logo

పరిగి ఆసుపత్రికి మహర్దశ

గ్రామీణులకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. స్థానికంగా ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యులు లేకపోవడం, వసతుల కొరత బాధితులను పట్టి పీడించేది. ఎన్నో ఆశలతో ఆసుపత్రికి

Published : 22 Jan 2022 01:03 IST

వైద్యవిధాన పరిషత్‌లో విలీనం

న్యూస్‌టుడే,పరిగి: గ్రామీణులకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. స్థానికంగా ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యులు లేకపోవడం, వసతుల కొరత బాధితులను పట్టి పీడించేది. ఎన్నో ఆశలతో ఆసుపత్రికి వెళ్తే చివరకు నిరాశతో వెనుదిరిగేవారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో భాగంగా పరిగి పట్టణ సామాజిక (సివిల్‌) ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్‌లోకి మార్చుతూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 పడకల సామర్థ్యమున్న 60 ఆసుపత్రులను ఇలా మార్చారు. ఇందులో పరిగికి అవకాశం దక్కింది. ఒక రకంగా నియోజకవర్గ ప్రజలకు ఇది శుభవార్తే. అయితే ఇకనైనా ఆసుపత్రి పనితీరు మెరుగు పడి సేవలు సక్రమంగా  అందుతాయని స్థానికులు ఆశిస్తున్నారు.

రూ. 3.5 కోట్లతో పక్కాభవనం
గతంలోనే ప్రభుత్వం సుమారు రూ.3.5కోట్ల అంచనా వ్యయంతో పక్కా భవనాన్ని అన్ని రకాల వసతులతో ఏర్పాటు చేశారు. వైద్యుల కొరత కారణంగా ప్రయోజనం లేకుండా పోయింది. మహిళలకు సిజేరియన్‌ ఆపరేషన్లు జరగాలంటే 60కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రం తాండూరు ఆసుపత్రికి, లేదా 80కిలోమీటర్ల దూరంలోని ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. దూరాభారం కావడం ఈలోపు జరగాల్సిన నష్టం జరుగుతుండటంతో చాలా మంది పేదలు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్య విధాన పరిషత్‌లోకి మారడంతో గైనకాలజిస్టు, మత్తు వైద్యుడు, పిల్లల వైద్య నిపుణులు, జనరల్‌ ఫిజిషీయన్‌, ఆర్థోపెడిక్‌, చెవి, ముక్కు, గొంతు తదితర వైద్యుల రాకతో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

నిత్యం 300 మంది: సివిల్‌ ఆసుపత్రికి నిత్యం 300మందికి పైగా రోగులు వస్తుంటారు. ఎక్కువగా రోడ్డు ప్రమాద బాధితులు, ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన కేసులతో పాటు ఓపీ రోగులు అధికం. ప్రస్తుతం వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో స్థానికంగా ప్రాథమిక వైద్యం మాత్రమే అందుతోంది. ఎక్స్‌రే లేకపోవడంతో ప్రైవేట్‌ ఆసుపత్రులు అందినకాడికి దండుకుంటున్నాయి. కాన్పు సమయంలో బిడ్డ కడుపులో అడ్డం తిరిగినా తమ వల్ల కాదని చేతులెత్తేసిన సంఘటనలు కోకొల్లలు. కనీసం ఇప్పటికైనా అన్ని రకాల సేవలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.


వైద్యుల కొరత తీరనుంది
డాక్టర్‌ సత్యనారాయణషిండె, ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌

సామాజిక ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్‌లోకి మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేదలకు నాణ్యమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. పూర్తిస్థాయిలో వైద్యుల కొరత తీరనుంది. తద్వారా ఆసుపత్రి రూపురేఖలు మారిపోయే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని