Karvy: కార్వీ సంస్థ ఛైర్మన్‌ పార్థసారథి అరెస్ట్‌

కార్వీ సంస్థ ఛైర్మన్‌ పార్థసారథిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. బెంగళూరులో ఉన్న ఆయన్ను ఈడీ అధికారులు

Updated : 24 Jan 2022 12:12 IST

హైదరాబాద్‌: కార్వీ సంస్థ ఛైర్మన్‌ పార్థసారథిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. బెంగళూరులో ఉన్న ఆయన్ను ఈడీ అధికారులు పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకొచ్చి చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

కార్వీ సంస్థ తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు గతంలోనే హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట భారీ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. మనీలాండరింగ్‌ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఈడీ కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. పెట్టుబడిదారులకు సంబంధించిన షేర్లను పార్థసారథి తన సొంత ఖాతాలకు మళ్లించుకుని వాటిని తనఖా పెట్టి బ్యాంకు రుణాలు పొందినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పార్థసారథిని ప్రశ్నించడంతో పాటు ఆయన కార్యాలయం, ఇంటిలో పలు దస్త్రాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో రూ.1500 కోట్ల మేర మోసం జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈడీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినందున మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. మరోవైపు చంచల్‌గూడ జైలులో ఉన్న పార్థసారథిని ఈడీ తమ కస్టడీకి తీసుకుని విచారించే అవకాశముంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని