logo

కొన్నారు... ప్రారంభం మరిచారు!

పారిశుద్ధ్యం బాగుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కడికక్కడ చెత్తా చెదారం పేరుకుపోతే దోమలు, ఈగల వ్యాప్తితో రోగాల బారిన పడే ప్రమాదముంది. ఇలాంటి సమస్యల పరిష్కారంలో భాగంగా పురపాలక సంఘం అధికారులు రెండు నెలల

Published : 23 Jan 2022 03:09 IST

నిరుపయోగంగా చెత్త సేకరణ వాహనాలు
న్యూస్‌టుడే, పరిగి

పారిశుద్ధ్యం బాగుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కడికక్కడ చెత్తా చెదారం పేరుకుపోతే దోమలు, ఈగల వ్యాప్తితో రోగాల బారిన పడే ప్రమాదముంది. ఇలాంటి సమస్యల పరిష్కారంలో భాగంగా పురపాలక సంఘం అధికారులు రెండు నెలల క్రితం ప్రత్యేక వాహనాలను కొనుగోలు చేశారు. వీటిని ప్రారంభించడం మాత్రం మరిచిపోయారు. దీంతో చెత్త సేకరణకు వాహనాలు సరిపోక ఎక్కడపడితే అక్కడే పేరుకుపోతోంది. అసలే కరోనా విజృంభిస్తున్న తరుణంలో వీటిని వెంటనే ప్రారంభించాల్సిన అవసరం ఉందని పట్టణ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహిస్తున్న పురపాలికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేడింగ్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం పరిగి మున్సిపాలిటీ కూడా పోటీ పడాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.
హోదా పెరిగినా అరకొరగానే సిబ్బంది  
మేజర్‌ పంచాయతీగా ఉన్న పరిగి 20.7చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 15వార్డులు, 18,242 మంది జనాభాతో 2018 జూన్‌ 2న నూతన పురపాలక సంఘంగా మారింది. దీంతో సౌకర్యాల కల్పనకు మొదట్లో ఇబ్బందులు ఏర్పడినా క్రమక్రమంగా సమస్యలను అధిగమిస్తూ వస్తోంది. తగినంత మంది పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు తప్పడంలేదు. మొత్తంగా 53మంది సిబ్బంది ఉంటే  అందులోనే విద్యుత్తు, పారిశుద్ధ్యం, మంచినీటి నిర్వహణ ఇతరత్రాకు సంబంధించిన వారూ ఉన్నారు. వాహనాలు కూడా అరకొరగానే ఉండటంతో ఇతర సదుపాయాల మాటెలా ఉన్నా పారిశుద్ధ్యం ఇంకా మెరుగుపడాలన్న అభిప్రాయమే అందరిలోనూ వ్యక్తమవుతోంది.
రూ.74 లక్షల వ్యయం
పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కోసమని రూ.74లక్షల వ్యయంతో నాలుగు ఆటోలు, ఒక స్వీపింగ్‌ యంత్రం, ఒక ట్రాక్టరును కొనుగోలు చేశారు. ప్రారంభ ముహూర్తానికి తేదీ ఖరారు కాకపోవడంతో అవి దుమ్ముపట్టి పోతున్నాయి. గృహ నిర్మాణ పరంగా మున్సిపాలిటీ దినదినాభివృద్ధి చెందుతోంది. 5650 నివాస గృహాలున్నాయి. పాత వాహనాలు 13వరకు ఉన్నాయి. ఇవే అన్ని పనులను నిర్వహించాల్సి వస్తోంది. నిత్యం పట్టణ వ్యాప్తంగా దాదాపు 10 టన్నుల వ్యర్థాలు (చెత్త) తయారవుతున్నాయి. సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో అందులో సేకరిస్తున్నది సగం మాత్రమే. వారం క్రితం మందుల కాలనీ ప్రజలు రోడ్డుపై చెత్తబుట్టలు ఉంచి నిరసన వ్యక్తం చేశారు. కొత్త వాహనాలను సత్వరం వినియోగంలోకి తీసుకువచ్చి పరిస్థితులను మెరుగు పరచాలని కోరుతున్నారు.
* తహసీల్దారు కార్యాలయం నుంచి కోర్టు సమీపం వరకు పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఓవైపు మట్టి రోడ్డు కావడం వాహనాల రాకపోకలతో కార్యాలయ ఆవరణలో ఉంచిన వాహనాలు దుమ్ముపట్టి పాడవుతున్నాయి.
రోడ్లమీదే పోస్తున్నారు
నిత్యం సాయంత్రం సమయంలో కొందరు చిరు వ్యాపారులు చెత్తను ఇతర వ్యర్ధ పదార్థాలను రోడ్లమీదే పారబోస్తున్నారు. వాహనాల్లో చెత్తను తరలిస్తున్నా రాత్రిపూట పోయడంతో పరిసరాలు కంపుకొడుతున్నాయి. కొందరు కోళ్ల వ్యర్థాలను జాతీయ రహదారికి పక్కనే బస్తాల్లో పడేస్తున్నారు. ఇది జాతీయ రహదారి కావడం, ప్రజల రాకపోకలు పెరగడంతో దుర్వాసన వేస్తోందని కట్టడి చేయాలని కోరుతున్నారు.

ప్రత్యేక కృషి చేస్తున్నాం: అశోక్‌కుమార్‌, ఛైర్మన్‌
పచ్చదనం, పరిశుభ్రత విషయంలో ప్రత్యేక కృషి చేస్తున్నాం. స్వచ్ఛతలో భాగంగానే మరిన్ని వాహనాలను కొనుగోలు చేశాం. ప్రజా సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈనెల 26న వినియోగంలోకి తీసుకువచ్చి పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగు పరుస్తాం. ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు, చెత్త చెదారం పారబోస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా మార్చేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరం. ఈవిషయంలో ఇప్పటికే వ్యాపారులకు అవగాహన కల్పించాం. ఇంకా కొన్నిచోట్ల అమలు కాకపోవడంతో భారీగా జరిమానాలు విధిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని