logo

బతికున్నా.. చంపేస్తున్నారు..!

మోమిన్‌పేట్‌ మండలం బూరుగుపల్లిలో బుచ్చమ్మ (పక్క చిత్రం) అనే మహిళ బతికి ఉండగానే మృతి చెందిదంటూ తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం తయారు చేశారు. అది నిజమే అంటూ తహసీల్దారూ ఆమోదించారు. అనంతరం వంశ వృక్షం వేసి ఆ భూమి వారసురాలు ఈమే అంటూ ఓ  మహిళ పేరిట పేర్లు మార్పించారు (మ్యుటేషన్‌). దాన్ని వారం తిరగకముందే వేరొరికి అమ్ముకున్నారు. అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ భూమి విలువ అక్షరాలా రూ.8 కోట్లపైమాటే అని అంచనా. సర్వే నంబరు

Published : 24 Jan 2022 01:04 IST

తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలతో భూముల బదలాయింపు
తరచూ వెలుగులోకి...
పట్టించుకోని అధికారులు

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

* మోమిన్‌పేట్‌ మండలం బూరుగుపల్లిలో బుచ్చమ్మ (పక్క చిత్రం) అనే మహిళ బతికి ఉండగానే మృతి చెందిదంటూ తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం తయారు చేశారు. అది నిజమే అంటూ తహసీల్దారూ ఆమోదించారు. అనంతరం వంశ వృక్షం వేసి ఆ భూమి వారసురాలు ఈమే అంటూ ఓ  మహిళ పేరిట పేర్లు మార్పించారు (మ్యుటేషన్‌). దాన్ని వారం తిరగకముందే వేరొరికి అమ్ముకున్నారు. అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ భూమి విలువ అక్షరాలా రూ.8 కోట్లపైమాటే అని అంచనా. సర్వే నంబరు 46, 49లలో 3 ఎకరాల భూమికి 2005 నుంచి 2014 వరకు నాలుగు దఫాలు రిజిస్ట్రేషన్‌ జరిగింది. కొంత కాలంగా మ్యుటేషన్‌ పెండింగ్‌లో ఉంది. సంబంధిత వ్యక్తులు తరచూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదు. అయితే ఇటీవల భూమికి సంబంధించి వారసులమంటూ ఓ మహిళ రావడం, గతంలో రిజిస్ట్రేషన్‌ పత్రాలను రద్దు చేసి, బతికి ఉన్న వ్యక్తిని మృతి చెందినట్లు చూపించి, మా భూమిని అక్రమంగా వేరొకరికి రిజిస్ట్రేషన్‌ చేసిన తహసీల్దార్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

ధారూర్‌ మండలంలోనూ రెండు నెలల క్రితం ఇదే తరహా సంఘటన వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్‌కు చెందిన మహిళకు ధారూర్‌ మండలంలో వ్యవసాయ పొలం ఉంది. ఆమె ‘మృతి చెందింది’ అంటూ తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసే రెవెన్యూ ఉద్యోగి తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాడు. తీరా విషయం బయటకు రావడంతో కొన్నాళ్ల పాటు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అనంతరం ముందస్తు బెయిల్‌ తీసుకుని దర్జాగా తిరుగుతున్నాడు. ఈయన విషయంలో కొంత మంది ప్రజా ప్రతినిధులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించారని సమాచారం.

సజీవంగా ఉన్నా.. వారు ‘చనిపోయారంటూ’ తప్పుడు మరణ ‘ధ్రువీకరణ’ పత్రాలను సృష్టించడం.. క్షేత్ర స్థాయిలో పరిశీలించాం.. అది వాస్తవమే అంటూ నిర్ధరించం రెవెన్యూ అధికారులకు అలవాటుగా మారిపోతోంది. అనంతరం సదరు వ్యక్తులకు చెందాల్సిన భూముల మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం, పేరు మార్పిడి అయిన వెంటనే రూ.కోట్ల విలువైన భూములను అమ్ముకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వ్యవహారంలో అక్రమంగా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అయితే తప్పు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా ఉన్నతాధికారులు ఆ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. దీంతో జిల్లాలో మళ్లీమళ్లీ అదే తరహా సంఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది.

లోపాలే ఆసరా... అంతా కుమ్మక్కు
జిల్లా కేంద్రమైన వికారాబాద్‌, మోమిన్‌పేట్‌, పూడూరు, పరిగి, నవాబుపేట్‌ మండలాల్లో భూములకు విపరీతమైన ధరలు ఉన్నాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా ఎకరం కనీసం రూ.53 లక్షల నుంచి రూ.1.30 కోట్లు పలుకుతోంది. దీంతో రెవెన్యూ శాఖలో పనిచేసే కొంత మంది ఉన్నత, మధ్యస్థాయి సిబ్బంది బయటి వ్యక్తులతో కలిసి లోపాలను ఆసరాగా చేసుకుని పావులు కదుపుతున్నారు. తగాదాల్లో ఉన్నవి, కొన్నాళ్లుగా ఎవరూ పట్టించుకోని భూములను లక్ష్యంగా చేసుకుని, నకిలీ సంతకాలతో కొత్త ధ్రువ పత్రాలు సృష్టిస్తున్నారు. ధరణి పోర్టల్‌లో అంతా సరి చేస్తున్నారు. ఆనక అమ్మకానికి పెడుతున్నారు.
వికారాబాద్‌ మండలం బూర్గుపల్లిలో రూ.5 కోట్ల విలువైన 7 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని బాధ్యులుగా చేసి, ఇతర ఉన్నతాధికారులు తప్పించుకున్నారు. ఇదే మండలంలో ఈ తరహా సంఘటనలో మరో మూడు వెలుగులోకి వచ్చాయి.
పరిగి మండలంలో ప్రభుత్వం సాదాబైనామాలను నిలిపివేసిన తరువాత తహసీల్దార్‌ ఆన్‌లైన్‌ చేసి, వేరే వ్యక్తులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేశారు. ఈ సందర్భంలోనూ ఉన్నతాధికారులు గుట్టుగానే వ్యవహరించారనే విమర్శలొచ్చాయి. చర్యల శూన్యం.
పూడూరు మండలంలో 14 ఎకరాల దేవాదాయ భూములను ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నవారు, ఫోర్జరీ సంతకాలు చేసిన వ్యక్తులు దర్జాగా తిరుగుతున్నారు. మరెన్నో సందర్భాల్లో రెవెన్యూ సిబ్బంది అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఈ విషయమై రెవెన్యూ విభాగంలోని ఓ ఉన్నతాధికారిని వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పాలనాధికారి సైతం భూముల పేర్ల బదలాయింపులో జరుగుతున్న అక్రమాలపై పూర్తి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని