logo

Crime News: హైదరాబాద్‌లో ఒక్కడే ఐదు గొలుసు చోరీలు

కరోనా వైరస్‌.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నా ఓ గొలుసు దొంగ మాత్రం దీన్ని అవకాశంగా మల్చుకున్నాడు. రాజధాని నగరంలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కడే ఐదు చోట్ల దొంగతనాలు చేశాడు.

Updated : 13 Jan 2023 12:02 IST
స్కూటీపై ప్రయాణిస్తూనే గొలుసుల తస్కరణ
ఒంటరి మహిళలే లక్ష్యం
ఈనాడు, హైదరాబాద్‌
మారేడ్‌పల్లిలో నిందితుడి సీసీ ఫుటేజీ

రోనా వైరస్‌.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నా ఓ గొలుసు దొంగ మాత్రం దీన్ని అవకాశంగా మల్చుకున్నాడు. రాజధాని నగరంలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కడే ఐదు చోట్ల దొంగతనాలు చేశాడు. ఒకచోట గొలుసు కొట్టేసే ప్రయత్నం చేయగా... విఫలమవడంతో పారిపోయాడు. ఇంటి పరిసర ప్రాంతాలు, దేవాలయాల సమీపంలో ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని ఒక్కసారిగా రెచ్చిపోయాడు. బాధిత మహిళల్లో ఒక ఎస్సై భార్య ఉండడం విశేషం. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో ఈ నేరాలు చోటు చేసుకున్నాయి. గొలుసు దొంగతనాలకు పాల్పడిన దొంగ ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో స్కూటీని దొంగిలించాడు. దానిపై వెళుతూ మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు తస్కరించి పారిపోతున్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దొంగ ఆచూకీని తెలుసుకుంటున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని హైదరాబాద్‌, సైబరాబాద్‌ సీపీలు సీవీ ఆనంద్‌, స్టీఫెన్‌ రవీంద్రలు తెలిపారు.

స్నాచింగ్‌లకూ రూట్‌మ్యాప్‌

నగరం, శివారు ప్రాంతాల్లో ఐదుచోట్ల గొలుసు చోరీలు చేసిన దొంగ వివరాలను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా తెలుసుకుంటున్నారు. ఈ దొంగ హైదరాబాద్‌ రూట్‌ మ్యాప్‌ను ఉపయోగించుకున్నాడని భావిస్తున్నారు. బాధితుల ద్వారా గొలుసు దొంగతనాలు జరిగిన సమయాలు, అతడి ముఖకవళికలు, స్కూటీ నంబర్‌ తీసుకున్నారు. సంఘటనా స్థలాలు... ఒక దొంగతనం జరిగిన ప్రాంతం నుంచి మరోటి జరిగిన ప్రాంతానికి మధ్య దూరం ఆధారంగా దొంగ ఎక్కడికి వెళ్లుంటారన్న అంశంపై పరిశోధిస్తున్నారు. మారేడ్‌పల్లి పోలీస్‌ ఠాణా పరిధిలోని ఇంద్రపురి కాలనీలో ఉదయం 10.05 గంటలకు గొలుసు చోరీ చేసిన దొంగ.. అటు నుంచి పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ ఠాణా పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీకి 11 గంటలకు చేరకున్నాడు. అక్కడ మరో మహిళ మెడలో గొలుసు దొంగతనం చేసేందుకు విఫలయత్నం చేశాడు. తర్వాత అటు నుంచి రాఘవేంద్ర కాలనీ, జీడిమెట్ల గ్రామంలో రెండు దొంగతనాలు చేసి... మధ్యాహ్నం తుకారాంగేట్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో నందన్‌నగర్‌, అక్కడి నుంచి సాయంత్రం 4.30 గంటలకు మేడిపల్లి పోలీస్‌ ఠాణా పరిధిలో సాయంత్రం 4.30 గంటలకు బోడుప్పల్‌ హనుమాన్‌ దేవాలయం నుంచి బయటకు వస్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కుని పారిపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని