logo

దగా పన్నుతూ!

ఆస్తిపన్ను నిర్ధారణలో చోటుచేసుకుంటున్న అవకతవకలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరితో.. కింది స్థాయిలోని కొందరు సిబ్బంది యథేచ్ఛగా చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

Published : 29 Jan 2022 03:32 IST

2 వేల ఇళ్లకు ఆస్తిపన్ను సున్నా

పాతుకుపోయిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది అక్రమాలు

ఈనాడు, హైదరాబాద్‌

ఆస్తిపన్ను నిర్ధారణలో చోటుచేసుకుంటున్న అవకతవకలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరితో.. కింది స్థాయిలోని కొందరు సిబ్బంది యథేచ్ఛగా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఖజానాకు చేరాల్సిన ఆదాయాన్ని.. సొంత జేబుల్లోకి మళ్లించుకుంటున్నారు. అంతేకాదు.. రూ.1 నుంచి రూ.100 లోపు పన్ను చెల్లిస్తున్న నిర్మాణాలు, పన్ను వేయని భవనాలు నగరంలో వేలాదిగా ఉన్నాయి. పదేళ్లకు పైగా ఆస్తిపన్ను నిర్ధారించే బిల్‌కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరగకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

సున్నా పన్ను ఏంటంటే..

నగరంలో రేకుల షెడ్డు లేదా పిట్టగూడు లాంటి పాన్‌ డబ్బాకైనా కనీసం రూ.1000 ఆస్తిపన్ను ఉంటుంది. కానీ 2 వేల భవనాలకు పన్ను సున్నాగా ఉంది. చార్మినార్‌ జోన్‌లో ఇలాంటి భవనాలు అధికంగా ఉన్నాయి. ఏళ్లుగా వాటిపై పునఃపరిశీలన గానీ, చర్చ గానీ తనిఖీలు కానీ చేయడంలేదు.

ఇంటికి ఇంతని వసూలు... జీహెచ్‌ఎంసీ ప్రధాన రోడ్లపై ఉండే దుకాణాలూ, అపార్ట్‌మెంట్లలోని పై అంతస్తులు, ఖాళీ స్థలాల్లో అనుమతి లేకుండా వెలిసిన నిర్మాణాలు, షెడ్లు, గోదాములు, ఇతరత్రా నిర్మాణాలు పన్ను పరిధిలో ఉండడంలేదు. ఇటీవల ప్రభుత్వం వాణిజ్య రహదారులుగా గుర్తించిన రోడ్లపైన కూడా.. 30 వేలల్లో 10 శాతం ఇళ్లు రికార్డుల్లోకి ఎక్కనివే. మరో 20 శాతం ఇళ్లు వాస్తవ విస్తీర్ణంకన్నా తక్కువ పన్ను కడుతున్నట్లు తేలింది. ఇలాంటి అవకతవకలను ప్రశ్నించకుండా ఉండేందుకు..జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను విభాగం సిబ్బంది యజమానుల నుంచి ఏడాదికి రూ.లక్ష వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

పదేళ్లుగా పాతుకుపోయి..

నగరం మొత్తాన్ని పన్ను విభాగం 340 డాకెట్లుగా విభజించింది. ఒక్కో డాకెట్‌కు ఒక బిల్‌కలెక్టర్‌, రెండు డాకెట్లకు ఒక ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అవసరం. ప్రస్తుతం 120 మంది బిల్‌కలెక్టర్లే ఉన్నారు. మిగిలిన డాకెట్లలో ఇతర విభాగాల్లోని నాలుగో తరగతి సిబ్బందిని బిల్‌కలెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. మలక్‌పేట సర్కిల్‌, చార్మినార్‌, ఖైరతాబాద్‌ తదితర జోన్లలో 50 శాతానికన్నా తక్కువ మంది బిల్‌కలెక్టర్లున్నారు. కీలక శేరిలింగంపల్లి జోన్లో ప్రాంతానికి ఇద్దరు చొప్పున బిల్‌కలెక్టర్లు ఉన్నారు. యజమానులతో పరిచయాలు పెరగడంతో మామూళ్ల వసూళ్లు తేలికైంది.

జీహెచ్‌ఎంసీలో మొత్తం భవనాలు 20 లక్షలు

రికార్డుల్లో నమోదైనవి కేవలం 17 లక్షలే

అన్నీ రికార్డుల్లోకి ఎక్కితే వచ్చే అదనపు రాబడి రూ.300 కోట్లు

పన్ను విభాగం డాకెట్లు 340

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని