logo

దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు!

నగరంలో మాదకద్రవ్యాల వినియోగం వెనుక  అంతర్జాతీయ డ్రగ్‌ స్మగ్లర్‌ టోనీ తెర వెనక ఉన్నాడని తెలుసుకొన్న పోలీసులు హైదరాబాద్‌కు కొకైన్‌, హెరాయిన్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించారు.

Published : 22 Jan 2022 02:13 IST

రూ.వేల కోట్ల విలువైన కొకైన్‌, హెరాయిన్‌ సరఫరా

ఈనాడు,హైదరాబాద్‌: నగరంలో మాదకద్రవ్యాల వినియోగం వెనుక  అంతర్జాతీయ డ్రగ్‌ స్మగ్లర్‌ టోనీ తెర వెనక ఉన్నాడని తెలుసుకొన్న పోలీసులు హైదరాబాద్‌కు కొకైన్‌, హెరాయిన్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. ఇది దక్షిణాఫ్రికా నుంచి జల, వాయు మార్గాల్లో రవాణా అవుతోందన్న సమాచారం సేకరించారు. ఈ డ్రగ్‌ మాఫియా వెనక నైజీరియన్లు, ముంబయిలో వ్యవస్థీకృత నేరస్థులు, దిల్లీలో విదేశీయులున్నారని తెలుసుకున్నారు. వేర్వేరు మార్గాల్లో హైదరాబాద్‌కు ఏటా రూ.200 కోట్ల విలువైన కొకైన్‌ సరఫరా అవుతోందని ప్రాథమికంగా అంచనా వేశారు.  

విమానాల్లో పార్సిళ్లు..
దక్షిణాఫ్రికాలోని డర్బన్‌, కేప్‌టౌన్‌ నుంచి కొందరు విమానాలు ఎక్కి దోహా మీదుగా ముంబయి, దిల్లీ, కోచి నగరాలకు కొకైన్‌, హెరాయిన్‌ సరఫరా చేస్తున్నారు. ముంబయి, దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అధికారులు నిఘా ఉంచడంతో స్మగ్లర్లు కోచి విమానాశ్రయాన్ని ఎంచుకున్నారు. ఆఫ్రికన్‌ మహిళలను రవాణాకు వినియోగిస్తున్నారు. వీరు కేప్‌టౌన్‌, ఐవరీకోస్ట్‌ నుంచి దోహాకు విమానాల్లో వచ్చి అక్కడి నుంచి వేర్వేరు ఎయిర్‌లైన్స్‌ ద్వారా కోచికి చేరుకుంటున్నారు. కోచిలో ఒకటి, రెండు రోజులు ఉండి బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, దిల్లీ, ముంబయికి రోడ్డు, రైలు మార్గాల్లో వెళ్తున్నారు. మూడు నెలల కిందట కేరళ విమానాశ్రయ అధికారులు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళ నుంచి రూ.5.5 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఇక రెండో మార్గంగా అంతర్జాతీయ కొరియర్‌ సర్వీసుల ద్వారా పంపుతున్నారు. ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు ఏడాదిన్నర కిందట దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన పార్సిళ్లను తనిఖీ చేయగా.. రూ.50 కోట్ల విలువైన కొకైన్‌ బయటపడింది.


ఓడరేవుల నుంచి సరఫరా

క్షిణాఫిక్రాలోని డర్బన్‌, కేప్‌టౌన్‌, జోహెన్నెస్‌బర్గ్‌ నగరాలకు సమీపంలో సముద్ర మార్గముంది. డర్బన్‌లో ఓడరేవు ఉంది. అక్కడి నుంచి బ్రెజిల్‌లోని పోర్ట్‌ ఆఫ్‌ సాంటోస్‌కు టన్నుల కొద్దీ కొకైన్‌ వస్తోంది. అక్కడి నుంచి డ్రగ్‌ మాఫియా ఈ సరకును తొలుత వారి స్థావరాలకు తరలించి, అనంతరం భారత్‌కు నౌకల ద్వారా రవాణా చేస్తోంది. స్టార్‌ బాయ్‌ వంటి బడా డాన్‌లు కేరళలోని కోచి, గుజరాత్‌లోని ముంద్రా, ముంబయిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌, కేరళలోని కోచి ఓడరేవులకు తరలిస్తున్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు గతేడాది సెప్టెంబరులో రూ.21 వేల కోట్ల విలువైన 3 వేల కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని