logo

తెలంగాణలో పర్యాటక రంగం ముందడుగు

తెలంగాణకి అద్భుతమైన చరిత్ర ఉందని, ఇక్కడ ఆది మానవుల మనుగడకు చెందిన అనేక ఆనవాళ్లు ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో తెలంగాణలో పురాతన చరిత్ర గల వాటిని వెలికి తీసి ఇక్కడి పర్యాటకాన్ని

Published : 26 Jan 2022 02:46 IST


మేడారం జాతర వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, చిత్రంలో సోమేశ్‌కుమార్‌, ఉప్పల శ్రీనివాసగుప్తా

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణకి అద్భుతమైన చరిత్ర ఉందని, ఇక్కడ ఆది మానవుల మనుగడకు చెందిన అనేక ఆనవాళ్లు ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో తెలంగాణలో పురాతన చరిత్ర గల వాటిని వెలికి తీసి ఇక్కడి పర్యాటకాన్ని ప్రపంచానికి చూపడంతో పోచంపల్లి, రామప్పలు ప్రపంచ పటంలోకి చేరాయన్నారు. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం గ్రీన్‌ల్యాండ్స్‌లోని హోటల్‌ హరిత ప్లాజాలో ప్రత్యేక సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తాలతో కలిసి మంత్రి మాట్లాడారు. భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల్లో అధికులు నగరానికి వస్తున్నారన్నారు. పర్యాటక రంగం అభివృద్ధితో అనేకులకు ఉపాధి లభిస్తోందని మంత్రి వివరించారు. సీఎస్‌ సోమేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరాన్ని సీఎం నిర్మించారని గుర్తు చేశారు. మూసీ నదీ పర్యాటకంగా రూపుదిద్దుకోనుందన్నారు. నది పొడవునా ఫుడ్‌కోర్టులు, వాక్‌ వేస్‌, బోటింగ్‌లు ఉండనున్నాయని వెల్లడించారు. నల్గొండలో ఛాయా సోమేశ్వర్‌ ఆలయం సూర్యకాంతిని బట్టి రంగులు మారుతుంది, దీనికి ఏ సాంకేతికత వాడారో ఇప్పటికీ తెలియదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ బి.మనోహర్‌ పాల్గొన్నారు.

త్వరలోనే కొత్త విధానం.. త్వరలోనే ఉత్తమ పర్యాటక విధానాన్ని తెస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. కొండపోచమ్మసాగర్‌ సహా ప్రతి రిజర్వాయర్‌ను పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. యాదాద్రి ఆలయం, ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణతో రాష్ట్రం ఆధ్యాత్మిక తెలంగాణగా రూపొందుతోందని అన్నారు. యాదాద్రిలో బస్వాపూర్‌ రిజర్వాయర్‌ దగ్గర రూ.250 కోట్లతో, కాశేశ్వరం ప్రాజెక్టు వద్ద ఎకోటూరిజం ప్రాజెక్టును రూ.350 కోట్లతో చేపట్టనున్నట్లు తెలిపారు. రంగనాయకసాగర్‌, లోయర్‌మానేరు డ్యాం, అన్నపూర్ణ రిజర్వాయర్‌ తదితర చోట్ల పర్యాటక అభివృద్ధికి రూ.1,375 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని