logo

కొట్టేసిన బండిపై షికార్లు

ద్విచక్రవాహనాలను దొంగతనం చేస్తున్న ఇద్దరు పాతనేరస్థులను గోపాలపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండుకు

Updated : 27 Jan 2022 05:09 IST

ఇద్దరు పాత నేరస్థుల అరెస్టు.. 10 బైక్‌లు స్వాధీనం

వాహనాల వద్ద అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, పోలీసులు (కింద కూర్చున్న నిందితులు)

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనాలను దొంగతనం చేస్తున్న ఇద్దరు పాతనేరస్థులను గోపాలపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండుకు తరలించారు. సీతాఫల్‌మండీ మేడిబావి ప్రాంతానికి చెందిన జన్నూ సంతోష్‌కుమార్‌(26), తూప్రాన్‌వాసి వల్లెపు రవీందర్‌(35) కూలీ పనుల చేస్తూ ఫుట్‌పాత్‌లపైనే ఉంటున్నారు. గతంలో సంతోష్‌కుమార్‌ 2017లో చిలకలగూడ(1), నల్లకుంట(4కేసులు), 2018లో చిలకలగూడ(2కేసులు), కాచిగూడ(1), 2021లో సుల్తాన్‌బజార్‌, ఉప్పల్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఠాణా పరిధిలో అన్ని కలుపుకుని 11 చోరీల కేసుల్లో అరెస్ట్‌ అయ్యాడు. రవీందర్‌ 2013లో ఉప్పల్‌(2), 2011లో మేడ్చల్‌లో ఒక చోరీ కేసులో జైలుకెళ్లి వచ్చాడు. ఫుట్‌పాత్‌పైన ఏర్పడిన పరిచయం అనంతరం వీరు చోరీలకు పాల్పడుతున్నారు.

పట్టుబడిందిలా.. అంబర్‌పేటవాసి గద్వాల సుధాకర్‌ సికింద్రాబాద్‌ స్వాతి హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఈనెల 23న హోటల్‌ వద్ద పార్క్‌ చేసిన ద్విచక్రవాహనం కనిపించకపోవడంతో అదేరోజు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో నిందితులిద్దరూ దొంగిలించిన వాహనంపైనే మనోహర్‌ థియేటర్‌ ప్రాంతానికి వచ్చి అక్కడే చిన్న విషయంలో గొడవ పడుతున్నారు. సమాచారం తెలిసి కానిస్టేబుల్‌ రవి అక్కడికెళ్లి వారిని ప్రశ్నించడంతోపాటు వాహనానికి నంబరు సరిగా లేకపోవడంతో పెట్టీ కేసు నమోదు చేసేందుకు పత్రాలు చూపించమన్నారు. ఆన్‌లైన్‌లో వివరాలను పరిశీలించగా ఆ వాహనం చోరీకి గురైనట్లుగా గుర్తించారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తీసుకెళ్లారు. క్రైం టీం కానిస్టేబుళ్లు శివశంకర్‌, ప్రదీప్‌రెడ్డి, ఇస్మాయిల్‌, రవికుమార్‌లు నిందితులను ప్రశ్నించగా పాత నేరస్థులుగా గుర్తించారు. కొద్దిరోజులుగా గోపాలపురం(2), గాంధీనగర్‌(3), కుషాయిగూడ(1), మేడ్చల్‌(1), బీబీనగర్‌(1) కూకట్‌పల్లి హౌజింగ్‌బోర్డు(1) మైలర్‌దేవులపల్లి(1) ఠాణాల పరిధిలో 10 ద్విచక్రవాహనాలను చోరీలు చేసినట్లు అంగీకరించారు. వాహనాల నంబర్లు తీసేసి తిరుగుతూ.. కొన్నింటిని విక్రయించినట్లు అంగీకరించారు. వారి నుంచి 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని