logo

గొలుసు దొంగ దొరికాడు

గ్రేటర్‌లో వరుస గొలుసు చోరీలతో అలజడి సృష్టించిన ఉమేష్‌ ఖతిక్‌(26) పోలీసులకు చిక్కాడు. బుధవారం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్లలోని ఐదు ప్రాంతాల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసు చోరీలు జరిగిన

Published : 23 Jan 2022 03:09 IST

 పట్టిచ్చిన ఆధార్‌ కార్డు
 నిందితుడిది గుజరాత్‌

ఉమేష్‌

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో వరుస గొలుసు చోరీలతో అలజడి సృష్టించిన ఉమేష్‌ ఖతిక్‌(26) పోలీసులకు చిక్కాడు. బుధవారం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్లలోని ఐదు ప్రాంతాల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసు చోరీలు జరిగిన సంగతి తెలిసిందే. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాల ఆధారంగా ఫుటేజ్‌ సేకరించిన పోలీసులు నిందితుడి వీడియోలను సేకరించారు. నిందితుడు ఎవరనే అంశంపై స్పష్టతకు రాగలిగారు. ఈనెల 18, 19 తేదీల్లో ఆసిఫ్‌ నగర్‌లో స్కూటీ చోరీ, నాంపల్లిలోని హోటల్‌లో దిగటం, వరుసగా గొలుసు దొంగతనాలు చేసిన వ్యక్తి ఉమేష్‌ ఖతిక్‌ అనే అంచనాకు వచ్చారు. అహ్మదాబాద్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, సైబరాబాద్‌, రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారమే గుజరాత్‌, రాజస్థాన్‌ బయల్దేరి వెళ్లారు. అలాగే నలుగురు పోలీసు అధికారులు కూడా అహ్మదాబాద్‌కు విమానంలో చేరుకున్నారు. హైదరాబాద్‌ పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అప్పటికే గుజరాత్‌ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. తరువాత పీటీ వారెంట్‌పై తీసుకెళ్లమంటూ అక్కడి పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.

ఎలా దొరికాడంటే.. గొలుసు దొంగ ఉమేష్‌ ఖతిక్‌ను ఇటీవల అహ్మదాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రిమాండ్‌కు తరలిస్తున్న సమయంలో ఖాకీల కన్నుగప్పి తప్పించుకుని హైదరాబాద్‌ చేరాడు. నాంపల్లి వద్ద హోటల్‌లో దిగేటపుడు ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్లు అసలైనవే ఇచ్చాడు. హోటల్‌ మేనేజర్‌ నుంచి సీసీ ఫుటేజ్‌, ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్లు సేకరించటంతో నిందితుడిని గుర్తించటం సులువైంది.

ఎవరీ ఉమేష్‌ ఖతిక్‌.. పోలీసుల రికార్డుల్లో ఉమేష్‌ అలియాస్‌ లాలోఖతిక్‌ వయస్సు 26 ఏళ్లు. ఇతడి స్వస్థలం గుజరాత్‌లోని సోలా పరాస్‌ నగర్‌. గుజరాత్‌, రాజస్థాన్‌ పోలీసులకు కొరకరాని కొయ్య అనే పేరుంది. గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ఒకే రోజు 12 గొలుసు దొంగతనాలకు పాల్పడినట్టు కేసులున్నాయి. చోరీలకు బయల్దేరే ముందుగా ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తాడు. పాన్‌ దుకాణాలు, మరుగు దొడ్లలోకి వెళ్లే ద్విచక్ర వాహనదారులు కొందరు వాటికే తాళం వదలి వెళ్తుంటారు.   ఆయా ప్రాంతాల్లో నిఘా ఉంచి తాళం చెవి అలాగే ఉంచిన వాహనాన్ని తేలికగా కొట్టేసేవాడు. ఆ వాహనం ఉపయోగించి వరుసగా గొలుసు చోరీలు చేస్తాడు. మైనర్‌గా ఉన్నప్పుడే చోరీల బాట పట్టిన నిందితుడు ఇప్పటి వరకూ వందకుపైగా గొలుసు, వాహన దొంగతనాలు చేసి ఉండవచ్చని గుజరాత్‌ పోలీసులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని