logo

ముంచుకొస్తున్న..మూడో దశ ముప్పు!

జిల్లాలో కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతి క్రమేణా పెరుగుతోంది. అయిదు రోజుల్లోనే వీటి తీవ్రత పెరగడం ఇందుకు నిదర్శనం. 17వ తేదీన 26, 18న 84, 19న 210, 20న 252, 21న 226 మందికి వైరస్‌ సోకడం ఆందోళనకు గురిచేస్తోంది. తాండూరు

Published : 22 Jan 2022 01:03 IST

వందల సంఖ్యలో నమోదవుతున్న కేసులు

స్వీయ జాగ్రత్తలే ముఖ్యం

న్యూస్‌టుడే, తాండూరు

జిల్లాలో కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతి క్రమేణా పెరుగుతోంది. అయిదు రోజుల్లోనే వీటి తీవ్రత పెరగడం ఇందుకు నిదర్శనం. 17వ తేదీన 26, 18న 84, 19న 210, 20న 252, 21న 226 మందికి వైరస్‌ సోకడం ఆందోళనకు గురిచేస్తోంది. తాండూరు పట్టణం, మండలంలో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఎవరికివారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా తగదని అధికారులు సూచిస్తున్నారు. కట్టడికి కార్యాచరణ చేపట్టకుంటే మరింత విస్తరించే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుత పరిస్థితిపై కథనం.

ల్లెలు, పట్టణాలపై కరోనా పంజా విసురుతుండటంతో సర్కారు వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసింది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆసుపత్రులు, తాండూరు జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్‌ పరిధిలో వైద్య సిబ్బంది ఇంటింటా జ్వర సర్వే నిర్వహించడం ప్రారంభించారు. గ్రామాల్లో ఏఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో పాటు రెవెన్యూ సిబ్బంది ఇందులో భాగస్వాములవుతున్నారు. తాండూరు, పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌ పట్టణాల్లో మెప్మా ప్రతినిధులు, బిల్‌కలెక్టర్లు బృందాలుగా వెళ్లి పరిశీలిస్తున్నారు. ఒక్కో బృందం 60 గృహాల చొప్పున సందర్శించి వివరాలను సేకరిస్తున్నారు. వీరిలో ఎవరికైనా చలి, జ్వరం, దగ్గు ఉంటే కిట్లను ఇస్తున్నారు. ఇందులో ఒక్కొక్కరికి ఐదు రోజులకు సరిపడా మందులున్నాయని సిబ్బంది తెలిపారు.

తాండూరులో ఇంటింటి సర్వేలో వ్యక్తికి టీకా వేస్తున్న సిబ్బంది

కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు పరిగి, కొడంగల్‌, వికారాబాద్‌, మర్పల్లి సామాజిక ఆసుపత్రులు, తాండూరు జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్‌లో టీకాలు వేసే ప్రక్రియ కొనసాగుతోంది. పోలీసులకు బూస్టర్‌ డోస్‌, 15 నుంచి 18 ఏళ్ల వారికి టీకాలు వేస్తున్నారు. వైరస్‌ నుంచి దూరంగా ఉండాలంటే స్వీయ జాగ్రత్తలతోపాటుగా టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రతి నలుగురిలో ఒకరికి లక్షణాలు: వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ప్రతి నలుగురిలో ఒకరికి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారికి పరీక్షలు నిర్వహిస్తే కొందరికి పాజిటివ్‌, మరి కొందరికి నెగెటివ్‌ వస్తోంది. పాజిటివ్‌ వచ్చిన వారికి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

పెరగడానికి కారణాలు: మిగతా మండలాలతో పోల్చితే తాండూరు నియోజకవర్గంలో కేసులు అధికంగా ఉంటున్నాయి. ఇక్కడ సుద్ద, సిమెంట్‌ పరిశ్రమలు ఉండటం వల్ల వేల సంఖ్యలో వాహనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ సందర్భంగా వీరికి ఎటువంటి పరీక్షలు చేయడంలేదు. పొరుగున కర్ణాటక నుంచి తాండూరు పట్టణానికి ప్రజలు వచ్చిపోతుంటారు. సరిహద్దులో కట్టడికి చర్యలు లేవు. ఇక మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని విస్మరించడం వల్ల వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

జిల్లా ఆసుపత్రిలో 130 బెడ్ల ఏర్పాటు
బాధితులకు ప్రత్యేక చికిత్స అందించేందుకు జిల్లా ఆసుపత్రిలో 130 బెడ్లను ఏర్పాటు చేశారు. ఇందులో 30 మాతాశిశు సంరక్షణ ఆసుపత్రి,  జిల్లా దవాఖానాలో 100 సిద్ధంగా ఉంచారు. హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స చేసుకోలేని వారికి వైద్య సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం ఏడుగురు చేరారు. మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో కొవిడ్‌ బారిన పడిన గర్భిణులకు చికిత్స అందిస్తున్నారు..

వైద్యం అందించేందుకు సిద్ధం: డాక్టర్‌ రవిశంకర్‌, తాండూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌
తొలి, మలి దశలతో పోల్చి చూస్తే ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ దరికి చేరదు. టీకా తప్పనిసరిగా వేయించుకోవాలి. పట్టణాలకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిపోయే వారి సంఖ్య అధికం. అందరు విధిగా మాస్కులు ధరించాలి. చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. దగ్గు, జ్వరం, తుమ్ములు, గొంతు నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేసుకోవాలి. అత్యవసర చికిత్సలకు జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఆక్సిజన్‌తో కూడిన బెడ్లను ఏర్పాటు చేశాం.

సమగ్ర సమాచారం సేకరిస్తున్నాం
తుకారాం, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి
జిల్లాలో ఇంటింటికి వెళ్లి మా బృందాలు జ్వర సర్వే చేస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని, వారికి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు మంచి అవకాశం. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తిస్తే వెంటనే వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. మెడికల్‌ కిట్లు ఇస్తున్నాం.


202 మందికి వైరస్‌

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో 852 మందికి శుక్రవారం యాంటిజన్‌ పరీక్షలు నిర్వహించగా 202 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. జిల్లా ఆసుపత్రి, ఆయా సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

373 మందికి టీకా: జిల్లాలో శుక్రవారం 15 నుంచి 18 మధ్య వయసున్న 373 మందికి టీకా వేశామని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ తుకారాంభట్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లపైన ఉన్న వారికి మొదటి డోసు 866 మందికి, రెండో డోసు 2,209 మందికి వేశామని పేర్కొన్నారు. మందు జాగ్రత్త టీకాలు 85 మందికి ఇచ్చామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని