logo

తెరాస జిల్లా అధ్యక్షుడిగా మెతుకు ఆనంద్‌

తెరాస జిల్లా అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు ముమ్మర ప్రయత్నాలు చేసినా.. అధిష్ఠానం వికారాబాద్‌ శాసనసభ్యుడు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ వైపు మొగ్గు చూపింది. బుధవారం

Published : 27 Jan 2022 01:06 IST

ఆనంద్‌ను అభినందిస్తున్న నాయకులు, కార్యకర్తలు

వికారాబాద్‌, న్యూస్‌టుడే: తెరాస జిల్లా అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు ముమ్మర ప్రయత్నాలు చేసినా.. అధిష్ఠానం వికారాబాద్‌ శాసనసభ్యుడు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ వైపు మొగ్గు చూపింది. బుధవారం జిల్లాల అధ్యక్షుల జాబితాలో ఆయన పేరును చూసి అభిమానులు, పలువురు నాయకులు అభినందనలతో ముంచెత్తారు. ఆనంద్‌ సైతం వికారాబాద్‌ ప్రాంతానికి చెందిన మరో నాయకుడి పేరును సిఫార్సు చేసినట్లు సమాచారం. ఇతరులకు అధ్యక్ష పదవి కట్టబెడితే జిల్లా నాయకుల మధ్య విభేదాలకు ఆజ్యం పోసినట్లు అవుతుందనే ఉద్దేశంతో, పార్టీ నాయకత్వం ఆనంద్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. ధారూర్‌ మండలంలోని కేరెళ్లి ఈయన స్వగ్రామం. హైదరాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌, వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఎంఎస్‌ పూర్తి చేశారు. ఆనంద్‌ సతీమణి సబిత కూడా వైద్యురాలే. తెలంగాణ ఉద్యమ సమయంలో జిల్లా వైద్యుల ఐకాస అధ్యక్షుడిగా... 2013-14లో వికారాబాద్‌ నియోజకవర్గ తెరాస ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. 2018 శాసనసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా విజయం సాధించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అధిష్ఠానం దృష్టిలో మంచి పేరు సంపాదించారు. అందరి సహకారంతో జిల్లాలో తెరాసను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేసి అధ్యక్ష పదవికే వన్నె తెస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పనితీరు ఆధారంగా కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం దక్కేలా చూస్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష పదవిని కట్టబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని