logo
Updated : 24 Jan 2022 06:46 IST

Corona Virus: పాజిటివ్‌ ఇస్తాం.. నెగెటివ్‌గా మారుస్తాం!

నకిలీ ధ్రువపత్రాల పేరుతో నేరస్థుల దందా
ఆధార్‌.. ఫోన్‌నంబర్లతో టీకా ధ్రువపత్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వచ్చినట్టు ధ్రువపత్రం కావాలా? విదేశాలకు వెళ్లేందుకు వీలుగా నెగెటివ్‌ రిపోర్టు ఇవ్వాలా? రెండు డోసుల టీకా సర్టిఫికేట్లు మీ స్మార్ట్‌ఫోన్‌కు పంపించాలా? ఏ ధ్రువపత్రం కావాలన్నా సిద్ధం.. అంటూ కొందరు దందాకు తెరలేపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీకా డోసులు, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు ప్రాధాన్యం పెరగడంతో పరీక్షలు చేయించుకోకుండానే కొందరు నేరస్థులు ధ్రువపత్రాలు, టీకా డోసులు ఇచ్చేస్తున్నారు. ఐదారునెలల నుంచి గుట్టుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. వీరిని పోలీసులు అరెస్ట్‌ చేస్తుండడంతో ఒకటి, రెండూ అక్రమాలు బయటకు వస్తున్నాయి. అపహరణ కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటోన్న మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ రామ్‌ కోర్టు విచారణకు హాజరు కాలేనంటూ 4 నెలల క్రితం కరోనా పాజిటివ్‌ రిపోర్టు సమర్పించడంతో ఆ ధ్రువపత్రం ఇచ్చిన ల్యాబ్‌ సిబ్బందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన అనంతరం చాంద్రాయణగుట్టలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకుని జైలుకు పంపించారు.

నమూనా సేకరణ కేంద్రాల్లో.. 

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రైవేటు, కార్పొరేటు సంస్థలు, విమానయాన సంస్థలు చర్యలు చేపట్టాయి. తమ ఉద్యోగుల్ని ఇతర ప్రాంతాలకు పంపాలన్నా, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి రప్పించాలన్నా.. 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేయడంతో రెండు నెలల నుంచి ఈ పరీక్షలకు గిరాకీ పెరిగింది. స్వల్ప లక్షణాలున్న వారిలో కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లేందుకు నెగెటివ్‌ ధ్రువపత్రం కోసం రూ.2 వేల నుంచి రూ.3 వేలు చెల్లిస్తున్నారు. మరికొందరు పనుల నుంచి తప్పించుకునేందుకు, సెలవులు కావాలనుకున్నప్పుడు వైరస్‌ లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌ ధ్రువపత్రం కావాలంటూ ల్యాబ్‌ల నుంచి కొంటున్నారు. డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌లపై నిఘా లేమితో ఇవన్నీ జరుగుతున్నాయి.


టీకా నమోదు ఐడీల ద్వారా

టీకాలు వేసుకోకున్నా వేసుకున్నట్లు డబ్బు తీసుకుని ధ్రువపత్రాలు ఇస్తున్నారు. టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా పూర్తిచేయాలంటూ కేంద్రం ఆదేశించడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ, కార్పొరేటు ఆసుపత్రుల సిబ్బందికి నమోదుకు గుర్తింపు ఐడీలను ఇచ్చారు. పొరుగు సేవల సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు టీకా వేసుకోవాల్సిన వారి పేర్లు, ఫోన్‌నంబర్లు ఆధార్‌కార్డులు తీసుకుని నమోదు చేస్తున్నారు. వీటిని ఆసరాగా చేసుకున్న నేరస్థులు పొరుగుసేవల సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు డబ్బులిచ్చి టీకాలు వేయకున్నా వేసుకున్నట్టు ధ్రువపత్రాలు తీసుకుంటున్నారు. కింది స్థాయి సిబ్బంది ఫోన్‌నంబర్లు, ఆధార్‌కార్డులను తీసుకుని పరిశీలించకుండానే కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఇటీవల చనిపోయిన వ్యక్తికి టీకా వేసినట్టు ఆయన గతంలో వాడిన చరవాణికి సందేశం వచ్చింది.


 

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని