logo
Updated : 24 Jan 2022 04:54 IST

కరోనానా.. సాధారణ జ్వరమా!?

వాతావరణ మార్పులతో చాలా మందిలో అస్వస్థత

జలుబు, దగ్గు, గొంతునొప్పితో తీవ్ర ఇబ్బందులు

కుటుంబంలో ఇద్దరు ముగ్గురిలో ఇవే సమస్యలు

ఈనాడు, హైదరాబాద్‌ : గత 10-15 రోజుల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారింది. సాయంత్రం, ఉదయం వేళల్లో చల్లటి గాలులు వణికిస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో చాలామందిని రకరకాల శారీరక రుగ్మతలు వేధిస్తున్నాయి. చర్మం పొడి బారుతోంది. అస్తమా, సీవోపీడీ ఇతర శ్వాసకోశ ఇబ్బందులున్నవారు ప్రభావితమవుతున్నారు. కొందరిలో దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలు ఉంటున్నాయి. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో..ఈ అనారోగ్య సమస్యల కారణంపై అయోమయం నెలకొంటోంది. నగరంలోని కొన్ని ఔషధ దుకాణాల వద్ద ‘ఈనాడు’ ప్రత్యక్షంగా పరిశీలించినప్పుడు ప్రతి పది మందిలో ముగ్గురు, నలుగురు జ్వరం, జలుబు, దగ్గు, గొంతులో ఇన్‌ఫెక్షన్‌కు ఔషధాలు కొనుగోలు చేస్తున్నారు. చాలా కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురు ఇవే సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రిలో నిత్యం వెయ్యిమందికి పైనే ఓపీ ఉంటోంది. చలికాలంలో సాధారణ వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు సహజమేనని వైద్యులు పేర్కొంటున్నారు. అయినా కరోనా మూడో దశ విజృంభిస్తున్న తరుణంలో నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని సూచిస్తున్నారు.  

గుర్తించడం ఎలా.. 

కరోనా..సాధారణ వైరల్‌ ఇన్‌ఫెక్షన్లలో లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో హైగ్రేడ్‌ ఫీవర్‌తో పాటు.. ఒళ్లు నొప్పులు తీవ్రంగా ఉంటున్నాయి. పడుకొని లేవాలంటే బాగా నీరసంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. జ్వరం లేకుండా గొంతు నొప్పి, జలుబు, తుమ్ములు, దగ్గుతో ఆగిపోతే సాధారణ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌గా భావించవచ్చని, అయితే ఇది పూర్తిగా వాస్తవమని చెప్పలేమన్నారు. కేవలం దగ్గు, గొంతు నొప్పితో టెస్టు చేయించుకున్న కొందరిలోనూ కరోనా నిర్థారణ అవుతోందన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించామన్నారు. జ్వరంతో పాటు ఇతర లక్షణాలు ఉన్న వారిని పరీక్షిస్తే...ప్రతి పది మందిలో 8-9 మందిలో కరోనా ఉందని, అదే జ్వరం లేకుండా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి లాంటి లక్షణాలు ఉన్న వారికి కరోనా పరీక్షలు చేస్తే 10  మందిలో ఒకరిద్దరిలోనే వైరస్‌ బయట పడిందని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన వైద్యులు తెలిపారు. డెల్టా వేరియంట్‌లో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోవడం, రుచి, వాసన కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తేవన్నారు. ఒమిక్రాన్‌లో ఈ లక్షణాలు ఉండటం లేదని, అందుకే సాధారణ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, కరోనా మధ్య గుర్తింపులో కొంత గందరగోళం ఉంటోందన్నారు.


జ్వరం కొనసాగక పోతే ఇబ్బంది లేదు
- డాక్టర్‌ నందన జాస్తి, సీనియర్‌ ఫిజీషియన్‌ మెడికవర్‌ ఆసుపత్రి

సాధారణ వైరల్‌, కరోనా లక్షణాలు ఒకేలా ఉంటాయి. గుర్తించడం కొంత కష్టమే. జ్వరం రెండు, మూడు రోజులకు మించి కొనసాగితే అప్రమత్తం కావాలి. కరోనా పరీక్షలు చేయించుకోవాలి. జ్వరం లేకుండా గొంతు నొప్పి, జలుబు, దగ్గు లాంటివి ఉంటే ఆందోళన అవసరం లేదు. మాస్క్‌ ధరించి...వైద్యుల సూచనల మేరకు ఆయా లక్షణాలకు సంబంధించిన మందులు తీసుకోవాలి. రోజుకు రెండుసార్లు ఆవిరి పట్టడం, ఉప్పు నీళ్లు పుక్కిలించడంతో పాటు వేడి ఆహారం తీసుకోవడం, గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం, కాచి చల్లార్చిన నీళ్లు తాగడం లాంటి జాగ్రత్తలు పాటించాలి. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. 3-4 రోజుల్లోనే లక్షణాలు తగ్గిపోతాయి. అయిదు రోజులు దాటినా జ్వరం తగ్గకపోవడం, నీరసం, ఇతర లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి. ముఖ్యంగా సీవోపీడీ, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్‌ ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలకు ఆరోగ్యవంతులు భయపడాల్సిన పనిలేదు. టెస్టులు అవసరం లేదు. వ్యాక్సిన్‌ తీసుకోని వారు అప్రమత్తం కావాలి. వెంటనే తీసుకోవాలి.  


 

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని