logo

కరోనా కారణం.. రద్దు దారుణం

నిండుగా ప్రయాణికులుంటేనే రైళ్లు.. అనే పరిస్థితికి దక్షిణ మధ్య రైల్వే వచ్చేసింది. ఏమాత్రం ఖాళీగా ప్రయాణిస్తున్నా రద్దు చేసేందుకు ఒక్క క్షణం వెనుకాడడంలేదు. కరోనా కట్టడి పేరుతో ప్యాసింజరు, ఎంఎంటీఎస్‌

Published : 22 Jan 2022 02:13 IST

ప్యాసింజర్‌, ఎంఎంటీఎస్‌ రైళ్ల నిలిపివేతతో ప్రయాణికుల ఇబ్బంది  

ఈనాడు, హైదరాబాద్‌: నిండుగా ప్రయాణికులుంటేనే రైళ్లు.. అనే పరిస్థితికి దక్షిణ మధ్య రైల్వే వచ్చేసింది. ఏమాత్రం ఖాళీగా ప్రయాణిస్తున్నా రద్దు చేసేందుకు ఒక్క క్షణం వెనుకాడడంలేదు. కరోనా కట్టడి పేరుతో ప్యాసింజరు, ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేయడం వల్ల సామాన్య ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజుల్లో 38 ఎంఎంటీఎస్‌ల సర్వీసులను నిలిపేసిన ద.మ. రైల్వే తాజాగా గ్రేటర్‌ పరిధిలో తిరిగే 16 ప్యాసింజర్‌ రైళ్లను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా నగరానికి కూరగాయలు, పాలు తెచ్చే రైతులతో పాటు చిరుద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ప్యాసింజర్‌ రైళ్లపైనే ప్రభావం
కరోనా మొదటి దశ ప్రారంభమయ్యాక మూణ్నాలుగు నెలలకే ద.మ.రైల్వే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడిపింది. 15 నెలల తర్వాత ఎంఎంటీఎస్‌ మొదలయ్యాయి. 10 నుంచి ప్రారంభించి ప్రస్తుతం 78 సర్వీసులు తిరుగుతున్నాయి. 20 నెలల తర్వాత ప్యాసింజర్‌ రైళ్లను ప్రారంభించింది. కొన్నింటిని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్చేసి.. ప్రత్యేక రైళ్ల జాబితాలో అదనపు ఛార్జీలతో తిప్పింది. తాజాగా మరోమారు కరోనా పేరుతో 55 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేయగా.. అందులో 16 నగర పరిధిలో తిరుగుతున్నవే ఉన్నాయి. ప్రస్తుతం తిరుగుతున్న ఎంఎంటీఎస్‌ల్లోనూ 38 సర్వీసులను రద్దు చేసింది.

శివారు ప్రజలకు నరకం
ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకూ ప్యాసింజరు, ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు.. ముందు చెబితే నగర శివారు ప్రాంతాల వారు ప్రత్యామ్నాయం చూసుకునేవారు. రద్దు చేసిన రోజు ప్రకటించడంతో రైతులు, పాల ఉత్పత్తిదారులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని