logo

సంక్షామ కార్పోరేషన్లు!

తరతరాలుగా దారిద్య్రంతో పోరాడుతున్న నిరుపేదలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు ఇచ్చే రాయితీ రుణాలు (సబ్సిడీ లోన్లు) గొప్ప అవకాశం. వీటిని ఉపయోగించుకుని కొన్ని వేల కుటుంబాలు పేదరికాన్ని తరిమికొట్టగా..

Published : 29 Jan 2022 03:32 IST

రాయితీ రుణాల మంజూరులో నిర్లక్ష్యం

బీసీలకు నాలుగేళ్లు.. ఎస్టీలు రెండేళ్లుగా నిరీక్షణ

ఎస్సీలకు మూడేళ్లలో ఒక్కసారే..

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

తరతరాలుగా దారిద్య్రంతో పోరాడుతున్న నిరుపేదలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు ఇచ్చే రాయితీ రుణాలు (సబ్సిడీ లోన్లు) గొప్ప అవకాశం. వీటిని ఉపయోగించుకుని కొన్ని వేల కుటుంబాలు పేదరికాన్ని తరిమికొట్టగా.. కొందరు ఆర్థికంగా మంచి స్థితికి చేరుకున్న నిదర్శనాలెన్నో ఉన్నాయి. వీటి అమలు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో మరీ దారుణంగా ఉంది. జనాభాకు తగ్గట్టుగా ఇస్తున్నవి అరకొర అనుకుంటే వాటి విడుదలలోనూ అలసత్వం కనిపిస్తోంది. ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలలే ఉండగా.. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల పరిధిలో లబ్ధిదారుల ఎంపికే పూర్తికాలేదు. బీసీ కార్పొరేషన్‌ అసలు రుణాల ఊసెత్తడం లేదు. ఫలితంగా పేదలకు నిరాశ మిగులుతోంది. ఒక్కో శాఖవారీగా ప్రస్తుత పరిస్థితి పరిశీలిస్తే...

బీసీలకు తప్పని ఎదురుచూపులు

ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చేందుకు కార్యాచరణ, లబ్ధిదారుల ఎంపిక వంటివి చేస్తుండగా.. బీసీ కార్పొరేషన్‌ ఇవేమీ పట్టించుకోవడం లేదు. బీసీలకు 2017-18లో చివరిసారి రుణాలు విడుదల చేశారు. తరువాత నాలుగేళ్లుగా రుణ లక్ష్యాలు, వాటి అమలు ఊసే కనిపించడం లేదు. కేవలం నాయీబ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్‌ పథకం నిధులు మినహా ఇతర కార్యక్రమాలు చేపట్టడం లేదు. నిధుల కొరతే కారణమని అధికారులు చెబుతున్నారు.

లక్ష్యం భళా.. అమలు డీలా

ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీ రుణాల జారీ నత్త నడకన సాగుతోంది. 2020-21, 2021-22 సంవత్సరాలకుగాను హైదరాబాద్‌ జిల్లాలో సబ్సిడీ రుణాల విడుదలకు కార్యాచరణ రూపొందించినా.. అమలు మాత్రం మరిచారు. 2020-21లో 75 మందికి రూ.92.40లక్షలు విడుదల లక్ష్యం నిర్దేశించినా.. ఇప్పటికీ లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదు. ప్రస్తుత ఏడాదిలో రూ.3.48 కోట్లను 436 మందికి పంపిణీ చేయాలని నిర్ణయించినా, లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. జోనల్‌ స్థాయిలో ఎంపిక పూర్తికాలేదని, అవి పూర్తయ్యాకే నిధులు విడుదలవుతాయని అధికారులు చెబుతున్నారు.


మూడేళ్లలో ఇచ్చింది ఒక్కసారే..

ఎస్సీ కార్పొరేషన్‌ పరిధిలో రుణాల జారీ గందరగోళంగా మారింది. అసలు రుణాలు ఇస్తున్నారా లేదా అన్నదే పెద్ద ప్రశ్న. 2019-20లో అసలే ఇవ్వలేదు. 2020-21లో లక్ష్యాన్ని ప్రకటించి.. దాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2021-22)లో అంటే ఏడాది ఆలస్యంగా అమలుచేస్తున్నారు. ఈసారి(2021-22)లో కార్యాచరణే ప్రకటించలేదు. మూడేళ్లలో ఒక్కసారి మాత్రమే ఇవ్వడంతో వేల మందికి నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుతం ఒక ఏడాది ఆలస్యంగా ఇస్తున్నా.. లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు. త్వరలో ముఖాముఖి నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని