logo

ముస్తాబవుతోన్నసంక్షేమ గ్రామం

పటాన్‌చెరు సమీపంలోని కొల్లూరులో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయం ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా, పేదల కోసం ప్రపంచంలో నిర్మించిన భారీ గృహ సముదాయాల్లో ఒకటిగా నిలవనుందని జీహెచ్‌ఎంసీ చెబుతోంది.

Published : 29 Jan 2022 03:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: పటాన్‌చెరు సమీపంలోని కొల్లూరులో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయం ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా, పేదల కోసం ప్రపంచంలో నిర్మించిన భారీ గృహ సముదాయాల్లో ఒకటిగా నిలవనుందని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. ఏడాదిన్నర క్రితం నిర్మాణాలు పూర్తికాగా ప్రస్తుతం తుది మెరుగుల్లో ఉంది. ఫిబ్రవరి తొలివారంలో లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో నగర పర్యటనకు రానున్న ప్రధాని మోదీకి ఈ ఇళ్ల సముదాయాన్ని చూపాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

పర్యావరణహితంగా..

ఇక్కడ 144 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 9, 10, 11 అంతస్తుల్లో 117 టవర్లుగా 15,660 ఇళ్లు నిర్మాణమయ్యాయి. ప్రాజెక్టు వ్యయం రూ.1422.15 కోట్లు. ప్రతి టవర్‌లో మూడు మెట్ల మార్గాలుంటాయి. 234 లిఫ్టులు, 133 జనరేటర్లు, విశాలమైన రోడ్లకు ఇరువైపులా 539 ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేశారు. పదుల కొద్దీ పార్కులు, బహిరంగ వ్యాయామశాలలు, పాఠశాలలు, కళాశాలలు, పోలీస్‌స్టేషన్‌, పోస్టాఫీసు, అగ్నిమాపక, విద్యుత్తు, జలమండలి కార్యాలయాలు, ప్రయాణ ప్రాంగణం, బ్యాంకు, షాపింగ్‌ కాంప్లెక్సులూ ఏర్పాటు కానున్నాయి. ఇంకుడు గుంతల నిర్మాణం, భూగర్భ విద్యుత్తులైన్లు, మురుగులైన్లు, మురుగుశుద్ధి కేంద్రాలు, చెత్తను ఎరువుగా మార్చే కేంద్రాలు, ఇతరత్రా సౌకర్యాలనూ కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని