logo

విజ్ఞాన వీచిక.. నైపుణ్య వేదిక

అర్థమయ్యే విధంగా సైన్స్‌ పాఠాలను బోధిస్తే, విద్యార్థులు మరింత ఆసక్తి చూపుతారు. ఈ పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు కొత్త ఆలోచనలు, వినూత్న

Published : 21 Jan 2022 01:05 IST

రాష్ట్రస్థాయిలో ప్రదర్శనకు సైన్స్‌ ఉపాధ్యాయులకు ఆహ్వానం

దుద్యాల పాఠశాలలో పరికరాలు చూపుతున్న ఉపాధ్యాయుడు

న్యూస్‌టుడే, కొడంగల్‌ గ్రామీణం, బొంరాస్‌పేట: అర్థమయ్యే విధంగా సైన్స్‌ పాఠాలను బోధిస్తే, విద్యార్థులు మరింత ఆసక్తి చూపుతారు. ఈ పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు కొత్త ఆలోచనలు, వినూత్న విధానాలను అన్వేషిస్తుంటారు. నిరంతరం అభ్యాసనం చేస్తూ వృత్తిలో నైపుణ్యం పెంచుకుంటారు. తరగతి గదుల్లో వాటిని అమలు చేస్తూ మంచి ఫలితాలు రాబడుతుంటారు. అలాంటి వారంతా ఎప్పటికప్పుడు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) చేయూత ఇస్తోంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 28న నిర్వహించే ‘జాతీయ సైన్స్‌ దినోత్సవం’ సందర్భంగా 2021- 22 ఏడాదికి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ‘సదస్సు’ కు సైన్స్‌ ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తోంది. బోధనలో కొత్తగా ఆకట్టుకునే విధానాలతో కూడిన ఆలోచనల అంశాలతో ఫిబ్రవరి 2లోపు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..

కొత్త విషయాలు తెలుసుకునేలా

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న సైన్స్‌ ఉపాధ్యాయులు బోధనలో చేపట్టే కొత్త విధానాలను ఇతరులతో పంచుకునే అవకాశంగా భావిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే సదస్సులో పాల్గొంటే ఇతర ప్రాంతాల ఉపాధ్యాయుల వృత్తిలోని నైపుణ్యం, కొత్త అంశాలు తెలుసుకునేందుకు ఈ సదస్సు దోహద పడుతుంది. తరగతి గదిలో బోధించే అంశాలు మరింత వేగంగా, సులువుగా విద్యార్థులకు అర్థమయ్యేలా అవలంభిస్తున్న పద్ధతులను తెలుసుకోవచ్ఛు జిల్లాలోని ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రైవేట్‌ పాఠశాలల సైన్స్‌ ఉపాధ్యాయులతో పాటుగా ఉపాధ్యాయ శిక్షకులు, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఇందులో పాల్గొనవచ్ఛు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రాష్ట్రస్థాయిలో నిపుణుల బృందం పరిశీలించి ఉత్తమ అంశాలను ఎంపిక చేస్తారు. అలాంటి అంశాలను ఉపాధ్యాయులు సదస్సులో వివరించాల్సి ఉంటుంది. ఉత్తమంగా ఎంపికైన అంశాలను క్షేత్రస్థాయిలో పాఠశాలల్లో అమలుకు చర్యలు తీసుకుంటారు.

దరఖాస్తులు ఇలా చేసుకోవాలి

సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న సైన్స్‌ ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. వెయ్యి పదాలకు మించకుండా నాలుగు పేజీల్లో పంపాలి. పేరు, చిరునామా తదితర వివరాలతో ctgscertmathsscience@gmail.come అనే మెయిల్‌ ఐడీకి లేదా ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయానికి పోస్టుద్వారా ఫిబ్రవరి 2లోపు పంపాలి.

సద్వినియోగం చేసుకుంటే మేలు

కమాల్‌రెడ్డి, ఫిజికల్‌ సైన్స్‌ ఫోరం జిల్లా ప్రధానకార్యదర్శి, వికారాబాద్‌

ఇలాంటి సదస్సుల్లో పాల్గొనటంతో సైన్స్‌ ఉపాధ్యాయులకు బోధనలో నైపుణ్యాలు పెరుగుతాయి. జిల్లాలోని సైన్స్‌ ఉపాధ్యాయులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రోజురోజుకు సైన్స్‌ పరంగా వస్తున్న మార్పులను గమనిస్తూ బోధనలో నిత్య విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలు తెలుసుకోవాలి. అందుకు ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని