logo

బాల్యవివాహాలకు అడ్డుకట్ట పడితేనే సాధ్యం

అమ్మాయి.. ఇంటికి వెలుగు, కంటి పాపతో సమానంగా భావిస్తాం. కుటుంబంలో నిండుదనం ఆడపిల్లతోనే. అమ్మలా ఆదరించి.. ఆనందాన్ని పంచుతుంది. ఇంట్లో కనీసం ఒక్క కూతురైనా ఉండాలని కోరుకునే వారు పెద్దసంఖ్యలోనే ఉంటారు. చిన్నారికి

Published : 24 Jan 2022 01:04 IST

బాల్యవివాహాలకు అడ్డుకట్ట పడితేనే సాధ్యం

నేడు జాతీయ బాలికా దినోత్సవం
న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌, మెదక్‌, సంగారెడ్డి అర్బన్‌, వికారాబాద్‌ టౌన్‌

కంది మండలంలోని ఓ గ్రామంలో చిన్నారి పెళ్లిని అడ్డుకున్న పోలీసులు

అమ్మాయి.. ఇంటికి వెలుగు, కంటి పాపతో సమానంగా భావిస్తాం. కుటుంబంలో నిండుదనం ఆడపిల్లతోనే. అమ్మలా ఆదరించి.. ఆనందాన్ని పంచుతుంది. ఇంట్లో కనీసం ఒక్క కూతురైనా ఉండాలని కోరుకునే వారు పెద్దసంఖ్యలోనే ఉంటారు. చిన్నారికి కుటుంబం, బంధుగణం, సమాజం బాసటగా నిలవాలి. అమ్మానాన్నలు ఓ బరువుగా కాకుండా.. బాధ్యతగా భావించాలి. ఈ తరుణంలో వారిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. బంగారు భవితను అందించాల్సిన వారే పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట పడితేనే వెలుగులు అందించగలరన్న విషయాన్ని మరచిపోకూడదు. నేడు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాల్యవివాహాలు, నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

ఆధునిక సమాజం.. సాంకేతికత వైపు పరుగులు తీస్తోంది. జీవనశైలి కొత్త పుంతలు తొక్కుతోంది. శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి, ప్రగతి సాధించిన తీరు అబ్బురపరుస్తోంది. ఇదంతా ఒక వైపు కాగా, బాలికల బాల్యాన్ని బందీగా మారుస్తుండటంతో చదువులకు దూరమవుతున్నారు. వివాహ బంధంలో చిక్కుకుంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం అడ్డుకుంటున్నవి తక్కువే కాగా, అనధికారికంగా పెద్దసంఖ్యలోనే జరిగాయి. కరోనా పరిస్థితుల్లోనూ ఈ ప్రభావం ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఎక్కువగా కనిపించింది. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లీలు జరిపిస్తున్నారు. రెవెన్యూ, ఐసీడీఎస్‌, పోలీసు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, బాలల సంక్షేమ సమితి, ఇతర శాఖలు అడ్డుకొని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. బాలికల ఆసక్తి మేర చదివిస్తున్నారు. లేనిపక్షంలో నిర్దేశిత వయసు వచ్చే వరకు పెళ్లి వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలు మరింత పకడ్బందీగా సాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ఎన్నో శాఖలు.. చట్టాలు
బాలికల హక్కుల పరిరక్షణకు జిల్లాల్లో వివిధ శాఖలు కృషి చేస్తున్నాయి. ఐసీడీఎస్‌, డీసీపీయూ, సీడబ్ల్యూసీ, సఖి కేంద్రం, చైల్డ్‌ లైన్‌ విభాగాలు, న్యాయ సేవాధికార సంస్థ, పోలీసు, రెవెన్యూ, వైద్యం, విద్యా శాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థలు ఇందుకు పని చేస్తున్నాయి. జేజే (జువైనల్‌ జస్టిస్‌) యాక్టు ప్రకారం 0-18 సంవత్సరాల్లోపు వారిని బాలికలు/బాలురుగా పరిగణిస్తారు. ప్రతి ఏటా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్‌ స్మైల్‌, ముస్కాన్‌లో భాగంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో బాల్య వివాహాల నిర్మూలన, అక్రమ రవాణా నివారణ, పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా చైల్డ్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నెం.1098కు సంప్రదించవచ్చని చెబుతున్నారు.

మరింత మార్పుతో ప్రగతి..
ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో బాలికలకు ప్రత్యేకించి విద్యా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గురుకులాలు, పాఠశాలలు, కస్తూర్బాలు, కళాశాలలు కొనసాగుతున్నాయి. అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌ పూర్తవగానే తల్లిదండ్రులు చదువును మానేయిస్తున్నారు. ఉన్నత చదువులపై ఆసక్తి ఉన్నా ప్రోత్సాహం కరవైంది. అభద్రతా భావంతో కుటుంబీకులు చిన్నారులను బందీగా మార్చుతున్నారు. గతంతో పోల్చితే పరిస్థితి కొంత మెరుగవుతున్నా.. మరింతగా మార్పు రావాల్సి ఉంది. జిల్లా, మండల, గ్రామాల స్థాయిల్లో ఏర్పాటుచేసిన కమిటీలను మరింత పరిపుష్టం చేయాలి. కరోనా నేపథ్యంలో ఏడాదిన్నరగా ఆయా కమిటీల సమావేశాలు అటకెక్కాయి. దీనిపై దృష్టిసారించాలి.

అడుగులు ఇలా..
సిద్దిపేటలో బాల్య వివాహాల నిర్మూలనకు చైతన్యం తీసుకొచ్చే దిశగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు సందర్భాలో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. రాయపోల్‌, దౌల్తాబాద్‌, జగదేవపూర్‌, హుస్నాబాద్‌, కోహెడ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి.
వికారాబాద్‌లో గ్రామస్థాయిలో సర్పంచులకు శిక్షణ ఇచ్చారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి బాల్యవివాహాల నిర్మూలనకు నడుం బిగిస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు వివాహం చేయమని ఒప్పంద పత్రం రాయిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో పుల్కల్‌, వట్‌పల్లి, నారాయణఖేడ్‌, అమీన్‌పూర్‌, పటాన్‌చెరు, సదాశివపేట, కంది, మునిపల్లి, కొండాపూర్‌ మండలాల్లో చిన్నారులకు పెళ్లిలు జరుగుతున్నాయి. కమిటీలు ఎక్కడైనా జరుగుతుందని తెలియగానే వెంటనే అక్కడికి వెళ్లి అడ్డుకుంటున్నాయి.
మెదక్‌ జిల్లాలో నర్సాపూర్‌, చిలప్‌చెడ్‌, కౌడిపల్లి, పాపన్నపేట, అల్లాదుర్గం, చిన్నశంకరంపేట తదితర మండలాల్లో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయి.


చైతన్యం తీసుకొస్తూ..

ర్సాపూర్‌ నియోజకవర్గంలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతుంటాయి. వీటిని నిరోధించేందుకు నర్సాపూర్‌కు చెందిన సాధన సంస్థ నడుం బిగింది. దీని డైరెక్టర్‌ రాహుల్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో బాలల హక్కుల సంఘాలను ఏర్పాటు చేయించారు. చిన్నతనంలో పెళ్లిలు చేస్తే కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో తమ కార్యకర్తల ద్వారా వచ్చే సమాచారాన్ని పోలీసులకు, ఐసీడీఎస్‌ అధికారులకు చేరవేస్తున్నారు. ఇటీవల విద్యార్థినులకు కరాటే, కుంగ్‌ఫూ విద్యల్లో శిక్షణ సైతం ఇస్తున్నారు. ఆటంకాలు ఎదురవుతున్నా ముందుకు సాగుతూ ఫలితాలు సాధిస్తుండటం గమనార్హం.

- న్యూస్‌టుడే, నర్సాపూర్‌


అవగాహన కల్పిస్తూ.. ఉన్నతంగా చదివించాలి..
- సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌

ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వీటిని మరింత ముందుకు తీసుకెళ్తాం. గ్రామాల నుంచి సమాచారం అందగానే సిబ్బంది వెళ్లి అడ్డుకుంటున్నారు. తల్లిదండ్రులు విజ్ఞతతో ఆలోచించాలి. నిర్ణీత వయసు వచ్చే వరకు పెళ్లిళ్లు చేయొద్దు. ఒకవేళ చేస్తే ఆరోగ్య సమస్యలు తప్పవని గమనించాలి. చదివించి ఉన్నతంగా ఎదిగేందుకు బాటలు వేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని