logo

అందరి భూమిపై ఒక్కడి కన్ను

సికింద్రాబాద్‌లోని సేవా మండల్‌ సొసైటీ, శాంతినికేతన్‌ కాలనీలో రూ.100 కోట్ల విలువైన కాలనీ పార్కు భూములు కబ్జా అయ్యాయి. ఏకంగా నాలుగు ఉద్యాన స్థలాలను స్వాహా చేశారు. అదేంటని ప్రశ్నించిన స్థానికులపై ఆక్రమణదారు బెదిరింపులకు పాల్పడుతుండటం ఆందోళనకు తావిస్తోంది.

Published : 28 Jan 2022 02:37 IST

రూ.100 కోట్ల పార్కు స్థలాల కబ్జా
ఈనాడు, హైదరాబాద్‌

సికింద్రాబాద్‌లోని సేవా మండల్‌ సొసైటీ, శాంతినికేతన్‌ కాలనీలో రూ.100 కోట్ల విలువైన కాలనీ పార్కు భూములు కబ్జా అయ్యాయి. ఏకంగా నాలుగు ఉద్యాన స్థలాలను స్వాహా చేశారు. అదేంటని ప్రశ్నించిన స్థానికులపై ఆక్రమణదారు బెదిరింపులకు పాల్పడుతుండటం ఆందోళనకు తావిస్తోంది. రెవెన్యూ, పోలీసు అధికారులు, జీహెచ్‌ఎంసీ స్పందించట్లేదని వారు వాపోతున్నారు.

సికింద్రాబాద్‌ మహేంద్రహిల్స్‌, అడ్డగుట్ట ప్రాంతాలను ఆనుకుని 36 ఎకరాల సేవా మండల్‌ సొసైటీ భూమిలో శాంతినికేతన్‌ కాలనీ విస్తరించింది. అప్పట్లో 3.6 ఎకరాల స్థలాన్ని నాలుగు ప్రాంతాల్లో పార్కులకు కేటాయించారు. రెండు స్థలాలు కనుమరుగయ్యాయి. మూడోది కోర్టు కేసులో ఉంది. ఆ స్థలాన్నీ నిర్మాణదారు అడ్డదారిలో విక్రయించినట్లు దస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. ‘‘చివరకు ఎకరా విస్తీర్ణంలోని నాలుగో పార్కు స్థలం ఒక్కటే మిగిలింది. నిర్మాణదారు ఆ స్థలాన్నీ సొంతంగా వాడుకుంటున్నారు’’ అని కాలనీ సభ్యులు ‘ఈనాడు’ వద్ద వాపోయారు. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌, బేగంపేట సర్కిల్‌ ఉపకమిషనర్లను కలిసి ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయిందన్నారు. జీహెచ్‌ఎంసీకి లేఖ ద్వారా తెలిపినా బల్దియా అధికారులు పట్టించుకోవడంలేదని గుర్తు చేశారు.

భద్రతనూ పట్టించుకోని యంత్రాంగం
న్యాయస్థానంలో నలుగుతోన్న స్థలం ఆకతాయిలకు అడ్డాగా మారింది. పక్కనే పోలీస్‌స్టేషన్‌ ఉంది. ఇటీవల పోలీసులు విచారణకు తీసుకొచ్చిన హత్య కేసులోని ముద్దాయి, వారి నుంచి తప్పించుకుని శాంతినికేతన్‌ కాలనీలోని ఓ ఇంట్లోకి దూకి భయభ్రాంతులకు గురిచేశాడు. వివాదాస్పద స్థలానికి కంచె వేస్తే.. ఆకతాయిలుగానీ, పోలీసుస్టేషన్‌ నుంచి తప్పించుకునే ముద్దాయిలుగానీ కాలనీలోకి ప్రవేశించలేరు. అదే విషయమై.. కాలనీవాసులు పోలీసులను, రెవెన్యూ అధికారులను అనుమతి కోరితే.. సహకరించట్లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని