logo

తిరగకుంటే.. ఎలా..!

ఆర్టీసీకి ఆదాయం తగ్గుతోంది. ఇది కాదనలేని వాస్తవం. ఇదే సమయంలో ప్రయాణికులు తక్కువున్నారంటూ అధికారులు కొన్ని రూట్లలో ఏకంగా బస్సులనే తిప్పడం మానేస్తున్నారు. దీంతో వారు ప్రైవేటు వాహనాలపై ఆధారపడక తప్పడంలేదు.

Published : 26 Jan 2022 01:22 IST

ఆదాయం లేదంటూ బస్సులను నడపని ఆర్టీసీ

ప్రైవేటు వాహనాలే శరణ్యం

న్యూస్‌టుడే, తాండూరు, బొంరాస్‌పేట: ఆర్టీసీకి ఆదాయం తగ్గుతోంది. ఇది కాదనలేని వాస్తవం. ఇదే సమయంలో ప్రయాణికులు తక్కువున్నారంటూ అధికారులు కొన్ని రూట్లలో ఏకంగా బస్సులనే తిప్పడం మానేస్తున్నారు. దీంతో వారు ప్రైవేటు వాహనాలపై ఆధారపడక తప్పడంలేదు. ఈ రెండు విషయాలనూ సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పునఃసమీక్షించాల్సిన అవసరం అధికారులపై ఉందని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

కి.మీకి.రూ.15 మాత్రమే వస్తోంది

జిల్లాలో ఒక్కో కిలో మీటరుకు రూ.25 చొప్పున సమకూరితేనే ఆర్టీసీకి ఆదాయం వస్తున్నట్లు లెక్క. దీంతోనే సిబ్బంది వేతనాలు, బస్సుల నిర్వహణ, ఇంధన ఖర్చులు పోను ఎంతో కొంత ఆదాయంగా మిగులుతుంది. అయితే పది రోజుల నుంచి కి.మీకు రూ.15 చొప్పున మాత్రమే అతికష్టంగా సమకూరుతుంది.

* జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, పరిగి డిపోల పరిధిలోని 251 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి నిత్యం 91,000 కి.మీ.వరకు రాకపోకలు నిర్వహిస్తే రూ.27లక్షల ఆదాయం సమకూరుతుంది. ఈనెల 6వ తేదీ నుంచి బస్సుల్లో రాకపోకలు నిర్వహించే ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. ఆదాయం రూ.22లక్షలకు పడిపోయింది. ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ఈనెల 30వరకు పొడిగించింది. దీనికి తోడు జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ ప్రారంభమైంది. ఈ కారణంగా చాలా మంది రాకపోకలను తగ్గించారు. ఆదాయం పడిపోతోందని 70,000 కి.మీ.వరకే తిప్పుతున్నారు. మిగిలిన 21,000 కి.మీ.మేర బస్సులను రద్దు చేశారు.

* ప్రయాణికుల రద్దీ తగ్గడంతో అధికారులు 27 బస్సులను తాత్కాలికంగా రద్దు చేశారు. 251 బస్సులకు గాను ప్రస్తుతం 224 మాత్రమే తిరుగుతున్నాయి. పరిగి డిపోలో 9 ఆర్టీసీ, 6 అద్దెబస్సులను, తాండూరు డిపోలో 5 ఆర్టీసీ, వికారాబాద్‌ డిపోలో 7 ఆర్టీసీ బస్సులను నిలిపి వేశారు.

పూర్తిగా నిలిపేశారు

ప్రతి కిలో మీటరుకు నిర్ణీత ఆదాయం కంటే తక్కువగా వస్తుండడంతో ఇది సంస్థకు నష్టం కలిగించే పరిణామమని కొన్ని బస్సులను తాత్కాలికంగా రద్దు చేశారు. తాండూరు డిపో పరిధిలోని తాండూరు మండలం నారాయణపూర్‌, చంద్రవంచ, ఉద్దండాపూరు, పెద్దేముల్‌ మండలం నాగులపల్లి, జనగాం, మదనంతాపూరు, అడ్కిచర్ల, బషీరాబాద్‌ మండలం గొట్టిగ కలాన్‌ రూట్లలో బస్సుల రాకపోకలు ప్రస్తుతానికి పూర్తిగా నిలిచి పోయాయి. విద్యార్థుల కోసమని ఉదయం, సాయంత్రం వేళల్లో తిరిగే కొద్దిపాటి బస్సులను కూడా ఆపేశారు. ప్రత్యామ్నాయంగా ఆటోలు లేదంటే సొంత బైక్‌లపై ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇందుకోసం అధిక మొత్తాలను ఛార్జీలకుగా చెల్లించాల్సి వస్తోంది. మిగిలిన పరిగి, వికారాబాద్‌ డిపోల పరిధిలో బస్సులు రద్దయిన రూట్లలోని ప్రయాణికుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దీంతో ఆయా గ్రామాల నుంచి ఇతర గ్రామాలకు వెళ్లాల్సిన వారు ఆటోలు లేదంటే సొంత బైక్‌లపై రాకపోకలు నిర్వహించాల్సి వస్తోంది.

* మరోవైపు... జిల్లాలో బస్సులు ప్రారంభమయ్యే స్టార్టింగ్‌ పాయింట్లుగా ఉన్న తాండూరు, పరిగి, వికారాబాద్‌ ప్రయాణ ప్రాంగాణాల వద్ద ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. బస్సు వెళ్లే గమ్యస్థానాలను అరుస్తూ వివరిస్తున్నారు. నిర్ణీత సమయం కంటే ప్లాట్‌ఫాం వద్ద కొద్దిగా ఎక్కువే సేపే నిలువరిస్తున్నారు. ఇంతచేసినా సరిపడా ప్రయాణికులు రావడం లేదని వాపోతున్నారు.


డిమాండ్‌కు అనుగుణంగా పునరుద్ధరిస్తాం

- రమేష్‌, జిల్లా ఆర్టీసీ డివిజనల్‌ మేనేజరు

కరోనా ప్రభావం వల్లే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రాకపోకలు తగ్గాయని ప్రాథమికంగా భావిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా తాత్కాలికంగా మాత్రమే బస్సులను రద్దు చేయాల్సి వచ్చింది. డిమాండ్‌ పెరగగానే అన్ని బస్సులను అందుబాటులోకి తెస్తాం. బస్సులేదని ఇబ్బంది పడే ప్రయాణికులు తమకు ఫోన్‌ చేసి తెలియజేస్తే చాలు. పూర్తి వివరాలు తెలుసుకుని తిప్పుతాం. ప్రయాణికుల ఆర్టీసీ బస్సుల్లోనే రాకపోకలు సాగించాలని కోరుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని