logo

కూపీ లాగేందుకు కోల్‌కతాకు..!

హైదరాబాద్‌ ఏపీ మహేశ్‌ కోఅపరేటివ్‌ బ్యాంక్‌ సర్వర్లలోకి చొరబడిన హ్యాకర్లు రూ.కోట్లు కొట్టేశారు. పక్కా పథకం ప్రకారమే 2-3 నెలల ముందుగానే నేరుగా బ్యాంకు సర్వర్లలోకి ప్రవేశించారు.

Published : 29 Jan 2022 03:06 IST

మహేశ్‌ బ్యాంకు హ్యాకింగ్‌ కేసు..

ఈశాన్య రాష్ట్రాల్లో దర్యాప్తునకు పోలీసు బృందాలు

ఈనాడు, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఏపీ మహేశ్‌ కోఅపరేటివ్‌ బ్యాంక్‌ సర్వర్లలోకి చొరబడిన హ్యాకర్లు రూ.కోట్లు కొట్టేశారు. పక్కా పథకం ప్రకారమే 2-3 నెలల ముందుగానే నేరుగా బ్యాంకు సర్వర్లలోకి ప్రవేశించారు. అక్కడ బ్యాంకు ఖాతాదారుల డేటా తారుమారు చేశారు. బ్యాంకు అధికారులు, ఖాతాదారుల మొబైల్‌ఫోన్‌ నంబర్ల స్థానంలో తమ ఫోన్‌నెంబర్లు ఉంచారు. బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలు నిర్వహించేటపుడు వచ్చే ఓటీపీ/సందేశాలను తమ ఫోన్‌నంబర్లకు చేరేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అధికశాతం బ్యాంకులు తమ ఖాతాదారులు, లావాదేవీల వివరాలకు సొంత సర్వర్లు ఏర్పాటు చేసుకుంటాయి. ఏపీ మహేశ్‌ కోఅపరేటివ్‌ బ్యాంకు సొంతగానే సర్వర్లను నిర్వహిస్తుంది. బ్యాంకు సైబర్‌ భద్రతలో ఉన్న లోపాలను అవకాశంగా చేసుకుని హ్యాకర్లు దర్జాగా సర్వర్లలోకి ప్రవేశించి రూ.12.90 కోట్లు 128 మంది ఖాతాల్లోకి మళ్లించినట్టు అంచనా వేశారు. తాజాగా శుక్రవారం మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసిన 3 ఖాతాలను గుర్తించారు. వీరిలో వినోద్‌, నవీన్‌ అనే వ్యక్తులను ప్రశ్నించారు. హ్యాకర్లతో వీరికి సంబంధం లేదని నిర్ధారణకు వచ్చారు. వీరి ఖాతాల్లోకి డిపాజిట్‌ చేసిన రూ.5కోట్లను అనంతరం సైబర్‌ నేరగాళ్లు ఇతరుల ఖాతాల్లోకి మళ్లించారు.

ముంబయిలోనే షహనాజ్‌

ఈ కేసులో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు షహనాజ్‌. ఈమె ఖాతాలోకి రూ.6.9కోట్లు జమచేశారు. కొద్ది సమయానికే ఇతరుల ఖాతాల్లోకి మళ్లించారు. ఆమె ఫోన్‌ను హ్యాకర్లు మార్చకపోవడంతో నగదు లావాదేవీలు జరిపేటపుడు సందేశాలు ఆమె మొబైల్‌ఫోన్‌కు చేరాయి. వాటి ఆధారంగానే పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించారు. ఆమె మొబైల్‌కు ఫోన్‌ చేసిన పోలీసులు వివరాలు తెలుసుకుంటుంగానే స్విచ్ఛాఫ్‌ అయింది. సెల్‌టవర్‌ లోకేషన్‌ ఆధారంగా ముంబయిలో ఉన్నట్లు ఆమె చెబుతున్న మాటలు నిజమని పోలీసులు భావిస్తున్నారు. కోల్‌కతా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతీ, యువకుల 200 బ్యాంకు ఖాతాలకు రూ.12.90కోట్లు మళ్లించారని అంచనాకు వచ్చారు. సీసీఎస్‌, సైబర్‌క్రైమ్‌కు చెందిన పోలీసు బృందాలను ఈశాన్యరాష్ట్రాలకు పంపనున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు సిబ్బంది, సాఫ్ట్‌వేర్‌ అందజేసిన సంస్థలో నిపుణుల హస్తముందా అనే కోణంలోనూ కూపీలాగుతున్నట్లు సమాచారం. ఓ వైపు.. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నా, పోలీసులూ మహమ్మారి బారిన పడుతున్నా ఈ కేసు దర్యాప్తులో ముందుకే అంటున్నారు. 6 ప్రత్యేక పోలీసు బృందాలు రాజస్థాన్‌, కోల్‌కతా, ఈశాన్య రాష్ట్రాల్లోని ఆయా రాష్ట్రాలకు వెళ్లి ఖాతాలను పరిశీలించనున్నట్లు సీనియర్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని