logo

Crime News: ముందుగా కారు చోరీ.. తర్వాత రెక్కీ.. ఆపై ఇళ్లలో దొంగతనం!

ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్‌చేశారు. గతేడాది డిసెంబరు 3న రాత్రి ఎల్బీనగర్‌లోని హస్తినాపురం సంతోషిమాతా ఆలయంలో దొంగతనం జరిగింది.  ఈ కేసులో ఐదుగురు సభ్యుల

Updated : 23 Jan 2022 07:52 IST

స్వాధీనం చేసుకున్న సొత్తును పరిశీలిస్తున్న సీపీ మహేశ్‌ భగవత్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్‌చేశారు. గతేడాది డిసెంబరు 3న రాత్రి ఎల్బీనగర్‌లోని హస్తినాపురం సంతోషిమాతా ఆలయంలో దొంగతనం జరిగింది.  ఈ కేసులో ఐదుగురు సభ్యుల ముఠాలోని పొన్నూరి చిన్నసత్యానందం(31), దారావత్‌ నవీన్‌(25), గండం సమ్మయ్య(24), జంగాల ప్రసాద్‌(27)ను అరెస్ట్‌ చేశారు.  మండ్ల నాగేందర్‌ కోసం గాలిస్తున్నారు. శనివారం నేరెడ్‌మెట్‌ రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో అదనపు సీపీ జి.సుధీర్‌బాబు, ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, నేరవిభాగ డీసీపీ పి.యాదగిరి, అదనపు డీసీపీ ఎం.శ్రీనివాసులు, ఏసీపీ పి.శ్రీధర్‌రెడ్డితో కలసి సీపీ మహేశ్‌భగవత్‌ వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన పొన్నూరి చిన్నసత్యానందం అలియాస్‌ సతీష్‌ చిన్న దొంగతనాలతో మొదలై దోపిడీలు చేసేంతగా ఎదిగాడు. అతడిపై గుంటూరు, కృష్ణా, నల్గొండ జిల్లాల్లో 37 కేసులు నమోదయ్యాయి. గతంలో నాగార్జునసాగర్‌, దొనకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇంజినీరింగ్‌ విద్యార్థి దారావత్తు నవీన్‌(నాగార్జునసాగర్‌), గండం సమ్మయ్య(గురజాల), జంగాల ప్రసాద్‌ (పిడుగురాళ్ల), మండ్ల నాగేందర్‌ వివిధరకాల నేరాలతో గురజాల జైలుకు చేరారు. అక్కడే వారికి చిన్న సత్యానందంతో పరిచయమై ముఠాగా మారారు.

కొట్టేసిన కారుతో ఏమార్చుతూ.. సూత్రదారి చిన్నసత్యానందం ముందుగా కారును దొంగతనం చేస్తాడు. ఆనక అదే కంపెనీ కారు, రంగు ఉన్న వాహనం నంబరు ప్లేట్‌ను ఆ కారుకు అమర్చుతాడు. పగటి వేళ దానిలో తిరుగుతూ తాళం వేసిన గృహాలు, ఖరీదైన ఆభరణాలున్న ఆలయాల వద్ద రెక్కీ చేస్తారు. చోరీకి బయల్దేరే ముందు సమ్మయ్య.. అడవిలో ఉంచిన కారును సత్యానందంకు అప్పగిస్తాడు. రాత్రివేళ ఐదుగురూ కలిసి ఆలయాలు, ఇళ్లలోకి ప్రవేశించి దోచుకున్నాక.. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాక దాన్ని పంచుకునేవారు. ఏడాది వ్యవధిలో పశ్చిమగోదావరి, గుంటూరు, విజయవాడ, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో 4 ఆలయాలు, బ్యాంకు, గృహ దొంగతనాలు  2, వాహనచోరీలు 3 చేశారు.   ఏటీఎం కేంద్రాల లూటీకి సత్యానందం నల్గొండ జిల్లా పెదవూరలో గ్యాస్‌ సిలిండర్‌, ఆక్సిజన్‌ సిలిండర్‌, హ్యాండ్‌కటింగ్‌ మెషీన్‌ దొంగిలించాడు. తమ ప్రణాళికను పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలులో బ్యాంకు వద్ద అమలుచేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు