కుమారుడి కిరాతకం
అర్ధరాత్రి వ్యాయామం వద్దన్నందుకు డంబెల్స్‌తో దాడి
తల్లి మృతి.. అడ్డొచ్చిన సోదరికి గాయాలు
పాపమ్మ, సుధీర్‌కుమార్
సుల్తాన్‌బజార్, న్యూస్‌టుడే: కన్న కొడుకే ఆ తల్లి పాలిట కాలయముడయ్యాడు. కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం, మల్కపల్లి గ్రామానికి చెందిన కొండా రమేశ్, పాపమ్మ(45) దంపతులు. బతుకు దెరువుకు కొనేళ్లక్రితం నగరానికి వచ్చారు. అనారోగ్యంతో 8 ఏళ్ల క్రితం రమేశ్ మృతి చెందగా.. పాపమ్మ, కుమారుడు సుధీర్‌కుమార్(24), కూతురు (25) రెండేళ్లుగా రాంకోఠిలో ఉంటున్నారు. డిగ్రీ చదివిన సుధీర్కొంతకాలం ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. మానసికస్థితి సరిగ్గా లేక ఏడాదిగా ఇంటివద్దే ఉంటున్న కుమారుడికి తల్లి చికిత్స చేయిస్తున్నారు. ఆదివారం రాత్రి ముగ్గురూ నిద్రకు ఉపక్రమించారు. సుధీర్ తెల్లవారు జాము 2 గంటల సమయంలో లేచి వ్యాయామం చేస్తుండగా, ఇప్పుడు చేయడమేంటని తల్లి వారించింది. విచక్షణ కోల్పోయిన సుధీర్ చేతిలోని డంబెల్స్‌తో తల్లి తలపై కొట్టాడు. పాపమ్మ అక్కడికక్కడే కుప్పకూలారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన సోదరిపై కూడా దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి యజమాని కారు అద్దాన్ని ధ్వంసం చేశాడు. సుచిత్ర కేకలతో ఇంటి యజమాని, చుట్టుపక్కల వారు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలికి చేరుకుని సుధీర్, గాయపడ్డ అతడి సోదరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నగర పోలీసు సంయుక్త కమిషనర్(తూర్పు మండలం) రమేశ్, సుల్తాన్‌బజార్ ఏసీపీ, ఇన్స్పెక్టర్ భిక్షపతి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇన్స్పెక్టర్ భిక్షపతి పర్యవేక్షణలో ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం పాపమ్మ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. వైద్యుల సూచనలు, న్యాయమూర్తి (మెజిస్ట్రేట్) ఆదేశాలతో సుధీర్‌ను ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.