logo

ఆంక్షల వలయంలోకి కమ్యూనిటీలు

కరోనా కేసుల పెరుగుదల.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లలో ప్రజలు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల స్వచ్ఛందంగా ఆంక్షలు విధిస్తున్నారు. శానిటైజేషన్‌పై అధిక శ్రద్ధ పెడుతున్నారు. ఇందుకు నెలకు ప్రత్యేకంగా కొంత

Published : 24 Jan 2022 01:42 IST

కరోనా తీవ్రతతో గేటెడ్‌, అపార్టుమెంట్లలో అప్రమత్తం
ఆటస్థలాలు, ఈతకొలనుల మూసివేత
బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సాయం
ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, మియాపూర్‌, కేపీహెచ్‌బీకాలనీ

మైహోం జ్యువెల్‌లో క్రిమి సంహారక మందు పిచికారి

కరోనా కేసుల పెరుగుదల.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లలో ప్రజలు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల స్వచ్ఛందంగా ఆంక్షలు విధిస్తున్నారు. శానిటైజేషన్‌పై అధిక శ్రద్ధ పెడుతున్నారు. ఇందుకు నెలకు ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని కేటాయిస్తున్నారు. కొన్ని నెలలుగా కరోనా కేసులు లేకపోవడంతో అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ప్రత్యేకంగా నిబంధనలు అమలు చేయలేదు. ఇటీవల కేసులు పెద్దసంఖ్యలో పెరుగుతుండడంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నివాసిత సంక్షేమ సంఘాలు చెబుతున్నాయి. వీలైనంత వరకు సమూహాల సంఖ్యను తగ్గించడంపై దృష్టి పెట్టాయి. పిల్లల ఆటస్థలాలు, టెన్సిస్‌ కోర్టులు, క్లబ్‌ హౌస్‌లు, వాణిజ్య కార్యకలాపాలను అనుమతించడం లేదని పేర్కొంటున్నాయి. ‘‘జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. లిఫ్టులను శానిటైజ్‌ చేయిస్తున్నాం. సీ బ్లాక్‌లో కొన్ని నిబంధనలు అమల్లోకి వచ్చాయి.’’ అని మూసాపేటలోని రెయిన్‌బో విస్టాస్‌ నివాసితుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు ఆకెళ్ల శ్రీరామ్‌ వివరించారు.

ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు
కరోనా కేసులు వచ్చిన కుటుంబాలుండే ఫ్లాట్లకు ప్రత్యేకంగా స్టిక్కర్లు అతికిస్తూ.. బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడు రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండేందుకు సూచిస్తున్నారు. ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు అవసరమైన సరకులు సరఫరా చేస్తున్నారు. కేపీహెచ్‌బీలోని మలేషియన్‌ టౌన్‌షిప్‌లో ఆటస్థలాలను తాత్కాలికంగా మూసివేశారు. నివాసితులు బయట సంచరించే సమయంలో మాస్కు తప్పనిసరిగా పెట్టుకునేలా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షకులను ఏర్పాటు చేసినట్లు టౌన్‌షిప్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురేశ్‌ వివరించారు.

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు సిద్ధం
మదీనాగూడలోని మైహోం జ్యువెల్‌ కమ్యూనిటీలో 2 వేల ఫ్లాట్లు ఉన్నాయి. సంక్షేమ సంఘం నాయకులు అప్రమత్తమై 24 గంటలు అందుబాటులో ఉండేలా ‘కొవిడ్‌ రెస్పాన్స్‌ టీం’ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి సదరు బృందం సాయంతో బాధితులకు సరకులు, మందులు చేరవేస్తున్నారు. కమ్యూనిటీలో ప్రత్యేకంగా అంబులెన్స్‌ అందుబాటులో ఉంచారు. రెండు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేశారు. ఈతకొలనును మూసివేశారు. స్టాళ్ల నిర్వహణ విషయంలో ఆహారం, వస్త్ర సంబంధిత దుకాణాలపై నిబంధనలు విధించి అత్యవసర వస్తువులకే అనుమతిస్తున్నారు.


ప్రతి వీధిలో అవగాహన కల్పిస్తున్నాం
- నందకిశోర్‌, ప్రధాన కార్యదర్శి, మైహోం జ్యువెల్‌ యజమానులు సంక్షేమ సంఘం
మా కమ్యూనిటీలోని 14 బ్లాకుల్లో 2 వేల ఫ్లాట్లు ఉన్నాయి. అక్కడక్కడా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రతి వీధి తిరుగుతూ మైకుతో అవగాహన కల్పిస్తున్నాం. కమ్యూనిటీలో ఏటా డిసెంబరు 31న రాత్రి భారీ ఎత్తున నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తుంటాం. ఈసారి వేడుకలను రద్దు చేసి సమూహాలను అనుమతించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని