logo

పాతకథే.. పింఛను వ్యధే!

చిత్రంలో సదరం ధ్రువపత్రాలు ప్రదర్శిస్తున్నవారంతా వృద్ధులు, దివ్యాంగులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరంతా సామాజిక భద్రతా పింఛన్లకు అర్హులు.

Published : 29 Jan 2022 03:32 IST

రెండేళ్లుగా మంజూరుకాని కొత్త పింఛన్లు

ఎప్పుడొస్తాయో తెలియక వృద్ధులు, దివ్యాంగుల నిరీక్షణ

చిత్రంలో సదరం ధ్రువపత్రాలు ప్రదర్శిస్తున్నవారంతా వృద్ధులు, దివ్యాంగులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరంతా సామాజిక భద్రతా పింఛన్లకు అర్హులు. వైకల్యానికి సంబంధించి సదరం ధ్రువపత్రాలు, ఆధార్‌ సహా వివరాలన్నీ స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సమర్పించి రెండేళ్లు దాటినా ఆమోదం లభించలేదు. వీరిలో కొందరు మానసిక వైకల్యంలో బాధపడేవారున్నారు. అంగవైకల్యం, వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతూ కుటుంబసభ్యులెవరో తెలియని వీరిని నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ అనాథాశ్రమం చేరదీసింది. ఈ ఒక్క ఆశ్రమంలోనే పింఛన్ల కోసం 42 మంది ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తే వీరికి ఎంతో కొంత ఉపయోగపడతాయని ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. ఇతరులతో కాకుండా వీరిని ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈనాడు డిజిటల్‌- హైదరాబాద్‌:

‘ఆసరా’ కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగులుతోంది. వైకల్యం, వృద్ధాప్యం, ఒంటరి మహిళలకు సామాజిక భద్రత కరవవుతోంది. ‘ఆసరా’ పథకంలో భాగంగా కొత్త పింఛన్లు మంజూరు చేయడంలో జరుగుతున్న జాప్యం వేలాది మందికి శాపంగా మారుతోంది. పింఛన్లు పొందేందుకు అన్ని అర్హతలున్నా.. ప్రభుత్వం లబ్ధిదారుల్ని ఎంపిక చేయట్లేదు. దరఖాస్తు చేసుకుని నెలలు, ఏళ్లు గడుస్తున్నా ఆమోదం లభించకపోవడంతో అర్హులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువగా వృద్ధులే ఉంటున్నారు. మందు బిళ్లలు, వైద్యం ఇతరత్రా ఖర్చులకు ఉపయోగపడతాయని ఆశపడుతున్న వారికి నిరాశే మిగులుతోంది. నిధుల కొరత కారణంగానే కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు.

పెండింగ్‌లో 25 వేల దరఖాస్తులు..

పింఛన్లు ఎప్పుడు మంజూరవుతాయో తెలియక వృద్ధులు, వితంతువులు స్థానిక రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నెలలుగా విసిగిపోతున్న కొందరు కలెక్టరేట్‌కు వెళ్లి.. అధికారులకు విజ్ఞప్తులు అందిస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే దాదాపు 10వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో రోజూ సగటున 50 వరకూ మంది దరఖాస్తు చేసుకుంటున్నట్లు అంచనా. రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల్లో కలిపితే మొత్తం దరఖాస్తుల సంఖ్య 25 వేలకుపైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.


ఇలా నిరీక్షిస్తున్నవారెందరో..!

ఈయన పేరు ఎల్లయ్య. పాలమూరు బస్తీలో నివాసం ఉంటున్నారు. ఇంటింటా చెత్త సేకరిస్తూ ఉపాధి పొందుతున్న ఆయన వయసు 62 ఏళ్లకుపైనే. వృద్ధాప్యం పింఛను కోసం ఏడాదిక్రితం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ మంజూరుకాలేదు. పింఛను వస్తే తనకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన చెబుతున్నారు.

● హిమాయత్‌నగర్‌కు ఫణిపవన్‌కుమార్‌.. బధిరుడు. పింఛను కోసం ఏడాదిన్నర కిందట దరఖాస్తు చేసుకున్నా లాభం లేకుండా పోయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేక అన్నపై ఆధారపడి జీవిస్తున్నారు. గతేడాది ఫణికుమార్‌ తండ్రి కరోనా బారినపడి మరణించారు. తన కొడుక్కి పింఛను వస్తే ఇంటి ఖర్చులకు ఉపయోగపడతాయని ఫణికుమార్‌ తల్లి వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని