logo

వడ్డీతో చెల్లించండి

నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన డబ్బు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీరుపై జిల్లా వినియోగదారుల కమిషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఫిర్యాదుదారునికి   వడ్డీతో మొత్తాన్ని చెల్లించడంతోపాటు కేసు

Published : 24 Jan 2022 01:42 IST

ఎస్బీఐకి జిల్లా వినియోగదారుల కమిషన్‌ ఆదేశం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన డబ్బు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీరుపై జిల్లా వినియోగదారుల కమిషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఫిర్యాదుదారునికి   వడ్డీతో మొత్తాన్ని చెల్లించడంతోపాటు కేసు ఖర్చులు ఇవ్వాలని సూచించింది. ఫిర్యాదుదారు.. అంబర్‌పేటకు చెందిన పి.వెంకటరమణ వివరాల ప్రకారం.. తన తండ్రి గోవింద్‌రాజ్‌ తన పేరిట ప్రతివాద ఎస్బీహెచ్‌ (ప్రస్తుతం ఎస్బీఐ)లో గోల్డెన్‌ జూబ్లీ సర్టిఫికేట్‌ తీసుకున్నారు. స్కీమ్‌ నిబంధనల ప్రకారం డబ్బు జమ చేస్తే 25 ఏళ్ల తర్వాత రూ.1,00,000 వస్తాయని బ్యాంకు సిబ్బంది తెలిపారు. దీంతో ఫిర్యాదుదారు తండ్రి 1993 సెప్టెంబర్‌లో రూ.6,634 జమ చేశారు. 2018 సెప్టెంబర్‌లో గడువు ముగియడంతో రూ.లక్ష ఇవ్వాలని బ్యాంకు అధికారులను సంప్రదించారు. రూ.66,686 మాత్రమే వస్తాయని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో, న్యాయం కోసం జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదుదారుడివి తప్పుడు లెక్కలని, రూ.66,686 మాత్రమే వస్తాయని వివరించింది. ఎస్బీఐ సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా కమిషన్‌ బెంచ్‌.. ఫిర్యాదుదారుడికి రూ.లక్ష చెల్లించాలని స్పష్టం చేసింది. 9 శాతం వడ్డీ చెల్లించడంతోపాటు కేసు ఖర్చుల కింద రూ.10 వేలు ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించింది. 45 రోజుల వ్యవధిలో డబ్బు చెల్లించకపోతే రూ.25 వేలు జరిమానా కట్టాల్సి వస్తుందని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని