logo

భయమొద్దు..బతుకనిద్దాం!

కరోనాపై చాలావరకు అవగాహన వచ్చిన తరుణంలోనూ గర్భిణులను ఆసుపత్రిలో చేర్చుకోకుండా వెనక్కి పంపడం సరైంది కాదని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో కరోనా ఉందని నిండు గర్భిణిని ఆసుపత్రిలోకి చేర్చుకోకుండా నిరాకరించిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Published : 28 Jan 2022 04:02 IST

 క్లిష్ట పరిస్థితుల్లోనూ నిలోఫర్‌, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్సలు

ఇప్పటికే గాంధీలో వేల సంఖ్యలో కాన్పులు  
ఈనాడు, హైదరాబాద్‌

కరోనాపై చాలావరకు అవగాహన వచ్చిన తరుణంలోనూ గర్భిణులను ఆసుపత్రిలో చేర్చుకోకుండా వెనక్కి పంపడం సరైంది కాదని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో కరోనా ఉందని నిండు గర్భిణిని ఆసుపత్రిలోకి చేర్చుకోకుండా నిరాకరించిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ సీరియస్‌ అయింది. గర్భిణులు, చిన్నారులకు వైద్యం అందించడంలో నిలోఫర్‌, గాంధీ ఆసుపత్రులు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. తొలి, రెండో విడతల్లో కరోనా బారిన పడిన వేలాది మంది గర్భిణులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్సలు అందించారు. దాదాపు ఆరేడు వేల మందికి పురుడు పోశారు. గాంధీలో ఇటీవల కూడా 20-25 మందికి పురుడు పోసి తల్లీబిడ్డలను క్షేమంగా ఇళ్లకు పంపారు. నిలోఫర్‌లోనూ 15 మంది చిన్నారులు కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురికి ఇతర అనారోగ్య సమస్యలున్నాయని, అయినా అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

గర్భిణులకు ఈ జాగ్రత్తలు అవసరం
* గర్భిణులకు మొదటి నెల నుంచే ప్రత్యేక గది కేటాయించాలి. ఆహారం నుంచి వస్త్రాల వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
* అవకాశం ఉంటే ప్రత్యేక బాత్‌రూం కేటాయించాలి. వీలు కాకపోతే ఇతరులు ఉపయోగించిన తర్వాత శుభ్రం చేయాలి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు పంపక పోవడమే నయం. సీమంతం లాంటివి కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకోవడం ఉత్తమం.
* నెల వారీ పరీక్షలను వైద్యుల సూచనల మేరకు తగ్గించుకోవాలి. వీడియోకాల్‌ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఇతర కుటుంబ సభ్యులంతా టీకాలు తీసుకోవాలి.
* 8, 9 నెలలు దాటిన తర్వాత అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్‌ సోకిన గర్భిణులను ఏ ఆసుపత్రుల్లో చేర్చుకుంటున్నారు.. ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి.. ముందే తెలుసుకోవాలి. స్థానిక వైద్యశాల ఏఎన్‌ఎం, వైద్యులు ఫోన్‌ నంబర్లు సేకరించి పెట్టుకోవాలి.
* నిలోఫర్‌, గాంధీలో 24 గంటలపాటు అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. కరోనా సోకిన వారికి సైతం ఇక్కడ ఉచితంగా చికిత్సలు అందిస్తారు. ఎంత క్లిష్టంగా ఉన్నా చేర్చుకుంటారు. గాంధీలో ఐసీయూ, ఆక్సిజన్‌ సదుపాయంతో ప్రత్యేక పడకలు అందుబాటులోకి తీసుకొచ్చారు.

అప్రమత్తంగా ఉండాలి: - డాక్టర్‌ ఉషారాణి, చిన్న పిల్లల వైద్యులు, నిలోఫర్‌ ఆసుపత్రి
కరోనా పిల్లలపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అనుబంధ అనారోగ్య సమస్యలు ఉన్న పిల్లల్లో కరోనా ముప్పు ఎక్కువ. ప్రస్తుతం అలాంటి వారు నిలోఫర్‌లో 15 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌లో ఎక్కువ తీవ్రతతో కూడిన జ్వరం, వాంతులు, కడుపు నొప్పి, వీరేచనాలు అవుతున్నాయి. పిల్లలు నీరసించి పోతున్నారు. వెంటనే పరీక్షలు చేసి చికిత్స అందించాలి. ఒకట్రెండు రోజుల్లో జ్వరం తగ్గిపోతోంది. ఈ సమయంలో ఎక్కువ ద్రవ పదార్థాలు అందించాలి. కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్‌ లాంటివి తాగించడం వల్ల శరీరంలో పోటాషియం, సోడియం పోకుండా చూసుకోవచ్చు. గర్భిణుల్లో కరోనా లక్షణాలు కన్పిస్తే, నిలోఫర్‌ లేదా గాంధీలో చేర్పించవచ్చు. ఇప్పటికే ఇలాంటి వారికి చికిత్సలు అందించిన అనుభవం ఇక్కడి వైద్యులకు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని