logo

అటు లంగర్‌హౌజ్‌.. ఇటు హయత్‌నగర్‌

హైదరాబాద్‌ రహదారులపై తిరిగే ప్రయాణికులందరికీ పరిచయమైన కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, మెహిదీపట్నం, సికింద్రాబాద్‌ బస్‌ టెర్మినళ్లు మారనున్నాయి. వీటిని అక్కడి నుంచి మార్చేందుకు ట్రాఫిక్‌ పోలీసు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నగరంలో పెరుగుతున్న ప్రజల

Published : 26 Jan 2022 04:27 IST
ట్రాఫిక్‌ రద్దీ తగ్గించేందుకు అధికారుల యోచన
బస్సు టెర్మినళ్ల మార్పు దిశగా అడుగులు
ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ రహదారులపై తిరిగే ప్రయాణికులందరికీ పరిచయమైన కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, మెహిదీపట్నం, సికింద్రాబాద్‌ బస్‌ టెర్మినళ్లు మారనున్నాయి. వీటిని అక్కడి నుంచి మార్చేందుకు ట్రాఫిక్‌ పోలీసు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నగరంలో పెరుగుతున్న ప్రజల రవాణా అవసరాలు, వాహనాల రద్దీ, ఆర్టీసీ బస్సుల రాకపోకలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ తగ్గడంతో రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని ఆర్టీసీ అధికారులకు ప్రతిపాదించారు.

నలభై ఏళ్ల కిందట..

దాదాపు 40ఏళ్ల కిందట ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు, అప్పటి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ అధికారులు బస్‌ టెర్మినళ్లను ఏర్పాటుచేశారు. సికింద్రాబాద్‌ రెతిఫైల్‌, జూబ్లీ బస్‌ స్టేషన్‌, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, మెహిదీపట్నంలను టెర్మినళ్లుగా నిర్ణయించారు. మెహిదీపట్నం తర్వాత సిటీ బస్సులు నడిపినా, వెళ్లేందుకు ప్రయాణికులుండేవారు కాదు. ఇక పాత నగరం, సికింద్రాబాద్‌, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు కోఠిలో దిగి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. నగరంలో ఇతర ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి వచ్చే బస్సులు దిల్‌సుఖ్‌నగర్‌ వద్ద ఆగేవి.


ప్రస్తుతం ఇలా..

* మెహిదీపట్నం నుంచి లంగర్‌హౌజ్‌, టోలిచౌకి, గచ్చిబౌలి మాదాపూర్‌, లింగంపల్లి వరకు ప్రయాణికులు నిత్యం ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. చాలా మంది మెహిదీపట్నంలో బస్సు దిగి మరో బస్సులో గమ్యస్థానాలను చేరుకుంటున్నారు.

* ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, అంబర్‌పేట, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కోఠి దాటి వెళ్లాలంటే, అక్కడ దిగి ఇంకో బస్సులో వెళ్లాలి.

* సికింద్రాబాద్‌, మెహిదీపట్నం, కూకట్‌పల్లి తదితర ప్రాంతాలనుంచి వచ్చేవారు ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ వెళ్లాలంటే దిల్‌సుఖ్‌నగర్‌లో దిగి సెవెన్‌ సీటర్‌ ఆటో లేదా మరో బస్సులో వెళ్తున్నారు. 


మెట్రోరైల్‌ లేని ప్రాంతాల్లో..

మెట్రోరైల్‌ సౌకర్యం లేని ప్రాంతాలు, కొత్తగా ఏర్పాటైన కాలనీలు, విస్తరించిన ప్రాంతాలు, ఏఎస్‌రావునగర్‌, జవహర్‌ నగర్‌, తుర్కయాంజాల్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌ డిపో వెనుక ప్రాంతాలు, మెట్రో రైల్‌కు అనుసంధానంగా ఉండే రోడ్డు మార్గాల్లో బస్సులు నడిపితే ప్రయాణికుల సంఖ్య పెరగనుందని అంచనా వేశారు. టెర్మినళ్ల పొడిగింపు కారణంగా ఆర్టీసీ బస్సుల ట్రిప్పులు తగ్గడంతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందుల కారణంగా ఒకే మార్గంలో ఒకదాని వెంట నాలుగైదు బస్సులు వెళ్లకుండా చేయవచ్చు. కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, మెహిదీపట్నం టెర్మినళ్లలో ప్రస్తుతం వస్తున్న బస్సులు, వాటి రూట్లను పరిశీలించి కొద్దిరోజుల్లో మార్చేందుకు ట్రాఫిక్‌, ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు.


కొత్త ప్రతిపాదనలివీ..

* దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌ టెర్మినల్‌ వనస్థలిపురం లేదా హయత్‌నగర్‌కు, కోఠి బస్‌ టెర్మినల్‌ను మలక్‌పేట లేదా మూసారంబాగ్‌, మెహిదీపట్నం టెర్మినల్‌ను లంగర్‌హౌస్‌ లేదా టోలిచౌకికి మార్చాలని ప్రణాళిక సిద్ధం చేశారు.

* కొత్తగా ఏర్పాటయ్యే టెర్మినళ్లు స్థలం విశాలంగా ఉండటంతో పాటు భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా అదనంగా స్థలం ఉండేలా ప్రభుత్వ స్థలాలు పరిశీలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని