logo

మీరు కొనే స్వర్ణం.. ఎంత స్వచ్ఛం?

అక్షయ తృతీయ అంటేనే ఓ సెంటిమెంటు! గ్రామో, కాసో, తులమో.. ఇలా ప్రజలు తమ స్తోమతకు తగ్గట్టుగా బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం బంగారం ధర ఎక్కువగా ఉంది.

Published : 03 May 2022 02:25 IST

నాణ్యత తక్షణ నిర్ధరణకు బీఐఎస్‌ కేర్‌ యాప్‌

హాల్‌మార్కు చూసి కొనాలంటున్న నిపుణులు

ఏటా రెండు టన్నుల మేర విక్రయాలు

నేడే అక్షయ తృతీయ

ఈనాడు, హైదరాబాద్‌ : అక్షయ తృతీయ అంటేనే ఓ సెంటిమెంటు! గ్రామో, కాసో, తులమో.. ఇలా ప్రజలు తమ స్తోమతకు తగ్గట్టుగా బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం బంగారం ధర ఎక్కువగా ఉంది. సోమవారం హైదరాబాద్‌ మార్కెట్‌లో పది గ్రాముల ధర రూ.52,910గా ఉంది. ఎంతో ఖర్చు పెట్టి కొనుగోలు చేసేప్పుడు.. ఏమాత్రం ఏమరుపాటు లేకుండా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. హాల్‌ మార్కు ఉన్న ఆభరణాలే కొనాలని సూచిస్తున్నారు. భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) ధ్రువీకరించిన హాల్‌ మార్కు ముద్ర ఉంటేనే నాణ్యమైన బంగారంగా గుర్తించాలని చెబుతున్నారు. నేడు అక్షయ తృతీయ సందర్భంగా ‘ఈనాడు’ ప్రత్యేక కథనం...

క్షణాల్లో తేల్చేయొచ్చు!.. మనం కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్‌ ముద్ర, బంగారు ఆభరణాలకు భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) హాల్‌ మార్కును అందిస్తోంది. ఐఎస్‌ఐ ముద్రతోపాటు ప్రతి తయారీదారుకు లైసెన్సును అందిస్తోంది. వీటన్నింటినీ వినియోగదారులు సులువుగా పరీక్షించుకుని, వస్తువుల నాణ్యతను నిర్ధారించుకునేందుకు బీఐఎస్‌ కేర్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నగల దుకాణానికి వెళ్లినప్పుడు వినియోగదారులు ప్రతి నగపై ముద్రించే హాల్‌ మార్కు లోగో, హాల్‌ మార్కు యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ (హెచ్‌యూఐడీ) సంఖ్య గమనించాలి. యాప్‌లో ఉన్న వెరిఫై హెచ్‌యూఐడీ విభాగంలో ఈ నంబరుతో.. ఆభరణం తయారీ, నాణ్యతకు సంబంధించి అన్ని వివరాలు ఇట్టే తెలిసిపోతాయి.

ఏంటీ హాల్‌ మార్కింగ్‌?.. వినియోగదారులకు స్వచ్ఛ బంగారం చేర్చడం, పునర్‌ విక్రయ అవకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది జూన్‌ 23 నుంచి హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఉండగా.. .. వచ్చే నెల నుంచి మరిన్ని జిల్లాల్లో అందుబాటులోకి రానున్నాయి.

నగలపై ఇవి ఉన్నాయా?

1. బీఐఎస్‌ ముద్ర 2. బంగారం నాణ్యత 3. హెచ్‌యూఐడీ నంబరు (హాల్‌మార్కు యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరు)

పండగపైనే ఆశలు

ఈ ఏడాది అక్షయ తృతీయకు దేశవ్యాప్తంగా దాదాపు 25-30 టన్నుల బంగారు ఆభరణాలు అమ్ముడవుతాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2019లో ఇది 23 టన్నులు ఉండగా, 2020లో కొవిడ్‌ కారణంగా కొనుగోళ్లు పెద్దగా లేవు. గతేడాది 2021లో 20శాతం పెరగ్గా.. ఈ ఏడాది పెళ్లిళ్లు, వేడుకలు కలిసి రావడంతో కొనుగోళ్లు భారీగా జరుగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌ నగర మార్కెట్లో ఏటా అక్షయ తృతీయ ఒక్కరోజే టన్ను వరకు బంగారు ఆభరణాలు అమ్ముడవుతాయని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా మరో టన్ను మేర అమ్మకాలు జరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.

మార్కెట్లో ఎక్కువగా 14, 18, 22 క్యారెట్ల బంగారమే ఆభరణాలకు వినియోగిస్తారు. వాటిపై కోడ్‌ 22కే916, 14కే585 అని ముద్రించి ఉంటుంది.


‘మార్కు’ ఉండాల్సిందే

- కేవీ రావు, డైరెక్టర్‌, బీఐఎస్‌ హైదరాబాద్‌ శాఖ

అభరణాలు కొనేప్పుడు ముందుగా హాల్‌మార్కు ఉందా.. లేదా తప్పకుండా పరిశీలించాలి. అందుబాటులో ఉన్న హాల్‌మార్కు కేంద్రాలలో రూ.45 చెల్లించి నగల నాణ్యత తెలుసుకోవచ్ఛు వర్తకుల వద్ద కొనేముందు బీఐఎస్‌ కేర్‌ యాప్‌ వినియోగించి నాణ్యత గుర్తించవచ్ఛు వస్తువుల నాణ్యత, శుద్ధత విషయంలో ఎలాంటి అనుమానాలున్నా, బీఐఎస్‌ హైదరాబాద్‌ విభాగాన్ని సంప్రదించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని