logo

‘దళిత బంధు’కు కసరత్తు ప్రారంభం

జిల్లాలో ‘దళిత బంధు’కు అర్హుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం పేర్కొనడంతో పథకం అమలుకు అధికారులు కసరత్తును ప్రారంభించారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని, మార్చి నెలలో

Published : 24 Jan 2022 01:04 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ: జిల్లాలో ‘దళిత బంధు’కు అర్హుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం పేర్కొనడంతో పథకం అమలుకు అధికారులు కసరత్తును ప్రారంభించారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని, మార్చి నెలలో నిర్దేశిత ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని శనివారం రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సబితారెడ్డి అధికారులకు సూచించారు. దీంతో పథకం నిర్వహణకు ప్రతి నియోజక వర్గానికి ఒక అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా నియోజక వర్గ ఎమ్మెల్యేలు చేయాల్సి ఉంది. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రులు సూచించారు.

400 మందిని ఎంపిక చేస్తారు
నియోజక వర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేయాలనేది నిబంధన. దీనికి అనుగుణంగా జిల్లాలోని కొడంగల్‌, పరిగి, తాండూరు, వికారాబాద్‌ నియోజక వర్గాల్లో 400 మంది లబ్ధిదారులను గుర్తించనున్నారు. దళిత బంధు పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌ నియోజక వర్గంలో గతేడాది ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని ఇతర నియోజక వర్గాల్లో అమలు చేస్తున్నారు. దీన్లో భాగంగా ప్రస్తుతం జిల్లాలో కసరత్తు మొదలైంది.

నేరుగా రూ.10 లక్షలు జమ
ఈ పథకం కింద దళితులకు బ్యాంక్‌లతో సంబంధం లేకుండా రూ.10 లక్షలు నేరుగా లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంట్‌ రూపంలో అందజేస్తారు. ప్రస్తుతం జిల్లాలో 54,358 దళిత కుటుంబాలు ఉన్నట్లు కుటుంబ సర్వే ద్వారా తేలింది. ఇచ్చిన మొత్తంతో మినీ డెయిరీ యూనిట్‌, పందిరి కూరగాయల సాగు, వ్యవసాయం కోసం యంత్ర పరికరాల కొనుగోలు, ట్రాక్టర్‌ ట్రాలీ, ఆటో ట్రాలీ కొనుగోలు వంటివి చేయవచ్చు. అలాగే కోడి పిల్లల పెంపకం, సెవన్‌ సీటర్‌ ఆటో, విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల దుకాణం, టెంట్‌ హౌజ్‌, డెకరేషన్‌ లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌ ఆటో ట్రాలీ, ఆయిల్‌ మిల్లు, నాలుగు చక్రాల వాహనం, మినీ సూపర్‌బజార్‌, డీటీపీ, మీ సేవ, ఆన్‌లైన్‌ సేవలు ఫొటో స్టూడియో, బిల్డింగ్‌ సామగ్రి, హార్డ్‌వేర్‌ దుకాణం పెట్టుకోవచ్చు. ఒక్కరే కాకుండా ఇద్దరు, ముగ్గురు లబ్ధిదారులు కలిసి రూ.30, 40 లక్షలతో పెద్ద వ్యాపారం కూడా చేసుకునే అవకాశాం కల్పించారు.  

ఇలా చేస్తారు: లబ్ధిదారుల ఎంపిక అనంతరం కలెక్టర్‌ ప్రతి మండలంలో అనువైన బ్యాంక్‌ను ఎంపిక చేసి కుటుంబ పెద్ద పేరిట ప్రత్యేకంగా దళిత బంధు ఖాతాను తెరిపిస్తారు. యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి కలెక్టర్‌ను సంప్రదించి ఆమోదం తీసుకున్న తర్వాతే చెల్లింపులు జరుగుతాయి. నిధులు ఒకేసారి కాకుండా ప్రాజెక్టు నిర్వహిస్తున్న కొద్దీ విడుదలవుతాయి. లబ్ధిదారులను బృందాలుగా మారుస్తారు.  ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రతి నియోజక వర్గంలో ఒక అధికారి దళిత బంధు పథకాన్ని పర్యవేక్షిస్తారని మంత్రులు పేర్కొన్నారు. పథకం పటిష్ఠంగా అమలై జీవితాలకు ఆర్థికంగా అండగా నిలవాలని దళితులు ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని