్తున్నారు. పైకప్పునకు మరమ్మతులు పూర్తయ్యాయి. మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. తాగునీటి సంపు నిర్మాణం జరుగుతోంది. తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్‌ జరగాల్సి ఉందని పాఠశాల ఎస్‌ఎంసీ ఛైర్మన్‌ పడమటి శ్రీధర్‌రెడ్డి వివరించారు.

ఆలియా పాఠశాల.. మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. తరగతి గదులకు రంగులు వేస్తున్నారు. ప్రాంగణంలో ముందుభాగంలో ఉన్న పాత భవనాన్ని పూర్తిగా కూల్చివేయనున్నారు. సంపు నిర్మాణం తుది దశకు చేరుకుంది.

మహబూబియా పాఠశాల.. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో కలిపి 780 మంది విద్యార్థులు చదువుతున్నారు. 3 డిజిటల్‌ తరగతి గదులున్నాయి. ప్రహరీ పూర్తిచేశారు. వైరింగ్‌ పూర్తయింది. ప్రత్యేక ప్రవేశ ద్వారం, నడకదారి, నీటి సంపు నిర్మిస్తున్నారు. నీరు కారకుండా భవన పైకప్పునకు మరమ్మతులు చేశారు. రంగులు వేస్తున్నారని ప్రధానోపాధ్యాయురాలు ముప్పిడి ఉమ అన్నారు.


తాగునీటి కనెక్షన్‌కు మినహాయింపు ఇస్తేనే..

పాఠశాలలకు తాగునీటి సరఫరా విషయంలో ఇబ్బంది ఎదురవుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొత్తగా కనెక్షన్‌ ఇవ్వాలంటే సేల్‌ డీడ్‌, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను జలమండలి అడుగుతోంది. మహబూబియా పాఠశాలలో తాగునీటి కనెక్షన్‌కు దరఖాస్తు చేయగా ధ్రువపత్రాలు ఇవ్వాలని షరతు విధించారు. దశాబ్దాల కిందట నిర్మించిన భవనం కావడంతో అవి లేవు. అందుకే పాఠశాలలకు ఈ విషయంలో మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు.


రూపురేఖలు మారుస్తాం: పి.సబితారెడ్డి, విద్యాశాఖ మంత్రి

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా అన్ని వసతులతో సర్కారు బడులను తీర్చిదిద్దుతాం. 11 అంశాలను ఎంచుకుని అభివృద్ధి చేస్తున్నాం. ముందు 4 పాఠశాలలలో పనులు జరుగుతున్నాయి. తర్వాత 3 విడతల్లో మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలను అభివృద్ధి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని