logo

పుడమికి తూట్లు...అక్రమార్కులకు రూ.కోట్లు

వికారాబాద్‌ పట్టణంలోని ఆలంపల్లిలో సుమారు 2 వేల టిప్పర్ల మట్టిని రాత్రికి రాత్రే తరలించారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సదరు వ్యక్తులపైన,

Published : 23 Jan 2022 03:09 IST

 యథేచ్ఛగా మట్టి తవ్వకాలు  
 చూసీ చూడనట్లుగా అధికారులు

వికారాబాద్‌లో ఓ పొలంలో వేసిన మట్టి కుప్పలు

* వికారాబాద్‌ పట్టణంలోని ఆలంపల్లిలో సుమారు 2 వేల టిప్పర్ల మట్టిని రాత్రికి రాత్రే తరలించారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సదరు వ్యక్తులపైన, వాహనాలపైన చర్యలు తీసుకోవడానికి మాత్రం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తికి ఓ ప్రజా ప్రతినిధి అండదండలు మెండుగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.
* వికారాబాద్‌ మండలం పాతూరు గేటు సమీపంలో వరద కాల్వను పూర్తిగా మూసివేశారు. పక్కన పిల్ల కాలువను తీశారు. లోతట్టు ప్రాంతాలను వందల టిప్పర్ల మట్టితో పూడ్చివేశారు. ఇది ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటంతో వచ్చిపోయే ప్రతి వ్యక్తికి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. రెవెన్యూ, జలవనరుల శాఖాధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.  
* దోమ మండలం దిర్సంపల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ, అసైన్‌మెంట్‌ భూముల్లో మట్టిని తోడి గండి చెరువు కుంటను సగ భాగం మూసివేశారని స్థానికులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

- ఈనాడు డిజిటల్‌,వికారాబాద్‌

‘మట్టే కదా’ అనుకుంటే ‘పొరపడినట్లే.’ అక్రమార్కులకు రూ.కోట్లు కురిపిస్తోంది. సాయంత్రమైతే చాలు జేసీబీలు, పెద్ద సైజు టిప్పర్లు, లారీలు పుడమి తల్లి గుండెలపై నర్తిస్తున్నాయి. కొండలను పిండిచేస్తున్నాయి. ప్రభుత్వ భూములు, కొండవాలు ప్రాంతాలు అనే తేడా లేకుండా అందిన మేరకు తవ్వేస్తున్నాయి.. రాత్రంతా అక్రమార్కులు ఎంపిక చేసుకున్న స్థలానికి మట్టిని తరలిస్తున్నారు. రూ.లక్షల విలువైన మట్టిని ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తున్నారు. వేకువజామున 3 గంటలకు అంతా నిశ్శబ్దం. అసలు అక్కడ ఏమీ జరగలేదన్నట్లు కనిపిస్తుంది. ఇదంతా అధికారులకు తెలియదనుకోవడం అమాయకత్వం. అధికార, అనుకూల పార్టీ నాయకుల అండదండలతో అధికారులు ఏమీ చేయలేరన్న నిర్లక్ష్యంతో యథేచ్ఛగా భూములను తవ్వేస్తున్నారు. 

చీలాపూర్‌లో ట్రాక్టర్‌లో మట్టిని నింపుతున్న జేసీబీ

ఫిర్యాదు చేసినా పట్టించుకునేది ఎవరు

జిల్లా కేంద్రం వికారాబాద్‌ అయినా, మారుమూల ప్రాంతమైనా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరం రూ.30 లక్షలకు తక్కువ పలకడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో వెంచర్లు గ్రామానికి కనీసం రెండు నుంచి ఐదు వరకు ఏర్పాటయ్యాయి. మరో వైపు ఉన్న పొలంలో వ్యవసాయ క్షేత్రం నిర్మించుకోవాలన్నా, అక్కడి వరకు వాహనాలు వెళ్లాలన్నా మట్టిదారులు అవసరం. దీనికోసం గుట్టలన్నీ గుల్ల చేస్తున్నారు.
* వికారాబాద్‌ పురపాలిక ప్రజలకు తాగునీటి ఆధారమైన శివారెడ్డిపేట్‌ చెరువు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టిఎల్‌)లో మట్టిని నింపుతున్నారు. ఈ విషయమై స్థానిక ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
* వికారాబాద్‌ మండలం సిద్దులూరు గ్రామానికి రెండువైపులా వాగులపై వంతెనల నిర్మాణం కోసం మట్టి తరలించేందుకు అనుమతి తీసుకున్నారు. స్థానిక నేతల సాయంతో వంతెన పేరు చెప్పి ప్రైవేటు వెంచర్లకు పెద్దఎత్తున మట్టి తరలిస్తున్నారు.
* పూడూరు మండలం మన్నెగూడ సమీపంలోని ఓ వెంచరు కోసం సుమారు పది వేల టిప్పర్ల మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో తరలించారు. మరోవైపు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వాగును కప్పి, చిన్న కాల్వ తవ్వి విడిచిపెట్టారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు మట్టినట్లు తెలుస్తోంది. ఇదే మండలం చీలాపూర్‌, పరిగి మండలం లింగంపల్లి, బసిరెడ్డిపల్లి, దోమ మండలం దిర్సంపల్లిల్లో, ఇతర గ్రామాలు, మోమిన్‌పేట్‌, ధారూర్‌, కుల్కచర్ల తాండూరు, ఇతర మండలాల్లో ఈ తరహా మట్టి దందా జోరుగా సాగుతోంది. ఖాళీ గుట్టలనూ వదలక ఆక్రమణలకు పాల్పడుతున్నారు.  ఫలితంగా రూ.కోట్ల విలువైన మట్టి పోవడమే కాదు, రూ.వందల కోట్ల విలువైన భూములు సైతం పరాధీనమవుతున్నాయి.
డీల్‌ చేస్తే అంతా అయిపోయినట్లే
జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా మట్టి దందా జరుగుతోందంటే దాని వెనుక ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు, ప్రజా ప్రతినిధుల సహాయ, సహకారాలు పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాయి. కొత్తగా వెంచరు వేయాలనుకునే వ్యక్తులు అధికారుల కంటే ముందు ప్రజా ప్రతినిధులను కలసి, డీల్‌ మాట్లాడుకుంటున్నారంటే పరిస్థితి ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అనుమతులు ఉన్నా, లేకున్నా పనులు చకచకా జరిగిపోతున్నాయి. అధికారులు సైతం వాటికి అడ్డుచెప్పే ప్రయత్నం చేయడంలేదు. ఈ విషయంలో కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కబ్జా చెరనుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని