logo

అక్కను చంపించేందుకు చెల్లెలు కుట్ర

ఆస్తి పంపకం వివాదం నేపథ్యంలో సొంత అక్కను చెల్లెలు చంపించేందుకు కిరాయి హంతకులతో దాడి చేయించింది. ఈ సంఘటన గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ తెలిపిన వివరాల మేరకు..

Published : 28 Jan 2022 02:37 IST

ఆస్తి వివాదం నేపథ్యంలో కిరాయి హంతకులతో దాడి
పోలీసుల అదుపులో అయిదుగురు నిందితులు


మాట్లాడుతున్న ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌. వెనుక నిందితులతో పోలీసులు

షాబాద్‌, న్యూస్‌టుడే: ఆస్తి పంపకం వివాదం నేపథ్యంలో సొంత అక్కను చెల్లెలు చంపించేందుకు కిరాయి హంతకులతో దాడి చేయించింది. ఈ సంఘటన గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ తెలిపిన వివరాల మేరకు...హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన తాటికొండ పుష్పమణి, విజయవాడకు చెందిన సింధూర అక్కా చెల్లెళ్లు. వారికి విజయవాడలో ఉన్న 20 గుంటల భూమి విషయంలో వివాదం నెలకొంది. దీంతో అక్క పుష్పమణిని చంపించేందుకు చెల్లెలు సింధూర, ఆమె భర్త శ్రీనాథ్‌ పఠాన్‌చెరుకు చెందిన కిరాయి హంతకుడు బండి శ్రీకాంత్‌గౌడ్‌(25)తో ఒప్పందం కుదుర్చుకుని రెండు లక్షలు సుపారీగా ఇచ్చారు. శ్రీకాంత్‌గౌడ్‌ రోజు కూలీలుగా పనిచేసే భానుకిరణ్‌, సాయికిరణ్‌, వినోద్‌కుమార్‌, బ్రహ్మచారి, సాయికుమార్‌లను హత్య చేసేందుకు మాట్లాడుకున్నాడు. ఈ నెల 24న పుష్పమణి, తన స్నేహితుడు రాజ్‌కుమార్‌తో కలిసి వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం కంకల్‌ సమీపంలో ఉన్న ఫాంహౌస్‌కు కారులో వెళ్తున్నట్లు తెలుసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వారు నగరానికి తిరిగి వెళ్లే మార్గంలో షాబాద్‌ మండలం రేగడిదోస్వాడ సమీపంలో కారును అటకాయించి, శ్రీకాంత్‌గౌడ్‌ తన మనుషులతో కలిసి వారిపై దాడికి దిగారు. ఎంతకీ వారు కారు తలుపులు తీయకపోవడంతో బీరు సీసాలు, కర్రతో అద్దాలు పగలగొట్టేందుకు ప్రయత్నించగా వారు తప్పించుకుని షాబాద్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. దాడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు జరిపి అయిదుగురు నిందితులను పట్టుకుని గురువారం రిమాండ్‌కు తరలించారు.సింధూర, ఆమె భర్త పరారీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని