logo

టిమ్స్‌కు జవసత్వాలు!

కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో వైద్య సంస్థల్లో ఖాళీలను నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(టిమ్స్‌)లో ఒప్పంద ప్రాతిపదికన వైద్యుల నియామకానికి పచ్చజెండా

Published : 23 Jan 2022 03:09 IST

వైద్య సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్‌ 113
ఖాళీలకు ఈనెల 27-29 వరకు ఇంటర్వ్యూలు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో వైద్య సంస్థల్లో ఖాళీలను నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(టిమ్స్‌)లో ఒప్పంద ప్రాతిపదికన వైద్యుల నియామకానికి పచ్చజెండా ఊపింది. శనివారం ఖాళీలపై టిమ్స్‌ డైరెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో భాగంగా ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల, మెడికల్‌ ఆఫీసర్లు కలిపి మొత్తం 113 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అదే ఆసుపత్రిలో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వైద్యశాలలో మొత్తం 1500 పడకలున్నాయి. నిమ్స్‌ తరహాలో సూపర్‌ స్పెషాలిటీ సేవలను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసింది. రెండో దశలో కొవిడ్‌ కేసులు భారీ ఎత్తున పెరగడంతో సంబంధిత సేవలకు ఉపయోగించారు. తర్వాత సాధారణ ఓపీ సేవలకు కేటాయించారు. వైద్యులు, ఇతర సిబ్బంది కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండో దశలో ఆ లోపం స్పష్టంగా కన్పించింది. అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బందితోనే నెట్టుకొచ్చారు. దరఖాస్తులు పరిశీలించి నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.

దరఖాస్తులు ఇతర వివరాలకు ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.డీఎంఈ.తెలంగాణ.జీవోవి.ఇన్‌’ లేదా డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.టిఐఎంఎస్‌హెచ్‌వైడీ.తెలంగాణ.జీవోవి.ఇన్‌’లోనూ చూడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని