logo

తెలుసుకుంటారా... ఇరుక్కుంటారా!!

‘కాలం మారుతున్నట్టు.. సైబర్‌ నేరగాళ్ల ఆలోచనా విధానాలూ మారుతున్నాయి. మనల్ని ఎప్పటికప్పుడు ఇరకాటంలో పెడుతూ ఏదో విధంగా మోసం చేస్తూనే ఉన్నారు కంటికి కనిపించని కేటుగాళ్లు.

Published : 25 Jan 2022 02:31 IST

సామాజిక మాధ్యమాల్లో సైబర్‌ నేరాలపై పోలీసుల అవగాహన

ఈనాడు, హైదరాబాద్‌

‘కాలం మారుతున్నట్టు.. సైబర్‌ నేరగాళ్ల ఆలోచనా విధానాలూ మారుతున్నాయి. మనల్ని ఎప్పటికప్పుడు ఇరకాటంలో పెడుతూ ఏదో విధంగా మోసం చేస్తూనే ఉన్నారు కంటికి కనిపించని కేటుగాళ్లు. ఇప్పుడు ప్రజల బలహీనతను అవకాశంగా చేసుకుని కొత్త మోసానికి తెరతీశారు. మేము జీహెచ్‌ఎంసీ నుంచి ఫోన్‌చేస్తున్నాం. మీరు బూస్టర్‌ డోసు తీసుకోవాల్సి ఉందా అంటారు. మేం స్లాట్‌ బుక్‌ చేస్తున్నాం. ఓటీపీ చెప్పమంటారు. అంతే ఖాతాలో సొమ్మంతా ఖాళీ చేస్తారు. వ్యాక్సినేషన్‌ పేరు మీద మీకు ఎవరైనా ఫోన్‌చేసి వివరాలు అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి’’- ఇదీ సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ విభాగం హెచ్చరిక.

‘‘మీకు ఇట్టే లాభాలు వస్తాయంటూ ఆశపెడుతుంటారు. యాప్‌ల్లో పెట్టుబడితో లక్షలు వస్తాయంటారు. మేం పంపుతున్న లింకులను క్లిక్‌ చేస్తే చాలంటూ సైబర్‌నేరగాళ్లు మోసాలకు దిగుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్థిక నేరానికి గురైనట్టు గ్రహించగానే బాధితులు వెంటనే 155260/ 100 నంబర్లకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయండి. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి పొందే అవకాశం ఉంద’’ంటూ రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసుల సూచనలు.

రాష్ట్రవ్యాప్తంగా సైబర్‌నేరాలపై వచ్చే ఫిర్యాదుల్లో 90శాతం గ్రేటర్‌ నుంచే ఉంటున్నాయి. ఉన్నతోద్యోగులు, విద్యావంతులు, సాంకేతిక నిపుణులు, గృహిణులు, వయోధికులు ఇలా అన్నివర్గాలు మాయగాళ్ల ఉచ్చులో పడి లక్షలు నష్టపోతున్నారు. మోసగాళ్లు కూడా అనువుగా ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు. ప్రస్తుతం తక్కువ ధరకే వస్తువులు, పెట్టుబడులు, బూస్టర్‌డోసులంటూ ప్రజలకు టోకరా వేస్తున్నారు. కొత్త ఏడాది 15 రోజుల వ్యవధిలోనే సుమారు 90-100 వరకూ ఫిర్యాదులు అందాయి. మాయగాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం సామాజిక మాధ్యమాలను వేదికగా మలచుకుంది. మోసపోయేందుకు వీలున్న అంశాలపై అవగాహన కల్పిస్తోంది. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అన్నింటి ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది. పిల్లల నుంచి పండుటాకుల వరకూ అందరి వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు సైబర్‌ నేరాల కట్టడికి అసలైన అస్త్రం అంటున్నారు.

సైబర్‌ మాయగాళ్లు పంపిన సందేశాలు

కళ్లెదుటే ఉన్నా ఇంకా అదే తీరు..

ప్రభుత్వం అందించే బూస్టర్‌డోసుకు ఎటువంటి నగదు తీసుకోదు. ఫోన్‌చేసి ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయమని డిమాండ్‌ చేయరని గుర్తించాలని రాచకొండ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ హరినాథ్‌ సూచించారు. సైబర్‌ మాయగాళ్ల మాటలతో మోసపోతున్న బాధితులు కళ్లెదుట కనిపిస్తున్నా గ్రహించకపోవటం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నామని వివరించారు. సైబర్‌ నేరస్థులు ఏయే తరహాలో మోసగిస్తారు. ఏ విధంగా మాట్లాడతారు. ఎటువంటి అంశాలను ఎంపిక చేసుకుంటారనే అంశాలు.. మాయగాళ్లు పంపిన సందేశాలను ఉదాహరణలుగా చూపుతూ అవగాహన పెరిగేలా చేస్తున్నట్టు చెప్పారు. బిహార్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ వంటి చోట్ల నుంచి ఫోన్‌చేసి మేం ఫలానా అని చెప్పగానే గుర్తించాలి. తోట్రుపాటు, మర్యాదలేని మాటతీరుతో వీళ్లను ఇట్టే గుర్తించవచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని