logo

తెలివి మీరిన సైబర్‌ నేరగాళ్లు

తెలుగు ప్రజలను మోసం చేసేందుకు ఇక్కడి యువతను రప్పించుకుని మరీ ఆన్‌లైన్‌ మోసాలకు తెగబడుతున్న ఝార్ఖండ్‌ ప్రాంతానికి చెందిన ముఠాలోని 9 మందిని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టుచేశారు.

Published : 29 Jan 2022 04:25 IST

తెలుగువారిని ఝార్ఖండ్‌ తీసుకెళ్లి శిక్షణ.. దోచిన సొత్తులో కమీషన్‌


రాజు
సంతోష్‌ ప్రభుదేవా

నాగోలు, న్యూస్‌టుడే: తెలుగు ప్రజలను మోసం చేసేందుకు ఇక్కడి యువతను రప్పించుకుని మరీ ఆన్‌లైన్‌ మోసాలకు తెగబడుతున్న ఝార్ఖండ్‌ ప్రాంతానికి చెందిన ముఠాలోని 9 మందిని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టుచేశారు. ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ కథనం ప్రకారం... సైబర్‌ నేరాలకు పురిటిగడ్డగా మారిన ఝార్ఖండ్‌ నేరగాళ్లకు తెలుగు ప్రజలను వంచించేందుకు భాషాపరమైన ఇబ్బందులు తలెత్తుతుండటంతో కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం ఝార్ఖండ్‌కు చెందిన సైబర్‌ నేరగాడైన విక్రం ఠాకూర్‌ వారంరోజులపాటు నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో డేరా వేశాడు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన వనపర్తి జిల్లా పెద్దమందాడి మండలానికి చెందిన కత్రావత్‌ రాజు(27)తో స్నేహం చేశాడు. తన వెంట ఝార్ఖండ్‌కు వస్తే మంచి జీతం ఇప్పిస్తానని నమ్మించాడు. తాము చేసే ఆన్‌లైన్‌ మోసాల ద్వారా 30శాతం కమీషన్‌ను ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో రాజు తన సమీప బంధువైన మరో ఆటోడ్రైవర్‌ కత్రావత్‌ సంతోష్‌తో కలిసి సమీప బంధువులైన యువకులను చేరదీశారు. వీరిద్దరితోపాటు ఇస్లావత్‌ గణేష్‌ ఆలియాస్‌ ప్రభుదేవా(21), మూఢావత్‌ వెంకటేష్‌(18), డేగావత్‌ శ్రీనివాసులు(22), కేతావత్‌ హరిలాల్‌(19), కత్రావత్‌ గణేష్‌(19), మూఢావత్‌ గణేష్‌(19) అనే విద్యార్థులు, కేతావత్‌ రాజు(21) అనే రైతు జత కట్టారు. వీరంతా విక్రమ్‌ ఠాకూర్‌ వెంట గతేడాది జార్ఖండ్‌కు వెళ్లారు. అక్కడ వారందరికీ వసతి ఏర్పాటు చేసిన విక్రం... వేర్వేరు సిమ్‌ కార్డులు, సెల్‌ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు ఇప్పించాడు. అమాయక ప్రజలను ఆన్‌లైన్‌లో ఎలా మోసం చేయాలో శిక్షణ ఇప్పించాడు. ఆపై రుణాలు పొందేందుకు ఆసక్తి చూపుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజల సమాచార డాటాను వారికి అందించాడు. రుణాలు, ఇతర బ్యాంకు సేవలందిస్తామంటూ వారు ఫోన్ల ద్వారా అచ్చమైన తెలుగులో ఆకర్షించి ఆపై ప్రాసెసింగ్‌ ఫీజుల రూపేణా పెద్దమొత్తంలో డబ్బును ఆన్‌లైన్‌ ద్వారా జమచేయించుకుంటున్నారు. ఇలా మోసం చేసి సంపాదించిన సొత్తులోంచి 30శాతం కమీషన్‌ను కత్రావత్‌ రాజు, సంతోష్‌లు విక్రం ఠాకూర్‌ నుంచి వసూలు చేసుకుని వారందరికీ పంపిణీ చేస్తున్నారు. ఇలా సంపాదించిన సొత్తుతో పండగలకు సొంతూరికి వచ్చి జల్సా చేస్తున్నారు. డబ్బంతా ఖర్చయిపోగానే తిరిగి జార్ఖండ్‌కు పయనమవుతున్నారు. కాగా... ఈ ముఠా సభ్యుల సమాచారాన్ని అందుకున్న జార్ఖండ్‌ పోలీసులు ఇటీవల దాడిచేయగా... అక్కడి నిందితులతోపాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారూ ఉండటంతో ఇక్కడి రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు వారు సమాచారాన్ని అందజేశారు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌తోపాటు 20మంది పోలీసులు వెళ్లి 9మంది నిందితులను పీటీ వారెంటు కింద పట్టితెచ్చారు. వారందర్నీ శుక్రవారం రిమాండుకు తరలించారు.


వెంకటేష్‌  శ్రీనివాసులు హరిలాల్‌


కె.గణేష్‌ ఎం.గణేష్‌ కె.రాజు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు