logo

మూసీ మింగిందా? సగమే మిగిలిందా?

ప్రస్తుతం మనం చూస్తున్న మూసీ నది వెడల్పు అసలులో సగం మాత్రమే. మిగతాది ఆక్రమణల్లో చిక్కుకొని అన్యుల పాలైంది. ఇది పైపైన చెబుతున్న లెక్క కాదు. నది సుందరీకరణలో భాగంగా మూసీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే చేసి ఇచ్చిన నివేదిక సారాంశం. ఈ నివేదిక ఇంతవరకు బయటకు రాకపోయినా, ఓ ప్రతిని ‘ఈనాడు’ సేకరించింది. మరో ఏడాది అలాగే వదిలేస్తే మహానగరంలో మూసీ నది కనుమరుగైపోయి ఉండేది. ఆక్రమణలను తొలగిస్తేనే సుందరీకరణ చేపట్టొచ్చని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. నివేదికను పరిశీలించిన ఉన్నతాధికారులు దాదాపు 400 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు తెలుసుకొని ముక్కున వేలేసుకున్నారు.

Published : 29 Jan 2022 03:32 IST

మొత్తం ఆక్రమణలు 8475

నదీ గర్భంలో భారీ నిర్మాణాలు

‘ఈనాడు’ చేతిలో రెవెన్యూ సర్వే నివేదిక

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి


ఎంజీబీఎస్‌ వద్ద మట్టితో చదును చేసి నిలిపిన ప్రైవేటు బస్సులు

ప్రస్తుతం మనం చూస్తున్న మూసీ నది వెడల్పు అసలులో సగం మాత్రమే. మిగతాది ఆక్రమణల్లో చిక్కుకొని అన్యుల పాలైంది. ఇది పైపైన చెబుతున్న లెక్క కాదు. నది సుందరీకరణలో భాగంగా మూసీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే చేసి ఇచ్చిన నివేదిక సారాంశం. ఈ నివేదిక ఇంతవరకు బయటకు రాకపోయినా, ఓ ప్రతిని ‘ఈనాడు’ సేకరించింది. మరో ఏడాది అలాగే వదిలేస్తే మహానగరంలో మూసీ నది కనుమరుగైపోయి ఉండేది. ఆక్రమణలను తొలగిస్తేనే సుందరీకరణ చేపట్టొచ్చని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. నివేదికను పరిశీలించిన ఉన్నతాధికారులు దాదాపు 400 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు తెలుసుకొని ముక్కున వేలేసుకున్నారు. ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడం ప్రారంభించారు. రెండో దశలో తొలగించడం మొదలుపెడతారు. ప్రైవేటు స్థలంలో ఉన్న భవనాలకు నష్టపరిహారం ఎంత ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదు.


మూసారాంబాగ్‌లో మూసీ వంతెనకు ఆనుకొని వెలసిన అక్రమ నిర్మాణాలు

మరీ ఇంత దారుణమా!

* ఉమ్మడి రాష్ట్రంలో ఏళ్లుగా మూసీ నది అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. ఫలితంగా ఆక్రమణదారుల కన్నేశారు. ఏడాదిగా రెవెన్యూ అధికారులు నదిపై సర్వే చేపట్టి మొత్తం 8475 ఆక్రమణలను గుర్తించారు. వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు. నదీ గర్భం, బఫర్‌ జోన్‌లో ఉన్నవిగా విభజించారు. నదీ గర్భంలో 1585 చోట్ల ఆక్రమణలను గుర్తించగా అందులో 268 చోట్ల భారీ నిర్మాణాలున్నాయని తేల్చారు. కొన్ని చోట్ల అపార్టుమెంట్ల తరహాలో నిర్మించి విక్రయించినట్లు గుర్తించారు. నదీ సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్లు వరకు ఉన్న బఫర్‌ జోన్‌లో 6890 ఆక్రమణలను గుర్తించారు. ఇందులో 1032 భారీ నిర్మాణాలున్నట్లు లెక్క తేల్చారు.

* ఆక్రమణలు అధికంగా బహుదూర్‌పురా మండలంలో ఉన్నాయి. ఇక్కడ నదీ గర్భంలోనూ, బఫర్‌ జోన్‌ పరిధిలో 87 తాత్కాలిక నిర్మాణాలు, 1108 శాశ్వత నిర్మాణాలున్నాయి.

* అంబర్‌పేట మండలంలో 1148 ఆక్రమణలు, నిర్మాణాలు ఉండగా, తాత్కాలిక నిర్మాణాలు 144 చోట్ల, శాశ్వత భవనాలు 1004 చోట్ల ఉన్నాయి.

* ఉప్పల్‌ మండలంలో 1001, నాంపల్లిలో 820, గోల్కొండలో 788, ఆసిఫ్‌నగర్‌లో 628 చోట్ల ఆక్రమణలు, నిర్మాణాలున్నాయి.


తీర్చిదిద్దనున్నారిలా...

రాజధాని పరిధిలో మూసీ నది 52 కి.మీ. మేర విస్తరించింది. తొలి దశలో బాపూఘాట్‌ నుంచి నాగోలు వరకు 14 కి.మీ. మేర సుందరీకరించాలని నిర్ణయించారు. రెండు వైపులా నాలుగు లైన్ల రోడ్లతోపాటు పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రూ.3500 కోట్లను వెచ్చించాలని సర్కారు నిర్ణయించింది. త్వరలో సంబంధిత అధికారులతో సీఎం సమావేశం కానున్నారని సమాచారం. దీని తర్వాత అభివృద్ధి పనులపై కార్యాచరణను రూపొందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని