logo

లోపాలే సమస్తం

రోజూ ఉదయమే కొనుగోలు చేసే పాలు, పాలప్యాకెట్లలో ఏది అసలు/ఏది నకిలీ అని గుర్తించటం సవాలుగా మారింది. తాజాగా పటాన్‌చెరు వద్ద పెద్ద ఎత్తున పాలు, పెరుగు, పన్నీర్‌ వంటి వాటిని కల్తీ చేస్తూ నగర ప్రజలకు సరఫరా చేస్తున్న ముఠా బండారం వెలుగు చూసింది.

Published : 26 Jan 2022 03:04 IST

ప్రజారోగ్యంతో కేటుగాళ్ల చెలగాటం

దందాకు హైదరాబాదే అడ్డా!

ఈనాడు, హైదరాబాద్‌: రోజూ ఉదయమే కొనుగోలు చేసే పాలు, పాలప్యాకెట్లలో ఏది అసలు/ఏది నకిలీ అని గుర్తించటం సవాలుగా మారింది. తాజాగా పటాన్‌చెరు వద్ద పెద్ద ఎత్తున పాలు, పెరుగు, పన్నీర్‌ వంటి వాటిని కల్తీ చేస్తూ నగర ప్రజలకు సరఫరా చేస్తున్న ముఠా బండారం వెలుగు చూసింది. నాలుగేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఎఫ్‌ ఎస్‌ ఎస్‌ ఏఐ 1103 నగరాల్లో సరఫరా అవుతున్న 6,432 పాలశాంపిళ్లను సేకరించి పరీక్ష నిర్వహించారు. వాటిలో ఆరోగ్య ప్రామాణికాలున్నవి కేవలం 10.4 శాతమేనని నిర్ధారించారు. తెలంగాణలోనే అధిక శాతం పాలు కల్తీ జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కల్తీ పాలు, పాల ఉత్పత్తుల తయారీకి  హైదరాబాద్‌ అడ్డాగా మారింది.

* కల్తీ పాలు, పెరుగు తయారీ కోసం యూరియా, డిటర్జెంట్‌, స్టార్చ్‌, పాలు, పెరుగు వాసన కోసం కొన్ని రకాల రసాయనాలను వాడుతుంటారు.  

* పాలు, పెరుగుకు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు  కొన్ని డెయిరీలు, పాల ఉత్పత్తిదారులు ఇందులో భాగం పంచుకోవటం ఆందోళన కలిగిస్తోంది. పెరుగు తయారీకి ఆరోగ్యానికి హాని కల్గించే రసాయనాలు ఉపయోగిస్తున్నారు. వీటిని వాడటంతో గంటల వ్యవధిలో గడ్డపెరుగు తయారు చేస్తున్నారని పటాన్‌చెరు డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు.

* హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, సైబరాబాద్‌, రాచకొండ ఎస్‌వోటీ బృందాల తనిఖీల్లో ఏటా 60-70 వరకూ కల్తీ కేంద్రాలను గుర్తిస్తున్నారు. 100-150 మందిని అరెస్ట్‌ చేస్తుంటారు. స్వచ్ఛమైన పాలను ఉదయాన్నే అందిస్తున్నామంటూ కొందరు టోకరా వేస్తున్నారు. రెండు, మూడు పాడి పశువులతో ఏడాది పొడవునా ఇంజెక్షన్లు ఇస్తూ పాలు సేకరిస్తున్న ఘనులూ ఉన్నారు. కల్తీపాలను ప్రముఖ సంస్థల లేబుళ్లతో మిఠాయి దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నారు. తక్కువ ధరకు రావటం, కల్తీ ఉత్పత్తులు అని గుర్తించే అవకాశం లేకపోవటం దందాకు అనుకూలంగా మారిందంటున్నారు పోలీసులు.


ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం
- డాక్టర్‌ రమేష్‌, గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు, ఉస్మానియా ఆసుపత్రి

* కల్తీ పాలు, పెరుగుతో జీర్ణవ్యవస్థపై తక్షణం ప్రభావం చూపుతుంది. అందులో క్లాస్టిడ్మిం, ఈకోలై, సాల్మానెల్లా తదితర ప్రమాదకర బ్యాక్టీరియాతోపాటు రోటా వైరస్‌ కూడా ఉంటుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు, వాంతులు, వీరేచనాలు, కడుపులో తిప్పడం, అల్సర్లు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. పిల్లలు తాగితే వారిలో తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. డయేరియాకు కారణమవుతుంది. మూత్రపిండాలు వైఫల్యం చెందుతాయి. కాలేయానికీ ముప్పే. పచ్చకామెర్లు సోకుతాయి. క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఎక్కువే.

* జాగ్రత్తగా పరిశీలిస్తే కల్తీ పాలను గుర్తించవచ్చు. వాసన పసిగడితే తేడా తెలిసిపోతుంది. నేలపై వేసినప్పుడు కల్తీ పాలైతే వాటిలో ఎక్కువ కదలిక ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు