TS News: బడ్జెట్‌లో నిధులు కేటాయించండి.. కేంద్ర ఆర్థిక మంత్రికి కేటీఆర్‌ లేఖ

రాష్ట్రంలో పురపాలకశాఖ తరఫున చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా ...

Published : 21 Jan 2022 01:40 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో పురపాలకశాఖ తరఫున చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన లేఖ రాశారు. కేపీహెచ్‌బీ నుంచి కోకాపేట మీదుగా నార్సింగి వరకు 30 కిలోమీటర్ల మేర ఎమ్మార్టీస్‌ మెట్రో నియో నెట్‌ వర్క్‌ ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నట్టు తెలిపిన మంత్రి.. ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ను ప్రస్తుత మెట్రో రైలు నెట్‌ వర్క్‌ను అనుసంధానిస్తుందని తెలిపారు. 2030 నాటికి రోజుకు 5లక్షల మంది ప్రయాణిస్తారని భావిస్తున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యవయమైన రూ.3,050 కోట్లలో 15 శాతాన్ని రూ.450 కోట్లు మంజూరు చేయాలని కోరారు.

 వరంగల్‌లో మెట్రో నియో ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని, ప్రాజెక్టు వ్యయంలో 20శాతంగా రూ.184 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌కు అనుగుణంగా రాష్ట్రంలో మెట్రో నియో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటును పరిశీలిస్తున్నట్టు కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌, పరిసరాల్లో మొత్తం 104 మిస్సింగ్‌ లింక్‌ రోడ్ల కారిడార్లకు రూ.2,400 కోట్ల వ్యయం అవుతుందని, అందులో మూడో వంతు రూ.800 కోట్లు ఇవ్వాలని కోరారు. రూ.9వేల కోట్ల వ్యయంతో నిర్మించే ప్యారడైజ్‌ కూడలి నుంచి షామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ కూడలి, కండ్లకోయ వరకు ఆరులేన్ల ఎలివేటెడ్‌ కారిడార్లకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రూ.11,500 కోట్ల వ్యయంతో స్కైవేలతో కలిపి మూసీ వెంట ఇరువైపులా తూర్పు-పశ్చిమ కారిడార్ల అనుసంధానానికి నిధులు ఇవ్వాలని, ఎస్సార్డీపీ రెండో దశకు రూ.14వేల కోట్ల వ్యయం అవుతుందని లేఖలో పేర్కొన్నారు. రానున్న కేంద్ర బడ్జెట్ లో ఈ మేరకు ఆయా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని