logo

కేసులుండగానే కాసుల వేట

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా.. కరోనా కేసులు ఉద్ధృతంగా ఉన్నప్పుడే కాసులు వేట ప్రారంభించేశారు. కరోనా నిర్ధారణ పరీక్షల నుంచి మొదలుపెడితే పల్స్‌రేటు, ఆక్సిజన్‌ స్థాయిలు తెలిపే ఆక్సీమీటర్‌ తదితర పరికరాల

Published : 22 Jan 2022 02:19 IST

భారీగా పెరిగిన కొవిడ్‌ పరీక్షల, పరికరాల ధరలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

ఉప్పల్‌ మోడల్‌ మార్కెట్‌ పరీక్ష కేంద్రంలో శుక్రవారం 663 మందికి పరీక్షలు చేయగా 95 మందికి పాజిటివ్‌ వచ్చింది.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా.. కరోనా కేసులు ఉద్ధృతంగా ఉన్నప్పుడే కాసులు వేట ప్రారంభించేశారు. కరోనా నిర్ధారణ పరీక్షల నుంచి మొదలుపెడితే పల్స్‌రేటు, ఆక్సిజన్‌ స్థాయిలు తెలిపే ఆక్సీమీటర్‌ తదితర పరికరాల ధరలను భారీగా పెంచేశారు విక్రయదారులు. బూస్టర్‌ డోసుకు డిమాండ్‌ పెరిగింది. 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ప్రస్తుతం అధికారికంగా వేస్తుండగా ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.2500కు పైగా తీసుకొని అనధికారికంగా చేసేస్తున్నారు.  

నగరంలో కరోనా కోరలు చాస్తున్న విషయం తెలిసిందే. మొదటి, రెండు దశల్లో వైరస్‌ విజృంభించినపుడు ప్రైవేటు ల్యాబ్‌లు నిర్ధారణ పరీక్షల విషయంలో ప్రజలను దోచేశాయి. పరీక్షకు రూ.500 తీసుకోవాల్సి ఉండగా రూ.1500 నుంచి రూ.2500 వరకు గుంజిన సందర్భాలున్నాయి. నెల రోజులుగా కేసులు పెరగడంతో ఉచితంగా పరీక్ష చేసే ప్రభుత్వ కేంద్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వందలాది మంది కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. కిట్లు సరిపోక పలువురు వెనుదిరుగుతున్నారు. రద్దీ చూసి భయపడేవారిని, నిరీక్షించలేని వారిని ఆసరాగా చేసుకొని ప్రైవేటు ల్యాబ్‌లు మళ్లీ దోపిడీకి తెరలేపాయి. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష(ర్యాట్‌కు) రూ.1500, ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌కు రూ.2000కు పైగా వసూలు చేస్తున్నాయి.  


అనధికారికంగా రూ.2500కు బూస్టర్‌ డోసు

గ్రేటర్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో మొదటి డోసు వేయించుకున్న చాలామంది రెండో డోసు వేయించుకోలేదు. మొదటి డోసు వేయించుకున్నాక కేసులు తగ్గిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు ఒమిక్రాన్‌ వేరియంట్‌తోపాటు, డెల్టా వైరస్‌ మళ్లీ విరుచుకుపడటంతో రెండో డోసు కోసం టీకా కేంద్రాలకు జనం పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. బూస్టర్‌ వేసుకుంటే 80 శాతం వరకు రక్షణ లభిస్తుందని వైద్యులు చెబుతుండడంతో దానికీ డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం 60 ఏళ్ల పైబడినవారికే ఈ డోసు వేస్తున్నారు. చాలా మంది వయసుతో సంబంధం లేకుండా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రూ.2500 వరకు తీసుకొని ఆ డోసు వేస్తున్నాయి.


కొండెక్కి కూర్చున్న ఆక్సీమీటర్‌ ధర

కొవిడ్‌ బాధితులకు పల్స్‌ ఆక్సీమీటర్‌ కీలక పరికరం. కొవిడ్‌కు ముందు రూ.500 ఉండే ధర మొదటి, రెండు దశ ఉద్ధృతిలో రూ.2000 పలికింది. గత మూడు నెలలుగా ధర తగ్గినా, ఇప్పుడు మళ్లీ ఔషధ దుకాణాల నిర్వాహకులు రూ.2000 వరకు విక్రయిస్తున్నారు. డాక్టర్ల సూచనల మేరకు పలువురు వీటిని కొనుగోలు చేస్తుండడమే దీనికి కారణం. రక్తపోటు, మధుమేహం పరీక్షల కిట్ల ధరలు పెరిగాయి. పాత ధరలకంటే రూ.500-రూ.1000 వరకు పెంచి అంటగడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని