Ts News: రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలుకు సర్కార్ సన్నద్ధం.. కలెక్టర్లకు ఆదేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకం అమలుకు సర్కార్ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పైలట్

Published : 22 Jan 2022 15:53 IST

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకం అమలుకు సర్కార్ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పైలట్ పద్ధతిలో పూర్తి స్థాయిలో పథకం అమలవుతోంది. మరో నాలుగు మండలాల్లోనూ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాలు ఇందులో ఉన్నాయి. హుజూరాబాద్‌లో పూర్తి స్థాయిలో దళితబంధు అమలవుతున్న తరుణంలో రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 100 మంది లబ్ధిదారుల చొప్పున పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఆ ప్రక్రియను వేగవంతం చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. దళితబంధు అమలుకు సంబంధించి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

‘‘118 శాసనసభ నియోజకవర్గాల్లో పథకం అమలు కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలి. మార్చి నెలలోగా ఆయా నియోజకవర్గాల్లో 100 కుటుంబాలకు దళితబంధు పథకాన్ని అమలు చేయాలి. ఇందుకోసం స్థానిక శాసనసభ్యుల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను సంబంధిత జిల్లాల ఇన్‌ఛార్జ్‌ మంత్రులతో ఆమోదించుకోవాలి. ప్రతి లబ్ధిదారుడికి బ్యాంకు లింకేజీ లేకుండా రూ. 10 లక్షల ఆర్థిక సాయంతో కోరుకున్న యూనిట్‌నే ఎంపిక చేయాలి. ఒక్కో లబ్ధిదారుడికి మంజూరైన రూ. 10 లక్షల నుంచి రూ.10 వేలతో ప్రత్యేకంగా దళితబంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 118 నియోజకవర్గాల్లో పథకం అమలు కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్లు కేటాయించాం. అందులో ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేశాం. మిగతా మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తాం’’ అని జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని