logo

ఇరుకు గదుల్లో బెరుకుగా..!

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉచిత హోం ఐసొలేషన్‌ సదుపాయం కోసం అభ్యర్థించేవారి సంఖ్య పెరుగుతోంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలకు ఈ తరహా అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే గదిలో ఉండే బ్రహ్మచారులు,

Published : 20 Jan 2022 04:15 IST

హఫీజ్‌పేటలో బాధితులకు ఔషధాల సంచిని అందజేస్తున్న సిబ్బంది

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉచిత హోం ఐసొలేషన్‌ సదుపాయం కోసం అభ్యర్థించేవారి సంఖ్య పెరుగుతోంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలకు ఈ తరహా అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే గదిలో ఉండే బ్రహ్మచారులు, ఇరుకు గదుల్లో ఉండే కుటుంబాల్లో ప్రత్యేక గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసొలేషన్‌ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. గతంలో ఎర్రగడ్డలోని బీఆర్‌కేఆర్‌ ఆయుర్వేద ఆసుపత్రి, బేగంపేట్‌లోని ప్రకృతి చికిత్సాలయంకు పంపేవారు. నేచర్‌క్యూర్‌లో ప్రస్తుతం 200 పడకలతో కేంద్రం సిద్ధం చేస్తున్నారు. కాకపోతే సంబంధిత ఆదేశాలు వెలువడలేదని, వెలువడిన వెంటనే సేవలు ప్రారంభమవుతాయని సూపరింటెండెంట్‌లు తెలిపారు.

ప్రైవేటు సెంటర్లకు

ప్రస్తుతం చాలామంది ప్రైవేటు ఐసొలేషన్‌ కేంద్రాలకు వెళ్తున్నారు. రోజుకు రూ.1000 నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఈసీఐఎల్‌ ఉండే చిరుద్యోగికి పరీక్షలో కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇరుకైన అద్దె ఇల్లు.. ఒకే బాత్‌రూమ్‌.. రెండేళ్ల కుమార్తె, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉండటంతో అప్పు చేసి ప్రైవేటు కేంద్రంలో చేరాడు. బ్రహ్మచారులు, ఒకే బాత్‌రూమ్‌, కామన్‌ బాత్‌రూమ్‌ ఉన్న వారిని దృష్టిలో పెట్టుకుని త్వరగా ఉచిత హోం ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


వారం రోజుల నుంచి అభ్యర్థనలు
- సాయిచరణ్‌, సామాజిక కార్యకర్త

కొవిడ్‌ మొదటి, రెండో దశల్లో కరోనా బాధితుల సహాయార్థం స్వచ్ఛంద సంస్థల సహకారంతో సేవలు అందించాం. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వారం రోజులుగా సహాయం కోసం అభ్యర్థనలు వస్తున్నాయి. ఎక్కువ మంది ఉచిత హోం ఐసొలేషన్‌ కోసం అడుగుతున్నారు. జీహెచ్‌ఎంసీకి ఫోన్‌ చేయగా ఇంకా ఏర్పాటు చేయలేదని చెప్పారు.


బల్దియాలో 1474 మందికి కరోనా

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మూడో దశ కలకలం రేపుతోంది. ప్రతి ఇంట్లో కేసులు బయటపడుతున్నాయి. రెండో దశతో పోల్చితే...ఈసారి చాలామందిలో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవడమే కొంతలో కొంత ఊరట. ఎక్కువ మంది హోం ఐసొలేషన్‌లోనే కోలుకుంటున్నారు. మరోవైపు నగర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. చాలామంది కార్యాలయాలకు రావడటం లేదు. పోలీసు శాఖతోపాటు హెచ్‌ఎండీఏ, జలమండలి, విద్యుత్తు, కలెక్టరేట్‌లు, జీహెచ్‌ఎంసీ తదితర విభాగాల్లో పదుల సంఖ్యలో సిబ్బందికి కరోనా సోకింది. బల్దియా పరిధిలో గడిచిన 24 గంటల్లో 1474 మంది కరోనా బారిన పడ్డారు. 95 శాతం మందిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.


ఓయూ వీసీకి...

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వవిద్యాల ఉపకులపతి ప్రొ.రవీందర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయని, హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తనను గత కొద్దిరోజులుగా కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని