logo

నడిపేబండి.. జాగ్రత్తండి!

నగరంలో ఏటా 1800-2000కు పైగా వాహనాలు దొంగతనానికి గురవుతున్నాయి.వీటిలో ద్విచక్రవాహనాలే అధికం. రూ.20,000-2.5లక్షల వరకు ఖరీదైన ద్విచక్ర, రూ.2-90కోట్ల విలువైన కార్ల వరకూ చోరుల కన్నుపడి రాత్రికి రాత్రే మాయమవుతున్నాయి.

Updated : 26 Jan 2022 04:09 IST

గ్రేటర్‌లో ఏటా 2000కు పైగా వాహనాలు చోరీ

ఈనాడు, హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: నగరంలో ఏటా 1800-2000కు పైగా వాహనాలు దొంగతనానికి గురవుతున్నాయి.వీటిలో ద్విచక్రవాహనాలే అధికం. రూ.20,000-2.5లక్షల వరకు ఖరీదైన ద్విచక్ర, రూ.2-90కోట్ల విలువైన కార్ల వరకూ చోరుల కన్నుపడి రాత్రికి రాత్రే మాయమవుతున్నాయి. వీటిలో 40-55శాతం మాత్రమే పోలీసులు రికవరీ చేయగలుగుతున్నారు. ఫిర్యాదుచేస్తున్న వారిలో అధికశాతం వాహన బీమా రెన్యువల్‌ చేయక పూర్తిగా నష్టపోతున్నారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కొట్టేసేందుకు ఓ లెక్కుంది

* గుజరాత్‌కు చెందిన ఉమేశ్‌ ఖతిక్‌ ఇటీవల వరుసగా 5చోట్ల గొలుసు చోరీలకు పాల్పడ్డాడు. తెలంగాణ, రాజస్థాన్‌, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో వందలాది గొలుసు చోరీలు చేశాడు. ఆసిఫ్‌నగర్‌లో దొంగిలించిన స్కూటీనే ఐదుచోట్లవాడాడు.

* రాజస్థాన్‌కు చెందిన కరడుగట్టిన కార్ల దొంగ శైలేంద్రసింగ్‌ సక్సేనా. 10-12 రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నారు. ఖరీదైన కార్లను లక్ష్యంగా చేసుకుని సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని దర్జాగా నడుపుకుంటూ వెళ్లిపోతాడు. రూ.కోటి ఖరీదైన కార్లు తప్ప మిగిలినవాటిని పట్టించుకోడు.

* నగరానికి చెందిన యువకుడు 45 స్పోర్ట్స్‌ బైక్‌లు దొంగిలించాడు. బాల్యం నుంచి వాటిపై మోజు పెంచుకున్న ఇతడు సరదా తీర్చుకునేందుకే చోరీల బాటపట్టాడు. పెట్రోల్‌ ఉన్నంత వరకూ చక్కర్లు కొట్టి వదిలేసి వెళ్లేవాడు.

వాహన దొంగతనాల్లో భిన్నకోణాలున్నాయి. యూపీ, రాజస్థాన్‌, గుజరాత్‌, కర్ణాటక నుంచి నగరానికి చేరే అంతరాష్ట్ర దొంగలు మొదట చేసేది వాహన చోరీలే. గృహ, గొలుసు దొంగతనాలు చేసి ఆ బండ్లను బస్టాండు, రైల్వేస్టేషన్‌, బహిరంగ ప్రదేశాల్లో వదిలేసి వెళ్లిపోతారు. ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న జాబితాలో జల్సాలకు అలవాటుపడిన యువకులు, అంతర్రాష్ట్ర దొంగలు అధికంగా ఉంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన దొంగలు హైదరాబాద్‌ చోరులతో స్నేహం చేసి కొట్టేసిన వాహనాలను తమ రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాల్లో విక్రయించి వాటాలుగా పంచుకుంటున్నారు. అక్కడైతే పోలీసుల తనిఖీలు ఉండవనే భరోసాతో అమ్మేస్తుంటారని గతేడాది లంగర్‌హౌస్‌ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. కళాశాలకు నడచి, బస్సులో వెళ్లటం ఇష్టంలేక బైక్‌లను దొంగిలించానని ఇటీవల నారాయణగూడ పోలీసులకు పట్టుబడిన నిందితుడు సమాధానమిచ్చాడు.


* ఇప్పుడే బండి బయటపెట్టి మద్యం దుకాణంలోకి వెళ్లా. బయటకొచ్చి చూడగానే కనిపించట్లేదు. చుట్టుపక్కల అడిగినా ఎవరూ మేం చూడలేదంటున్నారు. పత్రాలు, చరవాణులు కూడా అందులోనే ఉన్నాయి.


* అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌ ఖాళీ లేకపోవటంతో ఇంటి ముందు బైక్‌ పార్క్‌ చేశా. నెలరోజుల క్రితమే రెండులక్షల రూపాయలు పోసి కొన్నా. మొదటినెల వాయిదా డబ్బులు కూడా కట్టలేదు. ఎలాగైనా మీరే నా బుల్లెట్‌ వెతికిపెట్టాలి.


ఆ రెండు చోట్లలోనే చోరీలెక్కువ
బి.గంగాధర్‌, ఏసీపీ, రాజేంద్రనగర్‌

ఎక్కువ శాతం వాహన దొంగతనాలు మార్కెట్లు, మద్యం దుకాణాల వద్దనే జరుగుతున్నాయి. ద్విచక్రవాహనాలకు పాతకాలం తాళాలు, ఏర్పాట్లు దొంగలకు మరింత అవకాశంగా మారాయి.  ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నాం. వీటి వల్ల దొంగతనాలను అరికట్టడమే కాదు.. దొంగలనూ గుర్తిస్తున్నాం.


సరదా తీర్చుకునేందుకు చేస్తున్నారు
వెంకన్ననాయక్‌, ఏసీపీ, సీసీఎస్‌, మల్కాజిగిరి

బైక్‌లను దొంగిలిస్తున్న వారిలో ఆకతాయిలు ఎక్కువ. సరదా తీరగానే వదిలేసి వెళ్లిపోతున్నారు. చోరీ వాహనాలను కొనుగోలు చేస్తే జైలుకు వెళ్తామనే భయం ఉంది. అందుకే తక్కువ ధరకు ఇస్తామన్నా ఎవరూ ముందుకు రారు. కార్ల అద్దాలు పూర్తిగా మూసివేయాలి. యాంటీ థెప్ట్‌ డివైస్‌, జీపీఎస్‌ నేవిగేషన్‌ వంటి ఆధునిక పద్ధతులు అనుసరించాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ తదితర పత్రాలు వాహనాల్లో ఉంచవద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని