logo

ఓటు వజ్రాయుధం... నమోదు అవసరం

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. దీన్లో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. ప్రభుత్వాన్ని దించాలన్నా, తమకు నచ్చిన వారిని అందలం ఎక్కించాలన్నా ఓటే కీలకం.

Published : 25 Jan 2022 02:44 IST

నేడు ‘జాతీయ ఓటరు దినోత్సవం’

న్యూస్‌టుడే, వికారాబాద్‌

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. దీన్లో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. ప్రభుత్వాన్ని దించాలన్నా, తమకు నచ్చిన వారిని అందలం ఎక్కించాలన్నా ఓటే కీలకం. నిరాశ, నిస్పృహ, నిర్వేదం కమ్ముకుని..నీవు ఓటరుగా చేరకుంటే అది ప్రగతిశీల ప్రజాస్వామ్యానికే ముప్పని మేధావులు పదేపదే చెబుతుంటారు. అందుకే ఓటు నమోదును బాధ్యతగా పూర్తిచేయాలి. నేడు ‘జాతీయ ఓటరు దినోత్సవం’ సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనం..

ఇకనైనా.. గుర్తించండి..

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటరు నమోదు, ఓటు హక్కు సద్వినియోగంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 18ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు కావాలని సూచించటంతోపాటు ఓటు విలువపై ప్రచారం చేస్తున్నారు. ఓటరు నమోదు, ఓటు వినియోగంతో కల్గే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ప్రస్తుతానికి నిర్వహించడంలేదు.

* 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ, యువకుడు ఓటరుగా మారాలనే విషయాన్ని నేటి ఓటరు దినోత్సవం రోజైనా గుర్తించాలి. మంచి నాయకుడిని ఎన్నుకోవడం, అవినీతి రహిత సమాజ నిర్మాణంలో బాధ్యతను తెలుసుకుని మసలు కోవడం పౌరుల బాధ్యత. ‘ఓటు వేయలేదేం’ అని మనల్ని అడిగేవారు ఎవరూ ఉండరు. కానీ ఓ మంచి అవకాశాన్ని కోల్పోకూడదని గ్రహించాలి. ఇప్పటికీ జాబితాలో పేరు లేకుంటే వెంటనే నమోదు చేయించుకోవాలి. జిల్లాలో ఇటీవలే ఓటరు నమోదు కార్యక్రమాన్ని వాడవాడలా నిర్వహించారు. దీన్లో యువత తమ పేర్ల నమోదుకు ఉత్సాహం చూపిన మాట వాస్తవమైనా..ఇంకా కొందరు నమోదు కావాల్సి ఉంది. వారుకూడా చొరవ చూపాలని అధికారులు కోరుతున్నారు.

ఈరోజే ఎందుకంటే..

18 ఏళ్లు నిండిన యువత ఓటరు నమోదుపై అంతగా ఆసక్తి చూపకపోవటాన్ని ఎన్నికల సంఘం గుర్తించింది. వారిని ఓటరు నమోదు దిశగా చైతన్యం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జనవరి 25న ఎన్నికల సంఘం 60వ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా 2011 నుంచి జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తోంది.

అభ్యంతరాలు ఉంటే..

ఏ పేరైనా జాబితాలో తొలిగించాలనుకుంటే లేదా అభ్యంతరాలు చేయాలనుకుంటే (చనిపోయిన/నివాస ప్రాంతం మారినప్పుడు) ఫారం-7 వినియోగించుకోవచ్ఛు అలాగే ఓటరు జాబితాలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే.. (ఫొటోలు/మీ పేరు, తండ్రి, భార్య/భర్త పేర్ల సవరణ మొదలగు) మార్పులకు ఫారం-8 పూర్తి చేయాలి.

చిరునామా మారితే.. ఫారం నెం.8(ఏ)

నియోజకవర్గ పరిధిలో మీ నివాస ప్రదేశం ఒక పోలింగ్‌ స్టేషన్‌ నుంచి మరొక పోలింగ్‌ స్టేషన్‌కు మారితే.. ఫారం నెం.8(ఏ) పూర్తి చేసి ప్రాంతాన్ని మార్పు చేసుకునే సదుపాయం ఉంది.

అంతర్జాలంలో అవకాశం..

ఓటరు నమోదు కోసం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక వెబ్‌సైట్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ల కోసం సీఈఓటీఈఎల్‌ఏఎన్‌జీఏఎన్‌ఏ.ఎన్‌ఐసీ.ఐఎన్‌లో సంప్రదించవచ్ఛు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని