logo

నచ్చేలా చేస్తామంటూ..నిండా ముంచేస్తారు!

ఏ ఒక్క అవకాశాన్నీ సైబర్‌ నేరస్థులు వదలట్లేదు. ప్రతి అంశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. కొత్త ఏడాది 20 రోజుల వ్యవధిలోనే వందల్లో ఫిర్యాదులు వచ్చాయి. గతంలో ఆన్‌లైన్‌ లాటరీలు, బహుమతులు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, విదేశీ వివాహ సంబంధాలు అంటూ ఖాతాలో సొమ్ములు ఖాళీ చేసేవారు.

Published : 26 Jan 2022 03:04 IST

సేవల పేరుతో సైబర్‌ నేరస్థుల మోసాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఏ ఒక్క అవకాశాన్నీ సైబర్‌ నేరస్థులు వదలట్లేదు. ప్రతి అంశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. కొత్త ఏడాది 20 రోజుల వ్యవధిలోనే వందల్లో ఫిర్యాదులు వచ్చాయి. గతంలో ఆన్‌లైన్‌ లాటరీలు, బహుమతులు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, విదేశీ వివాహ సంబంధాలు అంటూ ఖాతాలో సొమ్ములు ఖాళీ చేసేవారు. గతేడాది పెట్టుబడులు, నగ్న చిత్రాల బెదిరింపులతో చెలరేగారు. ప్రస్తుతం మానవ వనరుల సేవలు అందిస్తామంటూ కొత్త పద్ధతిలో బరితెగిస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులే లక్ష్యంగా మాయగాళ్లు నయా ఎత్తులు వేస్తున్నారని, నకిలీ ఏజెన్సీలు, కన్సల్టింగ్‌ సంస్థల ముసుగులో తేలికగా డబ్బు కొట్టేస్తున్నారని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఫిర్యాదుకు ముందుకొచ్చేది కొందరే

నగరానికి చెందిన ఓ వ్యాపారి కుమారుడి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడు. అంతర్జాలంలో ఓ అందమైన వెబ్‌సైట్‌ కనిపించింది. అందులో నంబరుకు ఫోన్‌చేసి వివాహ వేడుకకు అవసరమైన సేవల వివరాలు తెలుసుకున్నాడు. మరుసటిరోజు సదరు వ్యాపారిని వాట్సాప్‌ ఫోన్‌కాల్‌ ద్వారా ఏజెన్సీ నిర్వాహకుడు సంప్రదించాడు. అడ్వాన్స్‌ అంటూ రూ.50,000 వసూలు చేసి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. మరోచోట పెళ్లి కూతురుకు మెహిందీ, వస్త్రాలంకరణతో ముస్తాబు చేస్తామంటూ బురిడీ కొట్టించి రూ.5000 ఆన్‌లైన్‌ ద్వారా జమ చేయించుకున్నారు. వివాహ వేళ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయామని బీహెచ్‌ఈఎల్‌కు చెందిన బాధితుడు ఆవేదన వెలిబుచ్చారు. రాజేంద్రనగర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్‌.. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేస్తానంటూ రూ.15,000 అడ్వాన్స్‌గా తీసుకుని ముఖం చాటేశాడు. బాధితులు ఆరా తీసి, అతడు నగరంలోనే లేడని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా సొమ్ము పోగొట్టుకున్న వారిలో కొందరే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. రూ.1000-3000 వరకు పోగొట్టుకున్నవారు ఫిర్యాదు చేయకపోవడం మాయగాళ్లకు అవకాశంగా మారింది.


ఏం చేస్తారంటే?

హా నగరంలో కుటుంబం నడిపేందుకు ఆలుమగలిద్దరూ కొలువు చేయాల్సిన పరిస్థితి. ఇంటిపనుల నుంచి పచారీ సరకులు తీసుకొచ్చేంత వరకు పనివారిపైనే ఆధారపడుతున్నారు. దీన్ని మోసగాళ్లు అనువుగా మలుచుకుంటున్నారు. అందమైన వెబ్‌సైట్లు, ప్రకటనలతో.. అంతర్జాలంలో సేవల కోసం వెతికేవారిని ఆకట్టుకుంటున్నారు. ఇదంతా నిజమని భావించి ఫోన్‌ చేసిన వారిని తేలికగా బురిడీ కొట్టిస్తున్నారు. గృహానికి అవసరమైన వంట పని, ఇంటిపని, తోటపనులు చేసేవాళ్లను పంపుతామంటూ నమ్మకం కలిగిస్తారు. అడ్వాన్స్‌ అంటూ కొంత మొత్తం తీసుకుంటారు. తరువాత సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు. ఇలాంటి నకిలీ ఏజెన్సీలు సమయం, సందర్భానికి అనుగుణంగా మోసాలకు పాల్పడటం విశేషం. లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌ సేవల వినియోగం పెరిగింది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ ఉద్ధృతితో మళ్లీ సేవల రంగానికి డిమాండ్‌ అధికమైంది. ఇదే అదనుగా నకిలీ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని ఏసీపీ జి.శ్రీధర్‌ తెలిపారు. అన్ని వివరాలు నిర్ధారించుకోకుండా నగదు చెల్లించవద్దని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని