logo

నిధి.. దారులకు పెన్నిధి

జిల్లా వ్యాప్తంగా అస్తవ్యస్త రోడ్లతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లోని దారులు గుంతలు, కయ్యలు పడి ప్రయాణమంటేనే ప్రయాణికులు భయాందోళన చెందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరమ్మతు

Published : 22 Jan 2022 01:03 IST

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

తాండూరు-కొడంగల్‌ రోడ్డు దుస్థితి

జిల్లా వ్యాప్తంగా అస్తవ్యస్త రోడ్లతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లోని దారులు గుంతలు, కయ్యలు పడి ప్రయాణమంటేనే ప్రయాణికులు భయాందోళన చెందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరమ్మతు చేపట్టాలని ఎన్నోసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతులు సమర్పించారు. ఎట్టకేలకు సర్కారు స్పందించి మహబూబ్‌నగర్‌-చించోలి జాతీయ రహదారికి రూ.703 కోట్లు, పంచాయతీరాజ్‌, అంతర్గత దారుల నిర్మాణానికి మరో రూ.67 కోట్లు మంజూరయ్యాయి. వీటితో సత్వరం పనులు చేపట్టి పూర్తి చేస్తే ఇక్కట్లు తీరనున్నాయి.

జిల్లా మీదుగా వెళుతున్న రెండు జాతీయ రహదారుల్లో హైదరాబాద్‌-బీజాపూర్‌ దారి విస్తరణ, అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మహబూబ్‌నగర్‌-చించోలి మార్గంలో కొండంగల్‌ నుంచి తాండూరు, కర్ణాటక సరిహద్దు వరకు పేరుకు జాతీయ రహదారైనా భారీ వాహనాలు అధిక సామర్థ్యంతో రాకపోకలు సాగించడంతో ఎక్కడికక్కడ గుంతలు పడి అధ్వానంగా మారింది. ఈ దారిలో ప్రయాణం చేస్తే ఒళ్లు హూనమవుతోందని, వాహనాలు మరమ్మతుకు గురవుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొడంగల్‌ నుంచి తాండూరు వరకు 20 కిలోమీటర్ల దుస్థితి చెప్పనలవికాదు. దీనిని బాగు చేయాలని గతంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నడకతో నిరసన తెలిపారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని పరిష్కారం చూపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

పనుల చేపట్టేందుకు ముందడుగు
అదే సమయంలో జిల్లాలో సుమారు 950 కిలోమీటర్ల పంచాయతీరాజ్‌ రహదారులు ఉండగా, అందులో 55 రోడ్ల అభివృద్ధికి రూ.23.41 కోట్లు మంజూరయ్యాయి. అత్యధికంగా తాండూరు నియోజకవర్గంలో 26 పనులకు రూ.10.15 కోట్లు, నవాబుపేట మండలానికి (చేవెళ్ల నియోజకవర్గం)రూ.80 లక్షలు వచ్చాయి. మరో వైపు ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం రూ.12.5 కోట్లు విడుదల చేసింది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రజా ప్రతినిధులకు పనుల మంజూరు పత్రాలు (వర్క్‌ ఆర్డర్‌)లు అలందజేశారని సమాచారం. ప్రస్తుతం ఉపాధి హామీ నుంచి అంతర్గత రహదారులు (సీసీ రహదారులు), భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ నిర్మాణానికి రూ10 కోట్ల వరకు  ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

పల్లెల్లో: ప్రస్తుతం పంచాయతీ సర్పంచుల నుంచి ప్రతిపాదనలు, ఇంజినీరింగ్‌ విభాగాల నుంచి వ్యయం అంచనాలను రూపొందిస్తున్నారు. మరో వారం రోజుల్లో ప్రొసీడింగ్‌ కాపీలు వచ్చే అవకాశం ఉందని నాయకులు పేర్కొంటున్నారు. పనులు సక్రమంగా సాగి, నాణ్యతగా చేపడితే ఇన్నాళ్లు పడుతున్న ఇబ్బందులు తీరనున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో ఇప్పటికే పనులు పూర్తి చేసిన వాటికి రూ.35 కోట్ల వరకు(ఆర్‌అండ్‌బీ) బకాయిలు ఉన్నాయని గుత్తేదారులు పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు. బిల్లులు వస్తేనే పూర్తి చేస్తామని తెగేసి చెబుతున్నారు. ప్రస్తుతం వస్తున్న కేటాయింపులపై దీని ప్రభావం పడకుండా చూసుకోవాలని రాజకీయ నాయకులు భావిస్తున్నారు. పూర్తయిన వెంటనే చెల్లించేలా చూస్తామంటూ హామీ ఇస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని