Hyd News: వాచీ పెట్టుకొని వస్తే ఉద్యోగం: మోసపోయిన ఇంటర్‌ విద్యార్థులు

ఉద్యోగాలు కల్పిస్తామని డబ్బులు తీసుకొని ఓ సంస్థ మోసానికి పాల్పడిందని పలువురు ఇంటర్‌ విద్యార్థులు చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నాగేశ్వరరావు, బాధితులు తెలిపిన ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా,

Published : 19 May 2022 07:09 IST

చందానగర్‌ ఠాణా వద్ద బాధితులు

శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే: ఉద్యోగాలు కల్పిస్తామని డబ్బులు తీసుకొని ఓ సంస్థ మోసానికి పాల్పడిందని పలువురు ఇంటర్‌ విద్యార్థులు చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నాగేశ్వరరావు, బాధితులు తెలిపిన ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా, భూత్పూర్‌ మండలం, తాటికొండ గ్రామానికి చెందిన నారాయణ కుమారుడు గోపన్‌పల్లి సురేష్‌. ఇతని స్నేహితుడు శ్రీకాంత్‌లు భూత్పూర్‌ గ్రామంలో కళాశాలలో చదువుతున్న పలువురిని కలిశారు. నిరుద్యోగులు ఒక్కొక్కరు రూ.లక్ష చెల్లిస్తే వారికి ముందుగా రూ.70 వేల విలువైన వాచ్‌ ఇచ్చి, రూ 15 వేల జీతం, అదనపు అలవెన్సులతో ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున తీసుకున్నారు. కొందరికి వాచ్‌లు అందించి ఈ వాచీ పెట్టుకొని చందానగర్‌ గంగారంలో కొనసాగుతున్న విహన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ సంస్థకు వస్తే ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. మీరు ఒక్కొక్కరు ముగ్గురి చొప్పున డ[బ్బులు కట్టేట్లు చేస్తే మరింతగా సదుపాయాలు, నగదు వస్తాయని అన్నారు. ఆశపడ్డ 9 మంది విద్యార్థులు డబ్బులు చెల్లించారు. కానీ ఉద్యోగాలు రాలేదు. ఈ విషయమై సురేష్‌ను నిలదీయగా తాను సంస్థ వారికి చెల్లించాను, వారినే అడుగుదాం రండి అంటూ.. చందానగర్‌కు తీసుకొచ్చాడు. గంగారంలోని కార్యాలయానికి వెళ్లగా మీరు చెల్లించిన డబ్బులు మాకు అందలేదు.. శ్రీకాంత్‌ తీసుకున్నాడు. అతడినే అడగండి అని తెలపడంతో మోసపోయామని బాధిత విద్యార్థులు గ్రహించారు. దీనిపై చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గొలుసుకట్టు వ్యవహారంగా ఉండటంతో ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు మోసపోయి ఉండచ్చునోనని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని