logo

ముగ్గులోకి దించి.. మత్తులో ముంచి!

నగరంతో దేశ, విదేశాలకు రవాణాసౌకర్యాలు అందుబాటులో ఉండటం, రాకపోకలు సాగించేందుకు అనుకూల వాతావరణం ఇవన్నీ మత్తురవాణాకు కలసివస్తున్నాయి. గతేడాది ప్రభుత్వం మత్తుపదార్థాల కట్టడిపై పోలీసు, ఎక్సైజ్‌శాఖలకు ఆదేశాలు ఇచ్చేంత

Updated : 06 Apr 2022 05:18 IST

దేశం నలువైపులా నుంచి నగరానికి మాదకద్రవ్యాలు
గ్రేటర్‌ పరిధిలో వందలాది మంది ఏజెంట్లు
ఈనాడు, హైదరాబాద్‌

ఏవోబీ; గంజాయి, రాజస్థాన్‌; నల్లమందు, గోవా; ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌, ఎండీఎంఏ, పశ్చిమబెంగాల్‌; హెరాయిన్‌, తాజాగా పంజాబ్‌ నుంచి గసగసాల గడ్డి
- దేశం నలువైపుల నుంచి హైదరాబాద్‌ నగరానికి చేరుతోన్న మాదకద్రవ్యాల జాబితా ఇది.

నగరంతో దేశ, విదేశాలకు రవాణాసౌకర్యాలు అందుబాటులో ఉండటం, రాకపోకలు సాగించేందుకు అనుకూల వాతావరణం ఇవన్నీ మత్తురవాణాకు కలసివస్తున్నాయి. గతేడాది ప్రభుత్వం మత్తుపదార్థాల కట్టడిపై పోలీసు, ఎక్సైజ్‌శాఖలకు ఆదేశాలు ఇచ్చేంత వరకూ స్మగ్లర్లు యథేచ్ఛగా లావాదేవీలు నిర్వహించారు. ప్రస్తుతం పోలీసుల ముమ్మర తనిఖీలతో సామాజిక మాధ్యమాలు, డార్క్‌నెట్‌ వంటి వాటిని లావాదేవీలకు అనువుగా మలచుకున్నారు.

బాధితులే విక్రేతలుగా మారి..
చదువు, వ్యాపారం, పర్యాటక వీసాలపై భారత్‌ చేరిన నైజీరియన్లు ఈ మొత్తం రాకెట్‌లో అసలు సూత్రధారులు. పబ్‌ల్లో ఏర్పడిన పరిచయాలతో విక్రయాలు జరుపుతున్నారు. కొందరు పబ్‌ల నిర్వాహకులు ప్రధాన ఏజెంట్లుగా పనిచేస్తూ కమీషన్‌ తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. బేగంపేజ్‌, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలిలోని మూడు పబ్‌లు యువతను ఆకర్షించేందుకు డే/నైట్‌ పార్టీల్లో ఎల్‌ఎస్‌డీ ఉచితంగా ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. పబ్‌లు, బార్‌అండ్‌ రెస్టారెంట్లు, దాబాలు, వ్యాయామ కేంద్రాలు, మ్యూజిక్‌/థీమ్‌ పార్టీల వేదికలు మత్తుపదార్థాలు విక్రయించే ఏజెంట్లకు అనుకూల ప్రాంతాలు. జిమ్‌ల్లో ఊబకాయం/అధికబరువుతో ఉన్న యువకులు వీరి లక్ష్యం. వ్యాయామ శిక్షకుల సూచనతో బరువు తగ్గేందుకు తమ వద్ద పౌడరు ఉందంటూ తక్కువ మోతాదులో ఎండీఎంఏ అలవాటు చేస్తారు. దాని ప్రభావంతో ఆకలి తగ్గటం, ఎక్కువ సమయం వ్యాయామం చేసేందుకు అవసరమైన శక్తి రావటంతో వినియోగించిన వారు కూడా నమ్ముతున్నారు. ఐటీ, కార్పొరేట్‌ ఉద్యోగులు, విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు తీసుకుంటూ క్రమంగా బానిసలవుతున్నారు. సరుకు కొనేందుకు సొమ్ముల్లేక మత్తుపదార్థాలు విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు. ఏజెంట్ల వద్ద సబ్‌ఏజెంట్లుగా పనిచేస్తూ మాదకద్రవ్యాలను కొనుగోలుదారులకు(పెడ్లర్స్‌)కు అందజేసి కమీషన్‌ తీసుకుంటున్నారు. ఇటీవల పోలీసు, అబ్కారీ అధికారులు అరెస్ట్‌ చేస్తున్న వారిలో అధికశాతం ఈ జాబితాలోని వారే ఉంటున్నారు. చెడుస్నేహాలు, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం వంటి కారణాలతోనే ఎక్కువ మంది యువకులు మత్తుకు బానిసలవుతున్నారని ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెంండెంట్‌ కె.నవీన్‌కుమార్‌ తెలిపారు.


విలాసవంతమైన జీవితం..

మాదకద్రవ్యాలు ఎక్కడ నుంచి వస్తాయి? అసలు వ్యక్తి ఎవరు? అనేది అత్యంత రహస్యంగా ఉంచుతారు. గోవా, ముంబయి, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి హెరాయిన్‌, కొకైన్‌, ఎండీఎంఏ కొనుగోలు చేసిన దళారులు ఏజెంట్లు, సబ్‌ఏజెంట్లు, కొరియర్‌/డెలివరీ బాయ్స్‌ ద్వారానే మత్తుపదార్థాలను చేరవేస్తుంటారు. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రూపుల ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఇదే వృత్తిగా కొనసాగించే ఒక్కో ఏజెంట్‌ నెలకు రూ.60,000-70,000, సబ్‌ ఏజెంట్లు రూ.25,000 వరకూ సంపాదిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సౌకర్యవంతమైన భవనాలు, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసి విలాసవంతంగా జీవిస్తుంటారని తెలుస్తోంది. ఇటీవల కేపీహెచ్‌బీ, టోలిచౌకి వద్ద ఎక్సైజ్‌ అధికారులు మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మత్తుపదార్థాల విక్రయం ద్వారా వచ్చిన సొమ్ముతోనే కొనుగోలు చేసినట్టు గుర్తించారు. గతేడాది కూకట్‌పల్లిలో అరెస్టయిన మాదకద్రవ్యాల విక్రేత కొత్తగా కొనుగోలు చేసిన కారు ధర అక్షరాలా రూ.90లక్షలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని